తెలంగాణ రాష్ట్రం అడవుల విస్తీర్ణంలో దేశంలోనే మూడో స్థానంలో ఉంది. జాతీయ అడవుల సగటు విస్తీర్ణం కంటే తెలంగాణలో అధికంగా అడవులు ఉన్నాయి.జాతీయ అడవుల సగటు విస్తీర్ణం 23.59 శాతం కాగా తెలంగాణలో 27,688 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులున్నాయని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్టు 2023 వెల్లడించింది. అడవుల శాతం తెలంగాణలో జాతీయ సగటు కంటే అధికంగా 24.69 శాతంగా ఉందని తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్ లుక్ తాజా నివేదిక వెల్లడించింది. అమ్రాబాద్, కవ్వాల పులుల అభయారణ్యాలు, 12 అభయారణ్యాలు,9 వన్యప్రాణుల అభయారణ్యాలు, మూడు జాతీయ పార్కులతో అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచడానికి అటవీశాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.తెలంగాణ అడవుల్లో 2,939 చెట్ల రకాలు, 365 రకాల పక్షులు, 103 రకాల వన్యప్రాణులు, 28 రకాల పాము జాతులతో అడవులు విస్తరించి ఉన్నాయి.
పది జిల్లాల్లో అటవీ విస్తీర్ణం అధికం
రాష్ట్రంలోని పది అడవుల జిల్లాల్లో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉందని తేలింది. వన మహోత్సవాలు, పులుల అభయారణ్యాలు, అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల పరిరక్షణతో పచ్చదనాన్ని పెంచడానికి అటవీశాఖ చర్యలు తీసుకుంటోంది.అమ్రాబాద్ పులుల అభయారణ్యాన్ని ప్లాస్టిక్ ఫ్రీ జోన్ గా ప్రకటించి అడవుల పరిరక్షణ కోసం తాము చర్యలు తీసుకుంటున్నామని అమ్రాబాద్ డీఎఫ్ఓ గోపిడి రోహిత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతాల్లోని దట్టమైన అడవుల్లో పచ్చదనంతోపాటు వన్యప్రాణుల పరిరక్షణ కోసం అటవీశాఖ చర్యలు చేపట్టింది.దేశంలోనే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో అత్యధికంగా 44.25 శాతం అడవులతో అగ్రస్థానంలో ఉంది. ఒడిశా రాస్ట్రం 39.31 శాతం అడవులతో రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ రాష్ట్రం 24.69 శాతం అడవులతో దేశంలోనే మూడో స్థానంలో ఉంది.
అటవీ విస్తీర్ణంలో ములుగు జిల్లా ఫస్ట్
తెలంగాణలోనే ములుగు జిల్లాలో అత్యధికంగా అటవీ ప్రాంతం ఉందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్టు తేల్చి చెప్పింది. ములుగు జిల్లాలో 64.64 శాతం అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 41.38 శాతం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 41.15 శాతం, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 40.09శాతం, నాగర్ కర్నూల్ లో 35.81 శాతం అడవులున్నాయి. మంచిర్యాలలో 41.09శాతం, నిర్మల్ లో 29.3శాతం, ఆదిలాబాద్ లో 29.51, మహబూబాబాద్ లో 26.49, జగిత్యాలలో 25.14 శాతం అటవీ ప్రాంతాలతో టాప్ టెన్ ఫారెస్ట్ జిల్లాలుగా నిలిచాయి.
అటవీ ఉత్పత్తుల ద్వారా ఏటా రూ.32.08 కోట్ల ఆదాయం
తెలంగాణలో అటవీ ఉత్పత్తుల విక్రయం ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 32.08 కోట్ల ఆదాయం వచ్చిందని అటవీశాఖ రికార్డులే చెబుతున్నాయి. కలప, వెదురు, వంటచెరుకు, ఛార్ కోల్, బీడీ ఆకులు, తేనే సేకరణ ద్వారా ఆదాయం వచ్చింది. అటవీ ప్రాంతాల్లో పండ్ల చెట్లు, ఎర్రచందనం చెట్లను పెంచడం ద్వారా అటవీశాఖ ఆదాయాన్ని పెంచుతున్నామని పద్మశ్రీ వనజీవి రామయ్య ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
పచ్చదనం పెంచేందుకు ప్లాంటేషన్
తెలంగాణలో 24 శాతం ఉన్న అటవీ ప్రాంతాన్ని వనమహోత్సవం, ప్లాంటేషన్, సీడ్ లింగ్స్ ద్వారా 33 శాతానికి పెంచడానికి అటవీశాఖ చర్యలు చేపట్టింది. అడవుల్లో 312.13 కోట్ల విత్తనాలను చల్లడం ద్వారా అటవీ విస్తీర్ణం పెంచడానికి చర్యలు చేపట్టినట్లు తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే వెల్లడించింది.2024-25 సంవత్సరంలో ఫిబ్రవరి వరకు 18.90 కోట్ల మొక్కలను వన మహోత్సవం కార్యక్రమంలో నాటారు. వనమహోత్సవంలో మొక్కలు నాటడానికి గాను 1280 నర్సరీల్లో 30.04 కోట్ల మొక్కలను 141 అర్బన్ ప్రాంతాల్లో నాటారు. 21,925 కిలోమీటర్ల విస్తీర్ణంలో చెట్లు పెంచుతున్నారు. నగర వన యోజన పథకం కింద రూ.1890లక్షలతో మొక్కలు పెంచారు.
అర్బన్ పార్కులు
తెలంగాణలో 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేయగా, ఇందులో 59 అర్బన్ పార్కులు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి.హెచ్ఎండీఏ 16 పార్కులు, జీహెచ్ఎంసీలో మూడు పార్కులను అభివృద్ధి చేసి పచ్చదనాన్ని పెంచారు. కంపా నిధులతో 3,706 హెక్టార్లలో మొక్కలు పెంచుతున్నారు. అడవులే కాకుండా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నామని ఎకో టూరిజం ప్రాజెక్టు మేనేజర్ కళ్యాణపు సుమన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కొత్తగూడ బొటానికల్ గార్డెన్ తోపాటు మృగవని నేషనల్ పార్కు, మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కులను అభివృద్ధి చేశామని ఆయన వివరించారు.
అమ్రాబాద్, కవ్వాల పులుల అభయారణ్యాలు
నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల్లోని నల్లమల అటవీ ప్రాంతాన్ని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టుగా ప్రకటించారు. కొండలు, గుట్టలు, కృష్ణా పరివాహక ప్రాంతంతో 2166.37 చదరవు కిలోమీటర్ల విస్తీర్ణంలో పులుల సంఖ్య సింగిల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్ కు పెరిగింది. 1123.21 చదరవు కిలోమీటర్ల విస్తీర్ణంలో కవ్వాల పులుల అభయారణ్యం విస్తరించి ఉంది. కవ్వాల పులుల అభయారణ్యంలో వన్యప్రాణుల సంఖ్య పెరిగిందని అటవీశాఖ అధికారి కారం శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పోచారం, మంజీరా, కిన్నెరసాని, పాఖాల, ఏటూరునాగారం, శివారం, ప్రాణహిత వన్యప్రాణుల రిజర్వు ఫారెస్ట్ విస్తీర్ణంలో పచ్చదనాన్ని పెంచడంతోపాటు వన్యప్రాణులను సంరక్షిస్తున్నామని అటవీశాఖ ప్రకటించింది.