2050-విజ‌న్‌తో వ‌రంగ‌ల్ మాస్ట‌ర్ ప్లాన్

చారిత్రిక నేప‌ధ్యం ఉన్న వ‌రంగ‌ల్ న‌గ‌ర అభివృద్దికి మాస్టర్‌ప్లాన్ రూపొందించనున్నట్లు వ‌రంగ‌ల్ ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వెల్లడించారు.

Update: 2024-11-05 13:16 GMT

వ‌రంగ‌ల్ న‌గ‌ర అభివృద్దికి భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా 2050 జ‌నాభాను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన మాస్ట‌ర్ ప్లాన్ తుది ద‌శ‌కు చేరుకుంద‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు.త్వ‌ర‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మాస్ట‌ర్ ప్లాన్‌ను విడుద‌ల చేస్తామని ఆయన ప్రకటించారు.

- మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని ఎమ్ .సి.హెచ్ .ఆర్.డీ లో వ‌రంగ‌ల్, హ‌న్మ‌కొండ జిల్లాల‌ అభివృద్ది కార్య‌క్ర‌మాల‌పై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి , ఆయా జిల్లాల ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో క‌లిసి మంత్రి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.
- ఈ స‌మావేశంలో నూత‌న మాస్ట‌ర్ ప్లాన్ ,వ‌రంగ‌ల్ ఇన్న‌ర్ రింగ్ రోడ్‌, ఔట‌ర్ రింగ్ రోడ్‌, భ‌ద్ర‌కాళి టెంపుల్ అభివృద్ది, అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజ్‌, మెగా టెక్స్‌టైల్ పార్క్‌, మామునూరు ఎయిర్‌పోర్ట్, ఎకో టూరిజం త‌దిత‌ర అంశాల‌పై స‌మావేశంలో మంత్రి చ‌ర్చించారు.

వరంగల్ అభివృద్ధిపై సీఎం దృష్టి
హైద‌రాబాద్ న‌గ‌రానికి ధీటుగా వరంగ‌ల్ న‌గ‌రాన్ని అభివృద్ది ప‌ర‌చాల‌న్న కృత‌నిశ్చ‌యంతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌త్యేక దృష్టి సారించారని మంత్రి పొంగులేటి చెప్పారు. ఎన్నొ సంవ‌త్స‌రాలుగా పెండింగ్ లో ఉన్న వ‌రంగ‌ల్ మాస్ట‌ర్ ప్లాన్‌ను త‌మ ప్ర‌భుత్వం కొలిక్కి తీసుకువచ్చింద‌ని ఆయన పేర్కొన్నారు.అభివృద్ది ప‌నుల వేగం పెంచాల‌ని అధికారుల‌ను ఆయన ఆదేశించారు.

ఇన్న‌ర్ రింగ్ రోడ్, ఔట‌ర్ రింగ్ రోడ్‌
ఇన్న‌ర్ రింగ్ రోడ్, ఔట‌ర్ రింగ్ రోడ్‌కు అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న చేప‌ట్టాల‌ని అధికారుల‌ను మంత్రి పొంగులేటి ఆదేశించారు. 41 కిలోమీట‌ర్ల ప‌రిధి ఉన్న వ‌రంగ‌ల్ ఔట‌ర్ రింగ్ రోడ్డును మూడు ద‌శ‌ల్లో చేప‌ట్టాల‌ని ఆయన సూచించారు., మొద‌టి ద‌శ‌లో 20 కిలో మీట‌ర్లు, రెండ‌వ ద‌శ‌లో 11 కిలోమీట‌ర్లు, మూడ‌వ ద‌శలో 9 కిలోమీట‌ర్లు చేప‌ట్టాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యించారు.



 వ‌రంగ‌ల్ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం

హైద‌రాబాద్ మిన‌హా రాష్ట్రంలో మ‌రెక్క‌డా ఎయిర్‌పోర్ట్ లేద‌ని వ‌రంగ‌ల్ జిల్లాలో ఎయిర్ పోర్ట్ రాబోతోంద‌ని మంత్రి శ్రీనివాసరెడ్డి చెప్పారు. వీలైనంత త్వ‌ర‌గా ఎయిర్‌పోర్ట్ ప‌నుల‌ను ప్రారంభించి ఏడాదిలోపు ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకురావ‌డానికి అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు.

భ‌ద్ర‌కాళి చెరువును పునరుద్ధరిస్తాం
382 ఎక‌రాల ప‌రిధిలో ఉన్న చారిత్రాత్మ‌క‌మైన భ‌ద్ర‌కాళి చెరువులో పేరుకుపోయిన పూడిక‌ను తీయాల‌ని , ఇందుకు సంబంధించిన ప‌నుల‌ను రేప‌టినుంచే మొద‌లు పెట్టాల‌ని మంత్రి పొంగులేటి ఆదేశించారు. ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది లేకుండ చెరువును ఖాళీ చేయాల‌ని అధికారుల‌కు ఆయన సూచించారు . ఈ చెరువు 40 శాతం గుర్ర‌పుడెక్క‌తో నిండిపోయింద‌న్నారు. మెగా టెక్స్ టైల్‌ పార్క్ లో ఏర్పాటు చేసిన కంపెనీలు త‌ప్ప‌నిస‌రిగా స్దానికుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. వ‌రంగ‌ల్ న‌గ‌రంలో అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప‌నుల‌ను వీలైనంత త్వ‌ర‌గా ప్రారంభించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.


Tags:    

Similar News