తెలంగాణలో ఆహార కల్తీకి తెరవేసేదెన్నడు?

తెలంగాణలో విప‌రీతంగా ఆహార‌క‌ల్తీ వల్ల ప్ర‌జ‌ల ఆరోగ్యం దెబ్బతింటోంది.అయిదు సంచార ల్యాబ్ లున్నా పరీక్షలు చేసే ఉద్యోగులు లేరు, పరీక్షలు చేసే పరికరాలు లేవు.;

Update: 2025-03-30 02:46 GMT

తెలంగాణ రాష్ట్రంలో అందులోనూ హైద‌రాబాద్ న‌గ‌రంలో విప‌రీతంగా ఆహార‌క‌ల్తీ వల్ల ప్ర‌జ‌ల ఆరోగ్యం దెబ్బతింటోంది.హైదరాబాద్ నగరంలో ఏడు న‌క్ష‌త్రాల హోట‌ళ్ల నుంచి రోడ్డు ప‌క్క‌న ఉన్న చిన్న చిన్న హోట‌ళ్ల వ‌ర‌కు ఆహార‌క‌ల్తీ జ‌రుగుతుంది.హైద‌రాబాద్ లో పెద్ద సంఖ్య‌లో హోట‌ళ్లు ఉన్నా, వాటికి స‌రిపోను ఆహార‌భ‌ద్ర‌త అధికారులు (ఫుడ్ సేప్టీ అధికారులు) లేనందున క‌ల్తీ వ్య‌వ‌హారం జోరుగా సాగుతోంది. ఆహార కల్తీని నివారించాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరతతో కల్లీ, నాణ్యత లేని ఆహారం తినడం వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటోంది.


నామమాత్రంగా మారిన ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్
తెలంగాణ రాష్ట్రం మొత్తానికి నాచారంలో ఫుడ్ టెస్టింగ్ లేబొరేట‌రీ ఒక‌టే ఉంది.ఈ ల్యాబ్ లో ప‌రీక్ష నిమిత్తం స‌రై ప‌రిక‌రాలు లేవు.ఈ లేబొరేట‌రీలో సైంటిస్టులు, ఇత‌రులు క‌లిపి 78 పోస్టులు మంజూరు కాగా, ప్ర‌స్థుతం 11 మంది మాత్ర‌మే ప‌ని చేస్తున్నారు. మిగిలిన 67 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఈ ల్యాబ్ నామమాత్రంగా మారింది.కేంద్ర‌ప్ర‌భుత్వం రెండు సంవ‌త్స‌రాల క్రితం మరో మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లు వ‌రంగ‌ల్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, నిజామాబాద్ నగరాల్లో మంజూరు చేసి నిధులు కూడా విడుద‌ల చేసింది. కాని రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నిధుల‌ను వినియోగించు కోలేక‌పోవ‌డంతో ఆ నిధులు ల్యాప్స్ అయ్యే ప్ర‌మాదం నెలకొంది.

ఏర్పాటు కాని మినీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లు
తెలంగాణ రాష్ట్రంలో 60 శాతానికి పైగా ఆహార వ్యాపారం హైదరాబాద్ లోనే సాగుతుందని అధికారుల సర్వేలో తేలింది. దీంతో హైదరాబాద్ నగరంలోని ఆరు జోన్లలో ఆరు మినీ ఫుడ్ ల్యాబ్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా అవి కార్యరూపం దాల్చలేదు. కల్తీ, నాణ్యత లేని ఆహారంపై ప్రజలు నమూనాలను సేకరించి మినీ ఫుడ్ ల్యాబ్ లకు తీసుకువచ్చి పరీక్షలు చేయించాలనే నిర్ణయం అమలు కాలేదు. హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల పోస్టులు 20కి పైగా ఖాళీగానే ఉన్నాయి.హైదరాబాద్ నగరంలో ఉన్న మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లు మూలన పడ్డాయి.

ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లలో పరికరాలేవి?
ప్ర‌స్థుతం రాష్ట్రంలో ఒక సంచార ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ (మొబైల్‌ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌) ఉంది. ఇందులో స‌రిపడా ప‌రిక‌రాలు లేక ప‌రీక్ష‌లు అంతంత మాత్ర‌మే మారాయి.ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం 5 సంచార ల్యాబ్ ల‌ను మంజూరు చేస్తూ నిధులు విడుద‌ల చేసింది. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వం రూ. 2.40 కోట్లతో 5 వ్యానులైతే కొన్నారు కాని అందులో ప‌రీక్ష‌ల కోసం కావాల్సిన ప‌రిక‌రాలు కొన‌లేదు.దీంతో కేంద్ర నిధులు ల్యాప్స్ అయ్యే ప‌రిస్థితి ఉంది.తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) సహకారంతో ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ భావనను ప్రారంభించింది. ఇది పాలు, నీరు, తినదగిన నూనె, రోజువారీ వినియోగించే ఇతర ఆహార పదార్థాల్లో సాధారణ కల్తీ పదార్థాలను గుర్తించడానికి సాధారణ పరీక్షలు నిర్వహించాలి. కానీ పరికరాలు లేక పరీక్షలు చేయడం లేదు.

ఇంటి వద్దకే ఆహార పరీక్షలేవి?
హైదరాబాద్ నగరంలో రోజూ తినే ఆహార పదార్థాల్లో కల్తీ పదార్థాల పరీక్ష ఇప్పుడు తెలంగాణలోని వినియోగదారుల ఇంటి వద్దకే అందుబాటులో తీసుకురావాలనే లక్ష్యం నెరవేరడం లేదు. భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ (FSSAI) సహకారంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ భావనను ప్రారంభించినా సజావుగా సాగటం లేదు.

సీఎంకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
గ‌తంలో ప్ర‌తి జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఆహార క‌ల్తీ గురించి ప్ర‌జ‌లు ఫిర్యాదు చేయ‌డానికి ఒక విభాగం ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించినా అది కార్యరూపం దాల్చ‌క కాగితాల‌కే ప‌రిమిత‌మైంది.ఆహార‌క‌ల్తీ స‌మ‌స్య‌ను దృష్టిలో ఉంచుకొని క‌ల్తీ నివార‌ణకు ప‌క‌డ్బందీగా చ‌ర్య‌లు తీసుకోవాలని అందులో భాగంగా కావాల్సినంత మంది ఆహార భ‌ద్ర‌తా అధికారుల‌ను నియ‌మించాల‌ని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి కోరారు. వ‌రంగ‌ల్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నిజామాబాద్ లో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ల‌ను ఏర్పాటు చేయాల‌ని ఇంకా మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ల‌ను ప‌నిచేయించాల‌ని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి శనివారం లేఖ రాశారు.



Tags:    

Similar News