కేసీయార్ కు పొంచి ఉన్న ప్రమాదాలు

చట్టసభల్లో కేసీయార్ కు చాలాప్రమాదాలు పొంచున్నాయనే సంకేతాలు కనబడుతున్నాయి.

Update: 2024-06-22 07:30 GMT

చట్టసభల్లో కేసీయార్ కు చాలాప్రమాదాలు పొంచున్నాయనే సంకేతాలు కనబడుతున్నాయి. కేసీయార్ విషయంలో అధికారపార్టీ టార్గెట్ ఏమిటంటే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయకూడదని. 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున 38 మంది ఎంఎల్ఏలున్నారు కాబట్టితో కేసీయార్ కు ప్రధానప్రతిపక్షనేత అనే హోదా ఉంది. ఈ హోదాను కూడా ఊడపెరికేయాలన్నది రేవంత్ రెడ్డి టార్గెట్ గా పార్టీవర్గాలు చెబుతున్నాయి.

అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా అంటే క్యాబినెట్ ర్యాంకుతో సమానం. ప్రభుత్వానికి సంబంధించిన ప్రోటోకాల్ వ్యవహారాల్లో ముఖ్యమంత్రి తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతే వస్తారు. ఆ తర్వాతే మంత్రులు మిగిలిన వాళ్ళు. తెలంగాణా అసెంబ్లీలోని 119 సీట్లలో 10 శాతం సీట్లు దక్కించుకున్న పార్టీ అధినేతకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. 119 సీట్లలో 10 శాతం అంటే 11.9 సీట్లు. 11.9 సీట్లను లెక్కేయటం సాధ్యంకాదు కాబట్టి 12 సీట్లని లెక్కవేస్తారు.ఈ లెక్కన బీఆర్ఎస్ 39 సీట్లలో గెలిచింది కాబట్టే కేసీయార్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. ముందే చెప్పుకున్నట్లు ప్రధాన ప్రతిపక్ష హోదాతో కేసీయార్ కు క్యాబినెట్ మంత్రి ర్యాంకుంది కాబట్టి ప్రభుత్వం పరంగా కారు డ్రైవర్, అటెండర్లు, ఇంటి అద్దె లాంటి అనేక సౌకర్యాలున్నాయి. ఇవేవీ ఉండకూడదంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండకూడదు. ఉండకూడదంటే బీఆర్ఎస్ బలం 12కన్నా తగ్గిపోవాలి.

ఇపుడదే విషయమై అధికారపార్టీ నేతలు సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఎన్నికలు అయిన కొద్దిరోజులకే కంటోన్మెంట్ ఎంఎల్ఏ లాస్య నందిత మరణించటంతో ఉపఎన్నిక జరిగింది. ఆ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలవటంతో బీఆర్ఎస్ బలం 38కి తగ్గిపోయింది. ఈమధ్య నలుగురు ఎంఎల్ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, పోచారం శ్రీనివాసరెడ్డి కారుదిగేసి హస్తంపార్టీలో చేరిపోయారు. అంటే బీఆర్ఎస్ ప్రస్తుత బలం 34. ఇందులో నుండి మరో 20 మంది ఎంఎల్ఏలు తొందరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు విపరీతంగా ప్రచారంలో ఉంది. ప్రచారంలో ఉన్నట్లే 20 మంది ఎంఎల్ఏలు పార్టీలో నుండి వచ్చేసినా ఇంకా 14 మంది ఎంఎల్ఏలు అయితే ఉంటారు. కాబట్టి కేసీయార్ కు ప్రధాన ప్రతిపక్ష హోదాకి వచ్చిన ఇబ్బాంది ఏమీ ఉండదు. మిగిలిన 14 మందిలో ఇద్దరికన్నా ఎక్కువమంది వచ్చేసినపుడే కేసీయార్ కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా పోతుంది. అందుకనే కేసీయార్ ను దెబ్బకొట్టేందుకు వీలుంటే 30 మంది ఎంఎల్ఏలను లాక్కోవాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకున్నది. కాంగ్రెస్ ప్లన్ సక్సెస్ అయితే బీఆర్ఎస్ కు రెండు నష్టాలు జరుగుతాయి.

అవేమిటంటే మొదటిది కేసీయార్ కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా పోతుంది. రెండో నష్టం ఏమిటంటే అసెంబ్లీలో తమదే నిజమైన బీఆర్ఎస్ అని మెజారిటి ఎంఎల్ఏలు క్లైం చేసుకునే అవకాశముంది. ఇదే జరిగితే కేసీయార్ నాయకత్వంలోని బీఆర్ఎస్ కు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమనే గుర్తింపు కోల్పోతుంది. పార్టీ ఎంఎల్ఏల్లో చీలిక వచ్చేసి మెజారిటి తమదే అసలైన బీఆర్ఎస్ అంటే మాత్రం ప్రధాన ప్రతిపక్ష నేత హోదా గుర్తింపులో సమీకరణలు మొత్తం తారుమారైపోతుంది. అప్పుడు కేసీయార్ నాయకత్వంలోని ఎంఎల్ఏలు చీలికవర్గంపై అనర్హత వేటుకు లేఖలు ఇస్తునే ఉంటారు, వాటిని స్పీకర్ పక్కన పడేస్తునే ఉంటారు. ఎవరిపైనా ఎలాంటి చర్యలూ స్పీకర్ తీసుకోరు. ఎందుకంటే కేసీయార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రతిపక్షాలను చీల్చి చెండాడి చేసింది ఇదే కాబట్టి. టీడీపీ ఎంఎల్ఏలను లాగేసుకుని చివరకు టీడీపీనే అసెంబ్లీలో లేకుండా చేశారు.

టీడీపీ ఎంఎల్ఏలను బీఆర్ఎస్ లో విలీనం చేసేసుకున్నారు. తర్వాత కాంగ్రెస్ ఎంఎల్ఏల్లో చీలికలు తెచ్చి చాలామందిని తనపార్టీలోకి లాగేసుకున్నారు. అప్పట్లో పార్టీని వదిలేసిన ఎంఎల్ఏలపై అనర్హత వేటువేయాలని టీడీపీ, కాంగ్రెస్ ఎంత మొత్తుకున్నా అప్పటి స్పీకర్ పట్టించుకోలేదు. కాబట్టి ఇపుడు కేసీయార్ కు అదే జరుగుతుందనటంలో సందేహంలేదు. ఎంఎల్ఏల్లో చీలివచ్చేస్తే వచ్చేసిన వాళ్ళని స్పీకర్ చీలికవర్గంగా గుర్తిస్తారా ? లేకపోతే కాంగ్రెస్ సభ్యులుగా గుర్తిస్తారా అన్నది స్పీకర్ విచక్షణ మీద ఆధారపడుంది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది పక్కనపెట్టేస్తే ముందు కేసీయార్ అయితే సమస్యల్లో పడిపోవటం ఖాయం. కాకపోతే బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ఇపుడొచ్చినట్లే ఒక్కొక్కరుగా వస్తారా ? లేకపోతే గ్రూపుగా వచ్చేస్తారా ? అన్నది చూడాలి. కేసీయార్ కు సమస్య అసెంబ్లీలో కాదు శాసనమండలిలో కూడా పొంచుంది. 29 మంది ఎంఎల్సీల్లో మెజారిటి సభ్యులను లాగేసుకునేందుకు రేవంత్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అదే జరిగితే ఇటు అసెంబ్లీ అటు మండలిలో ఒకేసారి కేసీయార్ కు పెద్ద దెబ్బపడటం ఖాయమనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

ఇదే విషయమై సీనియర్ జర్నలిస్టు, మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ తెలంగాణా ఫెడరల్ తో మాట్లాడుతు కేసీయార్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్ధితి స్వయంకృతమన్నారు. పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలకు పూర్తి బాధ్యత కేసీయారే వహించాలన్నారు. అధికారంలో ఉన్నపుడు ప్రజలతో సంబంధాలు లేకుండా దూరమైన కారణంగా సంభవించిందే ప్రస్తుత దుస్ధితిగా రాపోలు అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News