కేసీయార్ కు బ్యాడ్ టైమ్ నడుస్తోందా ?

2014-23 నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలవరకు కేసీయార్ తనిష్టంవచ్చినట్లు చెలాయించుకున్నారు. చివరకు అసెంబ్లీ ఎన్నికల రూపంలో కాలం ఎదురుతన్నటం మొదలైంది.

Update: 2024-06-16 11:28 GMT

ఎంతబలవంతుడైనా కాలానికి లొంగిపోక తప్పదు. బలవంతుడు ఎంతమంది ప్రత్యర్ధులతో అయినా ఏకకాలంలో పోరాడి గెలగలడేమోకాని కాలంతో మాత్రం పోరాడిగెలవటం అసాధ్యం. ప్రస్తుతం కేసీయార్ విషయంలో జరుగుతున్నది చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. కాలం అనుకూలంగా ఉన్నంతకాలం తనంతటి వారులేరని, తనకు ఎదురేలేరన్నట్లుగా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. 2014-23 నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలవరకు కేసీయార్ తనిష్టంవచ్చినట్లు చెలాయించుకున్నారు. చివరకు అసెంబ్లీ ఎన్నికల రూపంలో కాలం ఎదురుతన్నటం మొదలైంది.

ఇపుడు విషయం ఏమిటంటే మేడిగడ్డ ప్రాజెక్టులో లోపాలు కేసీయార్ మెడకు చుట్టుకోబోతున్నట్లే అనుమానంగా ఉంది. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లోని అవినీతి, లోపాలు తదితరాలపై జస్టిస్ పీసీ ఘోష్ విచారిస్తోంది. ఈ కమిషన్ ముందు ఐదుగురు రిటైర్డు ఇంజనీర్ల కమిటి వాగ్మూలాలిచ్చింది. రిటైర్డ్ ఇంజనీర్ల కమిటికి చాలా ప్రాముఖ్యత ఉందనే చెప్పాలి. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజి నిర్మించిన ప్లేసుపై అప్పట్లోనే చాలా ఆరోపణలొచ్చాయి. అయితే ఆరోపణలను లెక్కచేయకుండా కేసీయార్ తనిష్టప్రకారమే నిర్మాణం పూర్తిచేశారు. అందరు కూడా రిటైర్డ్ ఇంజనీర్ల కమిటి ఇచ్చిన రిపోర్టు ప్రకారమే మేడిగడ్డ బ్యారేజి స్ధలాన్ని కేసీయార్ ఎంపికచేసున్నారని అనుకున్నారు. అందుకనే ఇరిగేషన్ ప్రాజెక్టులో పనిచేసిన, చేస్తున్న ఉన్నతాధికారులందరినీ కమిషన్ విచారిస్తోంది.

ఇందులో భాగంగానే రిటైర్డ్ ఇంజనీర్ల కమిటికి కూడా కమిషన్ నోటీసులిచ్చింది. కమిషన్ విచారణకు హాజరైన ఇంజనీర్ల కమిటి మేడిగడ్డ నిర్మించిన స్ధలానికి తమకు ఎలాంటి సంబంధంలేదని కుండబద్దలు కొట్టింది. అసలు మేడిగడ్డ ప్రాజెక్టును నిర్మించిన స్ధలాన్ని వద్దని తాము చెప్పినా కేసీయార్ పట్టించుకోలేదని చెప్పింది. స్ధలం ఎంపిక, పునాదులు తవ్వటం, ప్రాజెక్టు నిర్మాణంవరకు చీఫ్ ఇంజనీర్ తరహాలో మొత్తం కేసీయారే చేసినట్లు ఇంజనీర్ల కమిటి చెప్పింది. ప్రాణహిత ప్రాజెక్టులోని తుమ్మిడిహట్టి ప్రాంతాన్ని ప్రాజెక్టు నిర్మాణానికి కమిటి సూచిస్తే అదికాస్త మేడిగడ్డకు మారిందని ఇంజనీర్ల కమిటి చెప్పింది. ప్రాజెక్టు నిర్మాణానికి మేడిగడ్డ అనువైనది కాదని తాము చెప్పినా కేసీయార్ వినిపించుకోలేదని కూడా ఇంజనీర్ల బృందం స్పష్టంగాచెప్పింది.

అంటే కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీల్లోని అవినీతి, ప్రాజెక్టుల నిర్మాణానికి స్ధలం ఎంపిక, కాంట్రాక్టుసంస్ధల ఎంపికమొత్తం కేసీయార్ కనుసన్నల్లోనే జరిగిందన్నట్లుగా అర్ధమవుతోంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లోని లోపాలు, అవినీతే కాదు, విద్యుత్ రంగంలో అవినీతి జరిగిందనే ఆరోపణలు, జరుగుతున్న జ్యుడీషియల్ విచారణ, టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కోర్టు విచారణ తదితరాలన్నీ కేసీయార్ కేంద్రంగానే జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఈమధ్యనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఘోరపరాభవం లాంటివన్నీ మెడకు చుట్టుకుంటున్నాయి. తాజాగా విద్యుత్ రంగంలోని అవినీతి ఆరోపణలపై కేసీయార్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి రాసిన లేఖ బాగా సంచలనమవ్వటంతో పాటు వివాదాస్పదమవుతోంది. దీనిపై ఛైర్మన్ ఏ విధంగా స్పందిస్తారో తెలీటంలేదు. ఇక పార్టీ ఎంఎల్ఏలు ఎంతమంది ఎప్పుడు పార్టీని వదిలేస్తారో అనే టెన్షన్ కేసీయార్ లో పెరిగిపోతున్నట్లుంది. మొత్తంమీద అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిరూపంలో మొదలైన కేసీయార్ బ్యాడ్ టైం చివరకు ఎక్కడికి దారితీస్తుందో చూడాల్సిందే.

Tags:    

Similar News