హైదరాబాద్‌ను వణికిస్తున్న వైరల్ జ్వరాలు
హైదరాబాద్ నగరంలో వైరల్ జ్వరాల ఇన్ఫెక్షన్లు ప్రబలుతున్నాయి.డెంగీ,మలేరియా, వైరల్ జ్వరాల జోరుతో రోగులు వణుకుతున్నారు.ఈ జ్వరాల నియంత్రణకు వైద్యశాఖ సిద్ధం అయింది.
By : Shaik Saleem
Update: 2024-08-30 05:16 GMT
నగరంలో డెంగీ,వైరల్,మలేరియా ఇతర జ్వర లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రోగులను పరీక్షించిన తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య శాఖ వైద్యులు అనుమానాస్పద డెంగీ కేసులుగా నమోదు చేస్తున్నారు.కానీ డెంగీ వంటి అంటువ్యాధుల వ్యాప్తికి ఇతర వైరల్ జ్వరాల ఇన్ఫెక్షన్లు కారణమా అనేది వైద్యులు పరిశోధించడం లేదు.
విపరీతమైన జ్వరం,ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గడం, ఒళ్లు నొప్పులు వంటి డెంగీ లక్షణాలు రోగుల్లో కనిపించినప్పటికీ, వారిని పరీక్షిస్తే మాత్రం డెంగీ నెగిటివ్ అని రిపోర్టుల్లో వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అసలు ఈ జ్వరాలకు అసలు కారణాలు ఏమిటనేది వైద్యులకు మిస్టరీగా మారింది.రక్త పరీక్షల్లో డెంగీ నెగిటివ్ అని వచ్చినా, డెంగీ జ్వర లక్షణాలతో రోగులు ఆసుపత్రుల బాటపడుతుండటంతో వైద్యులు కలవరపడుతున్నారు.
హైదరాబాద్ నగరంలో ప్రబలుతున్న జ్వరాలకు ఏ వైరస్ కారణమనేది వైద్యఆరోగ్యశాఖ తేల్చడం లేదు. ఏ వైరస్ వల్ల ఈ జ్వరాలు వస్తున్నాయో తేల్చడానకి ప్రజారోగ్యశాఖ గాని,వైద్యఆరోగ్యశాఖ కానీ ప్రయత్నించడం లేదు. జ్వరాలు సోకడానికి కారణమైన అసలు వైరస్ ను గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వ జన్యు ప్రయోగశాలలో రక్తనమూనాలను సేకరించి పరీక్షలు చేయాలి. కానీ అలాంటి పరీక్షలు చేయకుండానే జ్వర చికిత్స చేసి చేతులు దులుపుకుంటున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ప్రభుత్వ వైద్యాధికారి చెప్పారు.
రోగులకు డెంగీ పరీక్షలు
రోగులకు డెంగీ జ్వరాల నిర్ధారణకు ఎన్ఎస్ 1, ఎలీసా పరీక్షలు చేస్తుంటారు.కొన్ని సార్లు డెంగీ పరీక్షలు ప్రతికూలంగా ఉండే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. డెంగీ ఎన్ఎస్ 1 యాంటీజెన్ ను అంటువ్యాధి సోకిన మూడవరోజు గుర్తించవచ్చు.
డెంగీ పేరిట దోపిడీ చేస్తే చర్యలు : మంత్రి దామోదర్ రాజనర్సింహ
డెంగీ జ్వరాల పేరిట దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యాధికారులను ఆదేశించారు. డెంగీ పేరిట ఆసుపత్రుల దోపిడీపై తమకు ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికోసం కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు. కొన్ని ఆసుపత్రులు ఎలీసా టెస్టులు చేయకుండా ర్యాపిడ్ పరీక్షలు చేసి, డెంగీ నిర్ధారణ చేసి దోపిడీ చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. డెంగీ జ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
జ్వరాలతో వణుకుతున్న రోగులు
హైదరాబాద్ నగరంలో జ్వరపీడితుల సంఖ్య గణనీయంగా పెరిగింది.నగరంలోని గాంధీ, ఉస్మానియా, కోరంటి, ఈఎస్ఐ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.ఆసుపత్రుల్లో ఓపీ రోగులు బారులు తీరుతున్నారు.
జ్వరాల నియంత్రణకు చర్యలు
రాష్ట్రంలో జ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేసిన కమిషనర్ జ్వరపీడితులకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలతో కదలిన వైద్యాధికారులు జ్వర పీడితులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నామని కమిషనర్ చెప్పారు.ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యశాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్ ఆకస్మిక తనిఖీలు చేసి మందుల నిల్వలపై ఆరా తీశారు. ఫీవర్ ఆసుపత్రిలో వైద్యఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆకస్మిక తనిఖీలు చేశారు. రాష్ట్రలో డెంగీ, వైరల్ జ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
డెంగీ రోగులు ఆందోళన చెందవద్దు : డాక్టర్ రాజారావు
డెంగీ రోగులకు చికిత్స అందిస్తున్నామని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. డెంగీ రోగులకు ప్లాస్మా లీకేజీ జరుగుతున్నందున చికిత్స చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. డెంగీ జ్వరం వస్తే రోగులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు.
వరంగల్,మహబూబ్ నగర్ జిల్లాల్లో ఇద్దరు మృతి
వరంగల్,మహబూబ్ నగర్ జిల్లాల్లో ప్రబలిన విష జ్వరాలతో ఇద్దరు రోగులు మరణించారు. నర్సంపేటలో జ్వరంతో అర్జున్ అనే యువకుడు చికిత్స పొందుతూ మరణించాడు. మహబూబ్ నగర్ జిల్లాలో 58 ఏళ్ల బానోత్ లచ్చిరామ్ మృత్యువాత పడ్డారు.