ట్రాఫిక్ కంట్రోల్‌కు ట్రాన్స్ జెండర్స్.. నేటి నుంచి విధుల్లోకి..

ట్రాన్స్ జెండర్లకు తెలంగాణ ప్రభుత్వం ఓ గొప్ప అవకాశం కల్పించింది.

Update: 2024-12-23 07:56 GMT

ట్రాన్స్ జెండర్లకు తెలంగాణ ప్రభుత్వం ఓ గొప్ప అవకాశం కల్పించింది. కొన్ని శారీరక మార్పుల కారణంగా వారిని కుటుంబీకులు, సమాజం చిన్న చూపుస్తూ తీవ్ర మానసిక వ్యధకు గురి చేస్తోంది. వారికి ఉద్యోగులు, ఉపాధి కల్పించడానికి కూడా చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పిస్తోంది. హైదరాబాద్‌లో విపరీతంగా ఉంటున్న ట్రాఫిక్‌ను కంట్రోలో చేయడం కోసం ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయాలను నిర్ణయించుకుంది. ఈ టీమ్‌లలో ట్రాన్స్ జెండర్లను నియమించాలని పోలీసు శాఖకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వాటి ప్రకారమే ఆసక్తి, అర్హత ఉన్న ట్రాన్స్ జెండర్లను పోలీసులు రిక్రూట్ చేసుకున్నారు. వారికి పూర్తి శిక్షణ ఇచ్చి వారిని ఉద్యోగాల్లోకి చేర్చుకుంటున్నారు. అయితే ట్రాఫిక్ రంగంలో ట్రాన్స్ జెండర్లకు అంకితభావం కనబరిస్తే అతి త్వరలోనే వారికి ఇతర శాఖల్లో కూడా అవకాశం కల్పించే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది.

ట్రాఫిక్ పోలీస్ శిక్షణ శిబిరంలో శిక్షణను పూర్తి చేసుకున్న ట్రాన్స్ జెండర్లను సోమవారం నుంచి ఛార్జ్ తీసుకోనున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం 39 మంది ట్రాఫిక్ అసిస్టెంట్లుగా డ్యూటీలోకి రానున్నారని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ క్రమంలోనే పోలీస్ కమాండ్ ఆఫీసులో ఆదివారం డిమో కూడా నిర్వహించామని తెలిపారు.ఇలా చేయడం ద్వారా సమాజంలో ట్రాన్స్ జెండర్లు అంటే ఉండే చిన్నచూపు లేకుండా చేయొచ్చని ఆశిస్తున్నామని అన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. అంతేకాకుండా సమాజంలోని ప్రజలతో ట్రాన్స్ జెండర్లు మమేకం కావడానికి ఇదొక మంచి అవకాశమని చెప్పారు.

‘‘ట్రాన్స్ జెండర్లపై వివక్ష వద్దు. వారిని వేరే విధంగా చూస్తూ ఇబ్బంది పెట్టకుండా.. వారు కూడా సమాజంలో కలిసిపోయేలా మనవంత ప్రయత్నం చేద్దాం. సీఎం సూచన, చొరవతోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ఇందులో భాగంగా ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ విధుల్లోకి నియమించే ప్రాజెక్ట్‌ను 6నెలల పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టాం. ఇది సక్సెస్ అయితే మరికొన్ని శాఖల్లో కూడా వారికి అవకాశం లభించొచ్చు. ఈ ఆలోచన కారణంగా ప్రస్తుతం దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తోంది. హైదరాబాద్‌లో ఈ విధానం విజయవంతమైతే దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ట్రాన్స్ జెండర్లకు అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావాలి. ఇందులో అవకాశాన్ని అందిపుచ్చుకున్న ప్రతి ఒక్కరూ దానిని సిద్వినియోగం చేసుకోవాలి’’ అని సూచించారు.

Tags:    

Similar News