SLBC లేబర్ క్యాంపుల్లో టన్నెల్‌ కార్మికుల దీన గాథ

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో పనిచేస్తున్న కార్మికులకు ఇచ్చే కూలీ తెలిస్తే షాక్ అవుతారు.టన్నెల్‌ ప్రమాదం నేపథ్యంలో లేబర్ క్యాంపుల్లో వారి దుర్భరజీవనంపై ప్రత్యేక కథనం.;

Update: 2025-02-27 08:56 GMT

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ కూలిపోయి ఆరురోజులు గడచినా జార్ఖండ్ కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ దారుణ ఘటన నేపథ్యంలో ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధి ఎస్ఎల్‌బీసీలో పనిచేస్తున్న జార్ఖండ్ కార్మికులు నివాసముంటున్న లేబర్ క్యాంపునకు (SLBC labor camps)‘ఫెడరల్ తెలంగాణ ’ ప్రతినిధి వెళ్లి, కూలీల జీవన స్థితిగతులను పరిశీలించి, వారితో మాట్లాడారు.

ఎస్ఎల్‌బీసీ లేబర్ క్యాంపులోని జార్ఖండ్ కూలీలను కదిలిస్తే చాలు వారి దుర్భర జీవన చిత్రం వెలుగుచూసింది. జార్ఖండ్ కూలీల కష్టాలు, కన్నీళ్లు, ప్రమాదాల వివరాలతో ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధి సలీం అందిస్తున్న ప్రత్యేక కథనమిది.



 అడవుల్లో రేకుల షెడ్లలో కూలీల దుర్భర జీవనం

దట్టమైన నల్లమల అడవుల్లో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ సమీపంలో మండుతున్న ఎండల్లో ఇరుకు రేకుల గదుల్లో జార్ఖండ్ కూలీలు (Jarkhand laborers) నివాసముంటున్నారు. కనీస సౌకర్యాలు రక్షిత మంచినీరు, రాత్రివేళ లేబర్ క్యాంపులో విద్యుత్ దీపాలు కూడా లేని చిమ్మచీకటిలో కూలీలు దుర్భర జీవితం గడుపుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని జార్ఖండ్ కూలీలు కేవలం రోజుకు 450 రూపాయల కూలీ కోసం వేల కిలోమీటర్ల దూరం నుంచి భార్యపిల్లలను వదిలి నాగర్ కర్నూల్ జిల్లా దోమల పెంట గ్రామ సమీపంలోని నల్లమల అడవుల్లోని ఎస్ఎల్‌బీసీ లేబర్ క్యాంపునకు వచ్చి దుర్భర జీవితం గడుపుతూ అత్యంత ప్రమాదకరమైన సొరంగం తవ్వకాలు చేపట్టారు.



 టన్నెల్ కార్మికుల రోజు కూలీ రూ.450 రూపాయలే...

సొరంగం లోపల వేడిని తట్టుకొని ప్రమాదకర పరిస్థితుల్లో రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేస్తున్న జార్ఖండడ్ కూలీలకు రోజుకు జయపీ కంపెనీ కేవలం 450 రూపాయలే కూలీ ఇస్తుంది. అదీ కూడా మూడు నెలలుగా కూలీ డబ్బులు ఇవ్వలేదు.అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో సొరంగం లోపల పనిచేస్తున్న కార్మికుల జీవనాన్ని పరిశీలిస్తే కన్నీళ్లు వస్తుంటాయి. ఇంటికి దూరం కూలీ పని కోసం వచ్చి ఎస్ఎల్‌బీసీ టన్నెల్ కాంట్రాక్టరు జయపీ సంస్థలో లేబర్లుగా వెట్టి చాకిరీ చేస్తున్నారు.



 ఉదయాన్నే టన్నెల్ లోపలకు వెళ్లి...

ఉదయాన్నే ఏడు గంటలకు టన్నెల్ లోపలకు వెళ్లి సాయంత్రం ఆరుగంటల దాకా అత్యంత వేడి వాతావరణంలో కూలీలుగా పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 22వతేదీన టన్నెల్ ఒక్కసారిగా కూలిపోవడంతో ఇందులో శిథిలాల్లో నలుగురు జార్ఖండ్ కూలీలు చిక్కుకున్నారు. కూలీలు శిథిలాల్లో చిక్కుకున్న నేపథ్యంలో ప్రాణభయంతో జార్ఖండ్ లేబర్ క్యాంపులో నివాసముంటున్న ఇతర కూలీలు టన్నెల్ లో పనిచేసేందుకు ముందుకు రావడం లేదు.



 టన్నెల్ శిథిలాల్లో కూరుకుపోయిన కూలీలు

ఝార్ఖండ్‌లోని కాంబియా కుంబటోలి అనే గ్రామానికి చెందిన సంతోష్‌ సాహు, సందీప్‌ సాహు, జగ్టా ఎక్కేస్‌, అనూజ్‌ సాహు టన్నెల్‌లో చిక్కుకు పోవడంతో ఇతర కూలీలు టన్నెల్ లో పనిచేసేందుకు నిరాకరించారు. తమకు రావాల్సిన మూడు నెలల జీతాన్ని ఇస్తే తాము తమ సొంత రాష్ట్రానికి వెళతామని జార్ఖండ్ కూలీలు చెబుతున్నారు. టన్నెల్ కూలిన ఘటన నుంచి బయటపడిన కూలీలు ఇక తాము టన్నెల్ లో పనిచేసేది లేదని చెబుతుతున్నారు. తమ కూలీల ఆచూకీ లభించకున్నా, తమను పనిచేసేందుకు టన్నెల్ లోపలకు రావాలని కంపెనీ మేనేజర్లు కోరుతున్నారని జార్ఖండ్ కూలీలు చెప్పారు.



 రేకుల షెడ్లు...ఇరుకు గదుల్లో నివాసం

మండుతున్న ఎండల మధ్య ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో పనిచేస్తున్న జార్ఖండ్ కార్మికులు నివాసముంటున్న లేబర్ క్యాంపును ‘ఫెడరల్ తెలంగాణ సందర్శించింది. ఇరుకు గదుల్లో వర్షమొస్తే కురిసే షెడ్లలో ఈ కార్మికులు నివాసముంటూ దుర్భరజీవితం గడుపుతున్నారు.



 పైనుంచి నీరు లీక్ అవుతుందని చెప్పినా...

టన్నెల్ లోపల పై నుంచి నీరు లీక్ అవుతుందని రాత్రి డ్యూటీ చెప్పినా తమను పనికి పిలిచారని జార్ఖండ్ కూలీ చెప్పారు. ముందు మట్టి పడిందని, ఆపై పై నుంచి 20 టన్నుల బరువున్న మోల్డ్ కూలిందని, నీరు, మట్టి పడుతుండటంతో తాము పదమూడున్నర కిలోమీటర్ల దూరం పరుగులు తీసి బయటకు వచ్చామని కూలీలు చెప్పారు. (SLBC tunnel accident) టన్నెల్ బోరింగ్ యంత్రం కూడా ముక్కలు చెక్కలైంది. టన్నెల్ లో చిక్కుకు పోయిన వారు భగవంతుడుంటే బయటపడతారని ఆశగా ఎదురు చూశామని, కానీ ఆరు రోజులైనా వారి జాడ లేకుండా పోయిందని జార్ఖండ్ కార్మికుడు చెప్పారు. తమను ఎలాగైనా ఇంటికి చేర్చాలని తాము ప్రభుత్వాన్ని కోరుతున్నామని జార్ఖండ్ కూలీలు ముక్తకంఠంతో కోరారు.


Tags:    

Similar News