ఫిరాయింపు నేతల పిటిషన్‌పై సుప్రీంకోర్టు వాడివేడి విచారణ!
ఫిరాయింపు నేతల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫిరాయింపులను అడ్డుకోవడానికి రాజ్యంగంలో ఒక షెడ్యూల్ ఉందని గుర్తు చేసింది.;
ఫార్టీ ఫిరాయింపు నేతల పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఎన్ని వ్యాఖ్యలు చేసినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా కేసు మాత్రం ముందుకు సాగడం లేదు. స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదన్న విషయం దగ్గర ఆగిపోయి ఉంది. కాగా బుధవారం ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. జస్టిస్ బీఆర్ గవాయ్, ఆగస్టీన్ జార్జ్ మసీహ్‌ల ద్విసభ్య ధర్మాసనం ఇరు వర్గాల వాదనలు వింటోంది. ఇందులో భాగంగానే అసెంబ్లీ తరపున వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహత్గీ వాదను విన్న ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కాగా తన వాదనల్లో భాగంగా ఈ కేసులో సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్ తీర్పును రోహత్గీ సరైనందని పేర్కొన్నారు. స్పీకర్‌కు గడువు విధించిన హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు సరికాదని ఆయన వాదించారు. దీంతో ఈ అంశంపై ధర్మాసనం స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
కోర్టు ధిక్కరణ కేసులో అసెంబ్లీ స్పీకర్‌ను కూడా కోర్టులో నిలబెట్టిన విషయాన్ని మర్చిపోవద్దని స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయింపులను అడ్డుకోవడం కోసమే రాజ్యంగంలో 10వ షెడ్యూల్ ఉందని, అలాంటిప్పుడు ఫిరాయింపులపై ఎలాంటి నిర్ణక్ష్ం తీసుకోకపోతే రాజ్యంగాన్ని అవమానించనట్లేనని కోర్టు పేర్కొంది. కాగా ఈ పిటిషన్ విచారణలో భాగంగా బీఆర్ఎస్ తరపు వాదనలు ముగిశాయి. ఈ క్రమంలోనే ఫిరాయింపు నేతలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని కేటీఆర్, కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. అనంతరం రోహత్గీ తన వాదనలు వినిపించారు. న్యాయస్థానాలు స్పీకర్‌ను ఆదేశించలేవని, కేవలం సూచన చేయగలవని ముకుల్ రోహత్గీ వివరించారు.
"స్పీకర్కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవు. ఒకసారి ఆయన నిర్ణయం తీసుకున్నాకే జ్యుడిషియల్ సమీక్షకు అవకాశముంటుంది. స్పీకర్ కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పడం భావ్యం కాదు. ఒకవేళ సూచనలు చేస్తే స్వీకరించాలా? లేదా? అనేది స్పీకర్ నిర్ణయమే. ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదు" అని ముకుల్ రోహత్గ వాదించారు.
వెంటనే జస్టిస్ గవాయ్ స్పందిస్తూ.. ఫిరాయింపుల విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు చెప్పలేమా? విజ్ఞప్తి చేయడమో.. ఆదేశించడమో చేయలేమా? అని ప్రశ్నించారు. నాలుగేళ్ల పాటు స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్నా కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా? అని అడిగారు. దీనిపై స్పందించిన రోహత్గీ.. పిటిషనర్ల ఇష్టానుసారం ఫిరాయింపులపై స్పీకర్ వ్యవహరించలేరని చెప్పారు. ‘‘18 మార్చి 2024న ఫిరాయింపులపై స్పీకర్‌కు పిటిషనర్లు ఫిర్యాదు చేశారు. 16 జనవరి 2025న 10మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. స్పీకర్ తన విధులను నిర్వర్తిస్తున్నారు’’ అని వివరించారు.