తెలంగాణలో మళ్లీ వీధికుక్కల బెడద, నియంత్రణకు చర్యలేవి?
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ శుక్రవారం వీధికుక్కల బెడద తీవ్రమైంది. కరీంనగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కుక్కలు జనంపై దాడి చేసి పలువురిని కరిచాయి.
By : Shaik Saleem
Update: 2024-10-04 15:14 GMT
తెలంగాణ రాష్ట్రంలో వీధికుక్కల బెడదను నియంత్రించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా, వీటిని నియంత్రించడంలో మున్సిపల్, పంచాయతీల అధికారులు విఫలమయ్యారు.
- కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామ, కోరపల్లి గ్రామాల్లో కుక్కలు పిల్లలపై దాడి చేశాయి. కోరపల్లి గ్రామంలో వీధి కుక్కలు నాలుగేళ్ల బాలికతోపాటు అయిదుగురిపై వీధికుక్కలు దాడి చేసి కరిచాయి.కొత్తపల్లిలో మరొకరిని వీధి కుక్కలు వెంటాడి కరిచాయి.
- వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలిక తీవ్రంగా గాయపడటంతో ఆమెను చికిత్స కోసం వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
పంచాయతీ కార్యాలయం ముందు గ్రామస్థుల నిరసన
కోరపల్లి గ్రామంలో వీధికుక్కల దాడులతో జనం పంచాయతీ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. వీధి కుక్కలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి తారక రామారావు హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో...
జోగులాంబ గద్వాల జిల్లాలోని అమర్ వాయి గ్రామంలో రేవంత్ అనే ఆరేళ్ల బాలుడిని వీధికుక్కలు కరిచాయి. గ్రామంలోని ఇంటి ముందు బాలుడు ఆడుకుంటుండగా వీధికుక్కలు మూకుమ్మడిగా వచ్చి కరిచాయి. బాలుడి చేతులు, కంటివద్ద, తల వద్ద తీవ్ర గాయాలయ్యాయి. కుక్కకాట్లతో బాధపడుతున్న బాలుడిని కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిల్లలు, వృద్ధులను వీధి కుక్కలు తరచూ కరుస్తున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని కోరపల్లి గ్రామస్థులు చెప్పారు.
హైదరాబాద్ నగరంలోనూ వీధికుక్కల కాట్లతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య పెరిగింది. వీధి కుక్కల బెడదను నివారించడంలో జీహెచ్ఎంసీ అధికారులు విఫలమయ్యారు. కోర్టు ఆదేశాలను మున్సిపల్ అధికారులు బేఖాతరు చేయడంతో వీధి కుక్కల కాట్లతో జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు.