Konda Surekha | ‘ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే కోడెల పంపిణీ’
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ కోడెలను అక్రమంగా విక్రయిస్తున్నారన్న వార్తలపై మంత్రి స్పందించారు. అన్నీ మార్గదర్శకాల ప్రకారమే జరుగుతున్నాయని వివరించారు.;
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ(Vemulawada Rajarajeswara Temple) కోడెలను అక్రమంగా విక్రయిస్తున్నారని, ఇందులో మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ప్రమేయం కూడా ఉందని వస్తున్న వార్తలపై మంత్రి స్పందించారు. ఈ వార్తలన్నీ భోగస్ అని ఆమె కొట్టిపారేశారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ పాలన చూసి కడుపు మండి కొందరు కావాలనే ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని, ఏమైనా ఆధారాలు ఉంటే సంబంధి అధికారులకు అందించిన చర్యలు తీసుకునేలా చూడాలని సూచించారు. అంతేకాకుండా ఈ అక్రమాల్లో తన హస్తం ఉందంటూ వస్తున్న వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు. అసలు అక్రమాలే జరగకుంటే అందులో తన ప్రమేయం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇదంతా కూడా ప్రభుత్వం బుదరజల్లడానికి కొందరు పన్నుతున్న కుట్రేనని కొట్టిపారేశారు. గత ప్రభుత్వ హయాంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు సమర్పిస్తున్న కోడెల సంఖ్య పెరుగుతుండటంతో వాటి నిర్వహణ భారంగా మారిందని, ఈ క్రమంలో అనేక కోడెలు మరణించాయని ఆమె గుర్తు చేశారు.
కట్టుదిట్టంగా కొడెల పంపిణీ
‘‘భక్తుల విన్నపాల మేరకు మొక్కుల రూపంలో ఆలయానికి వారు సమర్పించే కోడెల నిర్వహణ నిమిత్తం విధివిధానాలు రూపొందించడం కోసం ఆరు నెలల క్రితం సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా, వేములవాడ ఆలయ ఈవో కన్వీనర్‌గా, పలువరు ఇతర సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీ కోడెల నిర్వహణకు సంబంధించి పలు మార్గదర్శకాలను రూపొందించింది. వాటి ప్రకారమే జీవోను విడుదల చేశఆం. వాటిని అనుసరిస్తూనే పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్, సంబంధిత మండల వ్యవసాయ అధికారి ధృవికరణ పత్రం ఉన్న వారికే కొడెలను పంపిణీ చేశాం. కోడెల పంపిణీ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. అన్ని పత్రాలను నిబందనలకు అనుగుణంగా ఉంటేనే ఆ రైతుకు రెండు కోడెల సంరక్షణ బాధ్యతలు అప్పజెప్పాం. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల సంరక్షణ కోసం గోశాలలో సీసీ ఫ్లోరింగ్, సరిపడా షెడ్లు, తాగునీటి సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాటు చేశాం. మూగజీవాలపై మా ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ అటువంటిది. ఎంతో నిబద్ధతతో గోశాలల నిర్వహణ, గోవుల సంరక్షణను చేపడుతున్నాం. ఈ క్రమంలో కోడెలను అక్రమంగా విక్రయించారని వస్తున్న వార్తలన్నీ కూడా కట్టుకథలు, అవాస్తవాలే’’ అని ఆమె వెల్లడించారు.
ఎప్పటిలానే జరిగింది..
‘‘సాధారణంగా మా వద్దకు వచ్చే దరఖాస్తులను పరిశీలించడం కోసం సంబంధిత అధికారులకు సిఫార్సు చేస్తుంటాం. కోడెల పంపిణీకి సంబంధించి వచ్చిన దరఖాస్తులను కూడా అదే విధంగా పంపాం. దేవస్థానం అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే కోడెలను రైతులకు పంపిణీ చేస్తున్నారు. ఇందులో ఎటువంటి అవకతవకలు, అక్రమాలు జరగలేదు. వేములవాడ ఆలయంలో ప్రతి కోడెలకు శాశ్వత ట్యాగ్ ఉంటుంది. అటువంటి ట్యాగ్‌లు ఉన్న కోడెల ఎక్కడ పట్టుబడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తోందని అసత్య ప్రచారం చేస్తూ సమాజాంలో అశాంతిని సృష్టించే అసాంఘిక శక్తులను వెలికితీసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.
అసలు వివాదం ఏంటంటే..
కోడెల పంపిణీ విషయంలో ఆలయ ఈఓ వినోద్ రెడ్డి ఒంటెద్దుపోకడ పోతున్నాడని, కోడెలను తప్పుదారి పట్టిస్తున్నారని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలంటూ విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు ఫిర్యాదు చేయడంతో అ అక్రమాలు వెలుగు చూశాయి. మంత్రి ప్రమేయంతోనే కోడెలు పక్కదారి పడుతున్నాయని హిందూ సంఘ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 12న రాంబాబు అనే వ్యక్తికి 49 కోడెదూడలను ఆలయ అధికారులు అందించడం కూడా మంత్రి కనుసన్నల్లోనే జరిగిందని వారు ఆరోపించారు. రైతులకు నామమాత్రంగా రెండు మూడు కోడెళ్లను అందించింది. రాంబాబు అనే వ్యక్తికి మాత్రం 49 కోడెళ్లను ఇవ్వడం ప్రస్తుతం తెలంగాణ అంతటా వివాదాస్పదంగా మారింది. కాగా కోడెళ్లను తాను టెండర్ ద్వారా పొందానని రాంబాబు అనే వ్యక్తి ఇప్పటికే పోలీసులకు వెల్లడించారు. ఈ క్రమంలోనే మంత్రి అనుచరుడు రాంబాబుపై వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.