‘యాదాద్రి కాదు.. ఇకపై యాదగిరి గుట్ట’.. ప్రకటించిన సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టిన రోజున యాదాద్రీశుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగానే యాదాద్రి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

Update: 2024-11-08 10:21 GMT

సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తన పుట్టిన రోజు సందర్భంగా యాదాద్రీశుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగానే యాదాద్రి(Yadadri Temple) విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. యాదాద్రి పేరును కాస్తా యాదగిరి గుట్ట(Yadagiri Gutta)గా మారుస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపై అన్ని రికార్డుల్లో కూడా పేరును మార్చాలని ఆదేశించారు. యాదాద్రికి బదులుగా యాదగిరి గుట్ట పేరునే వ్యవహారికంలోకి తీసుకురావాలని అధికారులు వివరించారు. అనంతరం యాదగిరిగుట్ట అభివృద్ధి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇందులో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) తరహాలోనే యాదగిరి గుట్ట ఆలయ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిశ్చయించిందని అధికారులకు తెలిపారు సీఎం రేవంత్.

 

అన్ని చర్యలు తీసుకోండి

‘‘యాదగిరి గుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు కావాల్సిన అన్ని చర్యలు తీసుకోండి. టీటీడీ తరహాలోనే ఈ ఆలయ బోర్డు కూడా ఉండాలి. టీటీడీ స్థాయిలో ఈ బోర్డుకు కూడా ప్రాధాన్యత ఉండేలా పూర్తి అధ్యయనంతో యాదగిరి గుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయండి. అదే విధంగా గోశాలలో గోవుల సంరక్షణకు కూడా ప్రత్యేక పాలసీని తీసుకురావాలి. గోసంరక్షణకు అవసరమైతే సాంకేతికతను వినియోగించుకోవాలి. గతంలో కొండపై నిద్ర చేయడానికి భక్తులకు అవకాశం ఉండేది. దానిని మళ్ళీ కల్పించాలి’’ అని ఆదేశించారు.

 

పనుల్లో వేగం పెంచాలి

‘‘కొండపై నిద్రచేసి మొక్కులు తీర్చుకోవడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేయాలి. విమాన గోపురానికి వేస్తున్న బంగారు తాపడం పనుల్లో వేగం పెంచాలి. బ్రహ్మోత్సవా నాటికి బంగారు తాపడం పనులు పూర్తి కావాలి. ఆలయ అభవృద్ధికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలి. అవసరమైన నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. పెండింగ్ పనులు సహా ఇతర అంశాలపై ఆలయ అధికారులు సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించాలి’’ అని ఆదేశించారు.

యాదాద్రి నామకరణం చేసింది కేసీఆరే..

అయితే తొలుత యాదగిరి గుట్టగానే చలామణీలో ఉన్న ఈ ప్రాంతం పేరును తెలంగాణ తొలి సీఎం కేసీఆర్.. యాదాద్రిగా మార్చారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. యాదగిరి గుట్ట పేరును మార్చడంతో పాటు ఈ ఆలయాన్ని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేయాలని కూడా ఆనాడు కేసీఆర్ భావించారు. యాదగిరి గుట్టకు యాదాద్రి అన్న పేరును చిన్నజియర్ స్వామి సూచించారని ప్రచారం కూడా సాగింది. శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని పునర్నిర్మించాలని అప్పట్లే కేసీఆర్ నిర్ణయించారు. అప్పటి నుంచి యాదాద్రిగా ప్రస్తావనలో ఉన్న పేరును తాజాగా మరోసారి మారుస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Tags:    

Similar News