జగన్ ఇంటిముందు నిర్మాణాల కూల్చివేతలో కొత్త ట్విస్ట్!

హైదరాబాద్ లోటస్ పాండ్ లోని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణం అంటూ సెక్యూరిటీ ఔట్ పోస్ట్ కట్టడాలను కూల్చివేసిన ఘటనలో ట్విస్ట్ నెలకొంది.

By :  Vanaja
Update: 2024-06-16 11:28 GMT

హైదరాబాద్ లోటస్ పాండ్ లోని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణం అంటూ సెక్యూరిటీ ఔట్ పోస్ట్ కట్టడాలను కూల్చివేసిన ఘటనలో ట్విస్ట్ నెలకొంది. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైఎస్ జగన్ ఇంటి ముందు నిర్మాణాలు, షెడ్లను కూల్చివేసినందుకు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. డిమాలిషన్ ఆదేశాలు జారీ చేసిన ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ ని సస్పెండ్ చేశారు. ఆయనను సాధారణ పరిపాలన విభాగం (GAD)కి అటాచ్ చేస్తూ జీహెచ్ఎంసీ ఇంఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి నోటీసులు ఇచ్చారు.


ఏం జరిగిందంటే..

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉన్న ఇంటి ముందు ఉన్న నిర్మాణాలను, సెక్యూరిటీ గదులను జీహెచ్ఎంసీ సిబ్బంది శనివారం కూల్చివేసింది. అక్రమంగా నిర్మించారని, అందుకు పర్మిషన్ లేదని అధికారులు వెల్లడించారు. జూబ్లిహిల్స్ లోని లోటస్ పాండ్ లో ఉన్న జగన్ ఇంటి ముందు విశాలమైన ఫుట్ పాత్ ఉంటుంది. అయితే రోడ్డు స్థలాన్ని ఆక్రమించి జగన్ తన ఇంటి ముందు సెక్యూరిటీ రూములు నిర్మించారని ఫిర్యాదులు వచ్చాయి. ఏపీలో సీఎంగా విజయం సాధించాక గత ఐదేళ్లుగా జగన్ ఏపీలోని తాడేపల్లిలో ఉంటున్నారు. లోటస్ పాండ్ లోని ఇంటికి ఏపీ పోలీసులు భద్రత కల్పించారు.

అయితే లోటస్ పాండ్ నివాసం బయట ఫుట్ పాత్ ఆక్రమించి సెక్యూరిటీ రూములు నిర్మించారని ఈ నిర్మాణాలపై స్థానికులు పలుమార్లు గ్రేటర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది. ఏపీ నూతన సీఎంగా చంద్రబాబు సైతం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో లోటస్ పాండ్ లోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని శుక్రవారం సాయంత్రం జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆక్రమణల తొలగింపు బృందం వచ్చి శనివారం జగన్ ఇంటి ముందు ఉన్న నిర్మాణాలను తొలగించింది. 

Tags:    

Similar News