తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల వర్షం కురిసింది. గురువారం కురిసిన అకాల వర్షం వల్ల పలు పంటలు దెబ్బతిన్నాయని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, కొమురం భీం అసిఫాబాద్ జిల్లాల్లో వడగండ్ల వర్షం కురిసింది. దీని వల్ల వరితోపాటు పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. వడగండ్ల వర్షం వల్ల చేతికొచ్చే పంటలు నేల పాలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. కోతకొచ్చిన మామిడి తోటలు, పిందె దశలో ఉన్న మామిడి తోటలు దెబ్బతిన్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. తెలంగాణలో పంట నష్టంపై సర్వే చేసి నివేదికలు పంపించాలని తెలంగాణ వ్యవసాయ శాఖఅధికారులు ఆదేశాలు జారీ చేశారు.
పిడుగుపాటుకు ఇద్దరు మహిళల మృతి
నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం కూడన్ పల్లి గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు అసువులు బాశారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. పొలాల్లో పనిచేస్తుండగా పిడుగులు పడటంతో ఇద్దరు మహిళలు మరణించారు.
ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ
తెలంగాణలో గురువారం కురుస్తున్న అకాల వర్షంతో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఆరంజ్ అలెర్ట్ జారీ చేశారు. మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.యాదాద్రి భువనగిరి జిల్లాలో గాలివానతో పలు చెట్లు నేలకొరిగాయి. భువనగిరి- గజ్వేలు రోడ్డుపై వాసాలమర్రి వద్ద చెట్లు కూలాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
చార్మినార్ పైనుంచి కిందపడిన పెచ్చులు
హైదరాబాద్ నగరంలోనూ గురువారం భారీవర్షం కురిసింది.భారీవర్షంతో ఖైరతాబాద్ ప్రాంతంలో హోటల్ వద్ద కారుపై చెట్టు కూలింది. అకాల వర్షంతో నగరంలోని పలు లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి.వర్షం వల్ల చార్మినార్ మీనారరుపై నుంచి మట్టిపెళ్లలు కింద పడ్డాయి.వర్షం పడుతున్న సమయంలో చార్మినార్ పిల్లర్ ఎలివేషన్ పెచ్చులు ఊడిపోయి కిందపడ్డాయి.వర్షపునీటి ప్రవాహంతో నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించి పోయింది. మలక్ పేట, రాజ్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద వర్షపునీరు నిలచింది.
అప్రమత్తంగా ఉండండి : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఆదేశించారు.ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.భారీ వర్షం, ఈదురుగాలులతో రాజధాని హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అన్ని శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు.
వర్షపునీరు నిల్వ లేకుండా చర్యలు
నగరంలో భారీవర్షం కురుస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని చీఫ్ సెక్రటరీ శాంతికుమారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.రోడ్ల పై నీటి నిల్వలు లేకుండా ట్రాఫిక్ సమస్య, విద్యుత్ అంతరాయాలు లేకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా,విభాగాలు సమన్వయం తో పని చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
విద్యుత్ సరఫరాను పునరుద్ధరించండి
విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో వెంటనే సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు.లోతట్టు ప్రాంతాల్లో జలమయమైన కాలనీల్లో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.ట్రాఫిక్ సమస్యను సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేసి వాహనదారులు త్వరగా ఇళ్లకు చేరుకునేలా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు.వివిధ శాఖల అధికారులు, సిబ్బంది చేపట్టే సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని సీఎం కోరారు. జిల్లాల్లో కూడా వర్షాలు, ఈదురుగాలులు,వడగండ్లు పడుతున్నందున జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయాలని సీఎం సూచించారు.