తెలంగాణలో అవినీతి అధికారుల బండారం ఇలా బయటపడింది....
తెలంగాణలో లక్షరూపాయల నోట్లను టేబులుపై పెట్టుకొని కూర్చున్న వ్యక్తిని చూశారా? ఆయనెవరోకాదు హైదరాబాద్‌లోని పటాన్‌చెరు ఇరిగేషన్ ఏఈఈ టి రవి కుమార్. ఇదీ లంచం సొమ్ము.;
By : Shaik Saleem
Update: 2025-04-05 04:22 GMT
ఏమిటీ లక్షరూపాయల నోట్లను టేబులుపై పెట్టుకొని కూర్చున్న వ్యక్తిని చూశారా? ఆయనెవరో కాదు హైదరాబాద్ నగరంలోని పటాన్ చెరు నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టి రవి కుమార్...ఈ లక్ష రూపాయల సంగతేంటి అనుకుంటున్నారా? ఎన్ ఓ సీ జారీకి ఆయన అడ్వాన్సుగా తీసుకున్న లక్షరూపాయల లంచం అని ఏసీబీ అధికారులు చెప్పారు. రవికుమార్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇదీ ఈ చిత్రం.
2025,ఏప్రిల్ 4 : ఏసీబీ వలలో మరో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టి రవికుమార్ పడ్డారు. ఫిర్యాదుధారునికి చెందిన ఎఫ్.టి.ఎల్. లేదా బఫర్ జోన్ పరిధిలోనికి రానటువంటి భూమికి ఎన్.ఒ.సి. ఇవ్వడం కోసం అధికారిక అనుకూలతను చూపేందుకు ఆతని నుంచి రూ.7,00,000 లంచంగా డిమాండ్ చేసి అందులో భాగంగా లక్షరూపాయలను తీసుకుంటూ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండల నీటిపారుదల శాఖ లోని సహాయ కార్యనిర్వాహక ఇంజనీరు టి.రవి కుమార్ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ వరుస దాడులు చేస్తున్నా, ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అడ్డుకట్ట పడటం లేదు. ప్రతీరోజూ ఏసీబీ ట్రాప్ కేసులు పెడుతున్నా, అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం లేదు. మార్చి నెలలో ఏసీబీ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.
2025 ఏప్రిల్ 3 : కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలోని తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న వాంకిడి ఆర్టీఏ, ఎక్సైజ్ శాఖ చెక్ పోస్టులో అక్రమ వసూళ్లు చేస్తున్నారనే ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు చేశారు.
అనధికార డ్రైవర్ల అక్రమ వసూళ్లు
మహారాష్ట్ర నుంచి వస్తున్న లారీ డ్రైవర్ల నుంచి వాంకిడి చెక్ పోస్టులో రవాణశాఖ అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్ స్పెక్టర్లు గుగులోతు మాధవి,శంకర్ నాయక్ లు అనధికారికంగా డ్రైవర్లుగా దురిశెట్టి ఐలయ్య, జాదవ్ విజయకుమార్ లను నియమించుకొని వారి ద్వారా అక్రమ వసూళ్లు చేస్తున్నట్లు ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడుల్లో తేలింది. డ్రైవర్లు దురిశెట్టి ఐలయ్య, జాదవ్ విజయకుమార్ ల నుంచి రూ.8,500, రూ.9,700 లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెక్ పోస్టులోని డ్రాప్ బాక్సులో నుంచి మరో రూ.26,900లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. మరో వైపు ఎక్సైజ్ చెక్ పోస్టు అధికారుల వద్ద అనధికారికంగా మామూళ్ల కలెక్షన్ ఏజెంటుగా పనిచేస్తున్న హివ్రీ సుభాష్ నుంచి రూ.2,270 లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
అక్రమ వసూళ్లతో సర్కారు ఆదాయానికి గండి
మహారాష్ట్ర సరిహద్దుల్లోని వాంకిడి చెక్ పోస్టులో ఆర్టీఏ, ఎక్సైజ్ అధికారులు ప్రైవేటు ఏజెంట్లను నియమించుకొని వారి ద్వారా అక్రమంగా లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. లారీకి రూ.500 చొప్పున అక్రమ వసూళ్లు చేస్తున్నారు. కేసులు పెట్టకుండా చలాన్లు రాయకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఆర్టీఏ, ఎక్సైజ్ అధికారుల అవినీతి బండారంపై ఏసీబీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అవినీతి అధికారుల బాగోతం ఏసీబీ దాడుల్లో బయటపడిందని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఏసీబీ ప్రభుత్వాన్ని కోరింది.
ఏసీబీ వలలో మార్కెట్ కమిటీ కార్యదర్శి
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ లో పనిచేసే సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి ఎ.పురుషోత్తం, సెక్యూరిటీ గార్డు (అవుట్ సోర్సింగ్) కె. శ్రీనివాస్ రెడ్డిలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.మార్చి 29వతేదీన హోల్‌సేల్ పండ్ల వ్యాపార కమీషన్ ఏజెంట్ లైసెన్స్ పునరుద్ధరణ కోసం అధికారిక అనుకూలత చూపినందుకు ఆతని నుంచి రూ.60 వేలను లంచం తీసుకుంటూ తెలంగాణ ఏసీబీ అధికారులకు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ లో పనిచేసే సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి ఎ.పురుషోత్తం,సెక్యూరిటీ గార్డు (అవుట్ సోర్సింగ్)కె. శ్రీనివాస్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. -+
మార్చి నెలలోనే ఏసీబీ 12 కేసులు నమోదు
ఒక్క మార్చి నెలలోనే ఏసీబీ అధికారులు 12 ట్రాప్ కేసులు, రెండు క్రిమినల్ కేసులు, మరో ఆకస్మిక తనిఖీ చేసి రెవెన్యూ, హోం, మున్సిపల్, విద్యుత్, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రవాణ, వ్యవసాయ శాఖ అధికారులపై అవినీతి కేసులు పెట్టారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ఏసీబీ అధికారులు 52 కేసులు నమోదు చేయగా వీటిలో 37 రెడ్ హ్యాండెడ్ గా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. సంపాదనకు మించిన ఆస్తులను అక్రమంగా సంపాదించిన నలుగురు అధికారులపై ఏసీబీ కేసులు పెట్టింది. రూ.12.33 లక్షల రూపాయల అక్రమ డబ్బును సీజ్ చేసిన ఏసీబీ అధికారులు 52 మందిని అరెస్ట్ చేశారు.
2024లో 152 ఏసీబీ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు 2024 వ సంవత్సరంలో 152 ఏసీబీ కేసులు నమోదు చేసి 223 మంది అక్రమార్కులను అరెస్ట్ చేశారు. 129 ట్రాప్ కేసులు నమోదు చేసి 200 మంది అవినీతిపరులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్ట్ చేశారు.అరెస్ట్ అయిన వారిలో 159 మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు.సంపాదనకు మించిన ఆస్తులున్న 11 మందిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
అవినీతి కేసుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు : సోమ శ్రీనివాసరెడ్డి,కార్యదర్శి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
ప్రభుత్వ శాఖల్లో అవినీతికి పాల్పడిన ఉద్యోగులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసులు పెడుతున్నా, అక్రమార్కులు ప్రభుత్వంపై తమ పలుకుబడితో ఒత్తిడి తీసుకువచ్చి ఆయా కేసులను ఎత్తివేపిస్తున్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ సోమ శ్రీనివాసరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. దీనికి తోడు కోర్టుల్లో ఏసీబీ కేసులు వీగిపోతున్నాయని ఆయన తెలిపారు. సాక్షులు, ఫిర్యాదు దారులు అవినీతి అధికారులతో కుమ్మక్రై కోర్టుల్లో తప్పుడు సాక్ష్యాలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. అక్రమాలపై ఏసీబీ కేసుల్లో ఉద్యోగులకు శిక్షలు పడక పోవడంతో అవినీతికి అడ్డుకట్ట పడటం లేదని శ్రీనివాసరెడ్డి వివరించారు.
ఆకస్మిక తనిఖీలు
తెలంగాణలోని ప్రభుత్వ శాఖల్లో వచ్చిన అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు 11 రెగ్యులర్ విచారణలు జరిపారు. పలు శాఖల్లో లంచాల వసూళ్ల ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు 29 ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెగ్యులర్ విచారణలు, ఆకస్మిక తనిఖీలపై ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదికలను సమర్పించినా, వాటిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తోంది. సంపాదనకు మించిన ఆస్తులకు చెందిన 11 కేసుల్లో అవినీతి అధికారుల నుంచి ఏసీబీ అధికారులు రూ.97.42 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
ఛార్జీషీట్ల ఫైలింగుల్లో జాప్యం
ఏసీబీ కేసుల్లో విచారణ పూర్తి చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టుల్లో ఛార్జిషీట్లు సమర్పించడంలో ఈ విభాగం అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. దీంతో అవినీతిపరులపై చర్యలు తీసుకోవడంలో ఏసీబీ అధికారులు, కోర్టులు సైతం తీవ్ర జాప్యం చేస్తున్నాయి.ఏసీబీ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదు చేసినా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 105 కేసుల్లో మాత్రమే ప్రాసిక్యూషన్, ఛార్జ్ షీట్ల ఫైలింగుకు అనుమతించింది. 16ఏసీబీ కేసుల్లోనే అవినీతి అధికారులకు కోర్టులు శిక్షలు విధించాయి. 2018వ సంవత్సరంలో నమోదైన ఓ కేసు ఆరేళ్ల తర్వాత విచారణ పూర్తి చేశారు. 2019లో మూడు కేసులు, 2020లో ఐదు కేసులు, 2022లో 12 కేసులు,2024లో 26 కేసులను ఏసీబీ విచారణ పూర్తి చేసింది. 129 ట్రాప్ కేసుల్లో ఏసీబీ అధికారులు రూ.82.78 లక్షలను సీజ్ చేయగా, ఇందులో రూ.64.80 లక్షలను ఫిర్యాదుదారులకు తిరిగి ఇచ్చారు.
అవినీతికి అడ్డుకట్టేది?
తెలంగాణలోని పలు ప్రభుత్వ విభాగాల్లో అవినీతి అక్రమాలకు తెర పడటం లేదు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక అక్రమాలు పెరిగాయనటానికి ఏసీబీ పెడుతున్న కేసుల సంఖ్యనే చెప్పవచ్చు. పలు ప్రభుత్వ కీలక శాఖల్లో అక్రమాలు ఎక్కువగా సాగుతున్నాయి. రవాణశాఖ, గనుల శాఖ, రెవెన్యూ, పోలీసు, మున్సిపాలిటీల్లో ఎక్కువగా అక్రమాలు జరుగుతున్నాయని ఏసీబీ అధికారుల దాడుల్లోనే తేలింది. లంచం ఇవ్వనిదే పనులు జరగని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో తెలంగాణ ఏసీబీ దాడులను ముమ్మరం చేసింది.
ఏసీబీ టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయండి
అవినీతి నిరోధక బ్యూరో (ACB) ప్రజా పరిపాలనలో అవినీతిని నిరోధించేందుకు పనిచేస్తుందని తెలంగాణ ఏసీబీ డైరెక్టర్ విజయకుమార్ చెప్పారు. ప్రభుత్వ పరిపాలనా నియంత్రణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ సెక్టార్ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో అవినీతి ఆరోపణలపై ఏసీబీ విచారణ జరుపుతుందని, ఫిర్యాదులను వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్ 9440446106,టోల్ ఫ్రీ నంబర్ 1064,ఈమెయిల్: dg_acb@telangana.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చని డైరెక్టర్ కోరారు. ఫిర్యాదుదారుల వివరాలను రహస్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ ఏసీబీ హెడ్ క్వార్టర్సుతోపాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నిజామాబాద్, ప్రాంతీయ కార్యాలయాల్లో ఫిర్యాదులను స్వీకరించడంతోపాటు ట్రాప్ కేసులు, ఆకస్మిక తనిఖీలను ఏసీబీ అధికారులు చేపడుతున్నారు.