చిరంజీవిని పొగుడుతూనే.. ఇండస్ట్రీకి కండిషన్స్ పెట్టేసిన సీఎం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి కండిషన్స్ పెట్టారు. సినిమా టికెట్ల ధరలు పెంచాలంటే తమ కండిషన్స్ కి ఒప్పుకోవాల్సిందేనని అన్నారు.

By :  Vanaja
Update: 2024-07-02 10:15 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి కండిషన్స్ పెట్టారు. సినిమా టికెట్ల ధరలు పెంచాలంటే తమ కండిషన్స్ కి ఒప్పుకోవాల్సిందేనని అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్త వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డ్రగ్స్, సైబర్ క్రైమ్ నేరాలు సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయని అన్నారు. వీటిని నిర్మూలించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడం ప్రభుత్వ బాధ్యత... అందుకే పోలీస్ వ్యవస్థకు కావాల్సిన నిధులు, అధికారులను కేటాయించామని సీఎం తెలిపారు.

"ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సైబర్ క్రైమ్. నేరాలను ఎదుర్కోవడంలో రాష్ట్రంలో సైబర్ క్రైం టీమ్ సమర్ధవంతంగా పని చేస్తోంది. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. డ్రగ్స్ మహమ్మారితో కుటుంబం, వ్యవస్థ నాశనమవుతాయి. ఉద్యమాలకు కేరాఫ్ తెలంగాణ.. దురదృష్టవశాత్తు గల్లీ గల్లీలో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగింది. డ్రగ్స్ నియంత్రణకు సిబ్బందిని కేటాయించాం. గంజాయి మత్తులో నేరాలు జరుగుతున్నాయి. చిన్నారులపై దాష్టీకం జరుగుతున్న ఘటనలకు కారణం మాదకద్రవ్యాలే. తెలంగాణ యువకులు డ్రగ్స్ కు బానిసలు కాదు.. సమస్యలపై పోరాటం చేసే సమర్థులుగా ఉండాలని సీఎం పిలుపునిచ్చారు.

డ్రగ్స్ నియంత్రణలో సమర్ధవంతంగా పనిచేసినవారికి పదోన్నతి కల్పిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి శాసనసభలో చర్చించి చట్టాన్ని రూపొందిస్తామని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే.. నేరగాళ్లకు కాదు అని స్పష్టం చేశారు. తెలంగాణలో డ్రగ్స్ మాట వినబడాలంటే భయపడేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. మీడియా.. రాజకీయ వివాదాలపై కాకుండా సమాజంలో సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలపై ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీడియాపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

సినీ ఇండస్ట్రీకి రేవంత్ కండిషన్స్...

డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కార్యక్రమంలో భాగస్వామి అయిన మెగాస్టార్ చిరంజీవిని అభినందిస్తున్నానని సీఎం అన్నారు. ప్రతీ సినిమా విడుదల సందర్భంలో అదే నటీనటులతో డ్రగ్స్ కు వ్యతిరేకంగా షార్ట్ వీడియో చేయాలని కోరారు. ప్రతీ సినిమా థియేటర్ లో సినిమాకు ముందు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ కు సంబంధించి వీడియో ఉచితంగా ప్రదర్శించేలా చూడాలన్నారు. టికెట్ ధరలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరిన వారు ఈ కండిషన్స్ ఫాలో అవ్వాలన్నారు. ఈ నిబంధనలకు సహకరించినవారికే అనుమతుల విషయంలో ప్రభుత్వం సహకరిస్తుంది అని తేల్చి చెప్పారు. సమాజాన్ని కాపాడాల్సిన సామాజిక బాధ్యత సినీ పరిశ్రమపై ఉందని సీఎం అన్నారు.

Tags:    

Similar News