Telangana Crime | సినిమాలు, ఓటీటీ వెబ్ సిరీస్‌ల స్ఫూర్తితో నేరాలు
క్రైం థ్రిల్లర్ సినిమాలు,వెబ్ సిరీస్‌ల స్ఫూర్తితో తెలంగాణలో నేరాలు సాగుతున్నాయి.మాజీ జవాన్ గురుమూర్తి ‘సూక్ష్మదర్శిని’ సినిమా చూసి హత్య చేయడం సంచలనం రేపింది.;
By : Shaik Saleem
Update: 2025-01-27 03:19 GMT
సూక్ష్మదర్శిని పేరిట తాజాగా మళయాళం క్రైం థ్రిల్లర్ సినిమా విడుదలైంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఈ మూవీ తెలుగులోనూ విడుదలైంది. ఇంట్లో వాళ్ల మాట వినకుండా పెళ్లి చేసుకుందని కుమారుడితో కలిసి తల్లి కూతురిని హత్య చేసి, శవాన్ని మాయం చేస్తుంది. ఇంట్లోనే చిన్న నీళ్ల ట్యాంకులో యాసిడ్, కొన్ని రసాయనాలు కలిపి శవాన్ని అందులో వేస్తారు. శవాన్ని కరిగించి నీళ్లలా మారుస్తారు.ఈ నీటిని వాష్ రూం ఫ్లష్ ద్వారా డ్రైనేజీలోకి వదులుతారు. కరగని ఎముకలను పొడిగా చేసి వాటిని కూడా ఫ్లష్ ద్వారా బయటకు వదులుతారు.
ఓటీటీలో సూక్ష్మదర్శిని సినిమా చూసి...
సూక్ష్మదర్శిని సినిమానే హంతకుడైన మాజీ సైనికుడు గురుమూర్తికి స్ఫూర్తినిచ్చింది. ఈ సినిమాలాగే తన భార్యను హత్య చేసిన గురుమూర్తి శవాన్నీ మాయం చేశాడు. హెక్సా బ్లేడుతో మృతదేహం తల, మొండాన్ని వేరు చేసి మూడు ముక్కలు చేసినట్లు పోలీసుల దర్యాపులో గురుమూర్తి అంగీకరించాడు.ముక్కలను హీటరుతో కరిగించి, ముద్దగా మారిన శరీర భాగాలపై యాసిడ్, ఇతర రసాయనాలు పోసినట్లు నిందితుడు చెప్పాడు. పొడిగా మారాక వాటిని డ్రైనేజీలో, చెరువులో పడేసినట్లు గురుమూర్తి చెప్పాడు.
సినిమాలోని టెక్నిక్ లతో మృతదేహం మాయం చేశాడు...
సూక్ష్మదర్శిని సినిమాలో మృతదేహాన్ని ఎలా మాయం చేశాడనే టెక్నిక్ లను ఉపయోగించి తాను తన భార్య వెంకట మాధవి మృతదేహాన్ని ముక్కలు చేసి, వాటిని యాసిడ్, రసాయనాల్లో ముంచానని దర్యాప్తులో నిందితుడు గురుమూర్తి పోలీసులకు చెప్పాడు. క్రైం సినిమా స్ఫూర్తితోనే తాను భార్య శరీర భాగాలను కాల్చి ముద్ద చేశానని నిందితుడు అంగీకరించడం విశేషం. ఇంట్లో మృతదేహం వాసన రాకుండా స్ప్రే, కెమికల్స్ వాడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
పుష్ప సినిమా తరహాలో...
పుష్ప -1 సినిమా తరహాలో ఎర్రచందనాన్ని పాల ట్యాంకరులో కింద పెట్టి తరలించినట్లు ఓ ముఠా గంజాయిని తరలిస్తూ పోలీసులకు చిక్కింది.
ఇదీ సినిమా సీన్ : ఎర్రచందనం దుంగలను పాల ట్యాంకరు కింద పెట్టి, పైన ట్యాంకరులో కొన్ని పాలు నింపి స్మగ్లింగ్ చేశారు. సినిమాలో పోలీసులకు ఎలాంటి అనుమానం రాలేదు. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న గంజాయి స్మగ్లర్లు రాజమండ్రి నుంచి మధ్య ప్రదేశ్ కు వెళుతున్న ఓ ట్యాంకరు మధ్య భాగంలో తయారు చేసిన ప్రత్యేక అరలో 290 కిలోల గంజాయిని తరలిస్తుండగా కొమురం భీం జిల్లా వాంకిడి చెక్ పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారు.
దృశ్యం సినిమా ఫక్కీలో...
దృశ్యం సినిమాలో హీరో ఓ యువకుడిని చంపి, మృతదేహాన్ని కాంక్రీటుతో పూడ్చిపెడతాడు.ఈ హత్య కేసులో పోలీసులు ఎంత గాలించినా మృతదేహం ఆనవాళ్లు దొరకవు. దృశ్యం సినిమాలోలాగా నాగపూర్ లో ప్రియురాలు జ్యోత్సను ను ప్రియుడైన అజయ్ వాంఖడే రైల్వే ట్రాక్ సమీపంలో గొయ్యి తవ్వి ప్లాస్టిక్ షీట్లు వేసి సిమెంటుతో కాంక్రీట్ చేశాడు. ఈ ఘటన అచ్చు దృశ్యం సినిమాని తలపిస్తోంది.
దిశ తరహాలో మేడ్చల్ లో మరో ఘటన
మేడ్చల్ ప్రాంతంలో ఓ వివాహితను బండరాళ్తతో కొట్టి చంపి, ఆపై ఆధారాలు దొరకకుండా మృతదేహంపై పెట్రోలు పోసి దిశ తరహాలో తగుల బెట్టారు. మహిళపై అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఆధారాల కోసం పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి నేరాలకు ఓటీటీ వెబ్ సిరీస్ లు, క్రైం థ్రిల్లర్ సినిమాలే ప్రేరణగా నిలుస్తున్నాయని నరేష్ రెడ్డి అనే ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.