తెలంగాణ సీఎం మార్పుపై మంత్రి పొంగులేటి క్లారిటీ
తెలంగాణలో అధికార మార్పు జరగదు. నాలుగేళ్లూ కాంగ్రెస్సే ఉంటుంది. అవన్నీ అసత్యలేనంటున్న పొంగులేటి.
తెలంగాణ సీఎం పదవి నుంచి రేవంత్ రెడ్డి దిగిపోనున్నారు. మరికొన్నాళ్లలో తెలంగాణకు కొత్త సీఎం రానున్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్లడం.. కొత్త సీఎం రావడం ఆరునెలల్లో జరగనున్నాయి అంటూ కొంతకాలంగా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ప్రచారంలో తాజాగా మంత్రి పొంగుులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టతనిచ్చారు. తెలంగాణ సీఎం మారడం అనేది జరగదని తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వానికి ఇంకా నాలుగేళ్ల ఒక నెల సమయం ఉందని, ఈ సమయంలో ప్రభుత్వంలో ఎటువంటి మార్పు ఉండదని తేటతెల్లం చేశారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే తమ తీరులో కూడా తేడా ఉండదని, ప్రజలకు సేవ చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు.
కొన్ని రోజులుగా కొందరు తెలంగాణ సీఎం మారనున్నారంటే అసత్య ప్రచారం చేస్తున్నారని, అది జరిగే పని కాదని స్ఫష్టం చేశారు. పూర్తి కాలం అంటే ఐదేళ్లు సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తారని, రానున్న నాలుగేళ్ల ఒక నెల పాటు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించనున్నారని మరోసారు పునరుద్ఘాటించారు. తమ ప్రభుత్వంపై బురదజల్లడంలో భాగంగానే ప్రతిపక్షాలు.. సీఎం మార్పు అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, ఏమైనా చిన్నచిన్నవి ఉంటే అవి టీ కప్పులో తుఫానే తప్ప.. వాటిని పట్టించుకోవల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై కూడా కీలక అప్‌డేట్ ఇచ్చారు మంత్రి పొంగులేటి.
మహిళల పేరిటే ఇళ్ల మంజూరు
‘‘రాష్ట్రంలో ఈనెల 5, 6 తేదీల నుంచి ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక జరుగుతుంది. 15రోజుల్లొ గ్రామ కమిటీల ద్వారా ఎంపిక పూర్తి చేసి ఆ వెంటనే జాబితాలను ఖరారు చేస్తాం. ఇది నిరంతర ప్రక్రియ. గ్రామాలలో ఇందిరమ్మ కమిటీల చేసే ఎంపికే ఫైనల్. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిటే మంజూరు చేస్తాం. లబ్దిదారులే సొంతంగా ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఇళ్ల నిర్మాణంలో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదు. నిరుపేదలకు తొలి ప్రాధాన్యత ఇస్తాం. పేదరికమే ప్రామాణికంగా లబ్దిదారుల ఎంపిక జరగనుంది’’ అని పొంగులేటి వివరించారు.
ప్రత్యేక యాప్ ద్వారా ఎంపిక
‘‘లబ్దిదారుల ఎంపికలో ప్రత్యేక యాప్ కీలకపాత్ర పోషించనుంది. ఈ యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా జరగనుంది. అందుకే లబ్ధిదారుల ఎంపికకు ఇంత సమయం పట్టింది. ఆధార్ సహా అన్నివివరాలు యాప్‌లో పొందుపరుస్తారు. 4 రాష్ట్రాలలోని ఇళ్ల నిర్మాణానికి సంబంధించి వివరాలు సేకరించి వాటిని అధ్యయనం చేసే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ విషయంలో ముందుకు వెళ్తున్నాం. ఇండ్ల నిర్మాణంలో ఎటువంటి డిజైన్లు ఉండవు. లబ్దిదారులు తమకు ఇష్ వచ్చినట్లు ఇల్లు నిర్మించుకోవచ్చు. కనీసం 400 చదరపు గజాలు తగ్గకుండా లబ్దిదారుడు ఇల్లు నిర్మించుకోవాలి’’ అని తేల్చి చెప్పారు.
నాలుగు దశల్లో నిర్మాణం
‘‘ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని నాలుగు దశల్లో చేపట్టనున్నాం. నిర్మాణ దశల వారీగా లబ్దిదారులకు చెల్లింపులు చేస్తాం. పునాదికి రూ.లక్ష, గోడలకు రూ.లక్షా 25వేలు, శ్లాబ్‌కు రూ.లక్షన్నర, ఇల్లు పూర్తయితే లక్ష రూపాయిల చొప్పున చెల్లింపు చేస్తాం. బ్యాంకు అకౌంట్ ద్వారానే చెల్లింపులు జరగనున్నాయి. కేంద్రం ఇచ్చే నిధులను తీసుకొని మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం జమచేసి చెల్లింపులు జరపనుంది. నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తాం. ప్రతి నియోజకవర్గంలో కనీసం 3500 ఇళ్లు నిర్మించేలా చూస్తాం. ఇళ్లలో తప్పనిసరిగా వంటగది, బాత్రూం నిర్మించుకోవాలి. ప్రతి మండలంలో కనీసం ఒకరు లేదా ఇద్దరు ఎఈ లు ఉండేలా చర్యలు తీసుకుంటాం’’ అని ప్రకటించారు.
వారికే నిర్మాణ బాధ్యతలు
‘‘16 శాఖలకు చెందిన వారిని సమీకరించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తాం. ఒకే గొడుగు నీడన ఇంజనీర్ల పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం తరపున రూ.5 లక్షల సాయం ఇస్తాం. లబ్దిదారులు తమ ఆర్థిక పరిస్థితి బట్టి ఇంటికి ఇంకా బాగా నిర్మించుకోవచ్చు. దేశంలో తెలంగాణ మాత్రమే ఇంతటి భారీ గృహ నిర్మాణం చేపట్టి రూ.5 లక్షల సాయం అందిస్తోంది. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన సుమారు 600-800 ఇళ్ల నిర్మాణానికి కూడా సహకరిస్తాం. తొలి విడతగా సుమారు రూ.28,000 కోట్ల వరకు ఖర్చు కావచ్చు. సుమారు రూ.7,740 కోట్లను ఇందిరమ్మ ఇండ్లకు బడ్జెట్‌లో కేటాయించాం’’ అని వెల్లడించారు.
వాటి ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక
‘‘అవసరమైన నిధుల కోసం కేంద్రాన్ని కోరుతాం. నిధులను వివిధ మార్గాలద్వారా సమీకరిస్తాం. పునాది పూర్తయిన వెంటనే తొలివిడత నిధులను విడుదల చేస్తాం. నిర్మాణాలు జరిగేలోగా మళ్లీ బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరుగుతుంది. స్మార్ట్ కార్డుల ఆధారంగా లబ్దిదారుల ఎంపిక చేపట్టనున్నాం. అర్హులైన వికలాంగులకు ప్రాధాన్యత ఇస్తే మంచిదే. గ్రామ కమిటీలదే తుది ఎంపిక. నందనవనం, మంకాల్ ఇళ్ల సమస్యకు త్వరలో పరిష్కారం అందిస్తాం. ఇళ్ల స్థలాలు లేనివారికి 2వ దశలో స్ధలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తాం. కేంద్రప్రభుత్వ నిబంధనల ప్రకారం 75 నుంచి 80 గజాల స్థలాన్ని సమకూర్చి ఇస్తాం. ఎక్కడైనా కొత్తగా ఇందిరమ్మ కాలనీలు ఏర్పడితే కరెంట్, రోడ్లు , డ్రైనేజ్ తదితర మౌళిక వసతులను ప్రభుత్వమే సమకూరుస్తుంది’’ అని తెలిపారు.
భేషజాలు లేవు
‘‘గత ప్రభుత్వం మూసివేసిన హౌసింగ్ శాఖను పునరుద్దరించాము. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎలాంటి భేషజాలకు పోవడంలేదు. కేంద్రం ఎంతిచ్చినా తీసుకుంటాం, ఏమీ ఇవ్వకపోయినా ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తాం. మాకు ఇగోలు, కక్షలు కార్పణ్యాలు లేవు. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రమని చెప్పి కేంద్రాన్ని ఇళ్లు అడగలేదు. డబుల్ బెడ్ రూం ఇళ్లలో నీళ్లు, కరెంట్ , డ్రైనేజ్ వంటి వసతుల్లేవు. మేము అవన్నీ కల్పించి లబ్దిదారులకు అప్పగిస్తున్నాం. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలో 19.36 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించడం జరిగింది’’ అని వివరించారు మంత్రి పొంగులేటి.