కేటీఆర్‌కు పరువు నష్టం నోటీసులు..

అమృత్ టెండర్ల పేరిట సీఎం రేవంత్ రెడ్డి భారీ కుంభకోణం చేశారన్న అంశంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సజన్ రెడ్డి లీగల్ నోటీజులు జారీ చేశారు.

Update: 2024-09-26 14:29 GMT

అమృత్ టెండర్ల పేరిట సీఎం రేవంత్ రెడ్డి భారీ కుంభకోణం చేశారన్న అంశంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సజన్ రెడ్డి లీగల్ నోటీజులు జారీ చేశారు. కేటీఆర్ తన ఇష్టారాజ్యంగా మాట్లాడి తన పరువుకు భంగం కలిగించారని ఆయన తన నోటీసుల్లో పేర్కొన్నారు. తనను, న సంస్థను ఉద్దేశించి చేసిన తప్పుడు వ్యాఖ్యలను కేటీఆర్ వెంటనే వెనక్కి తీసుకోవాలని సృజన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్‌కు పరువు నష్టం నోటీసులను అందించారాయన. తన సంస్థ శోభ కన్‌స్ట్రక్షన్స్ ఎటువంటి తప్పూ చేయలేదని, జాయింట్ వెంచర్ ప్రకారం అన్ని నిబంధనలు పాటిస్తూనే ప్రాజెక్ట్‌లు చేశామని సృజన్ పేర్కొన్నారు. అయితే కొద్ది రోజులుగా అమృత్ టెండర్ల అంశం తెలంగాణలో సంచలనంగా మారింది. ఈ టెండర్ల విషయంలో కేటీఆర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలతో పాటు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కూడా తప్పుబట్టారు. అమత్ టెండర్ల విషయంలో కేటీఆర్‌కు తప్పుడు సమాచారం అందిందని చెప్పుకొచ్చారు. అయినా కేటీఆర్ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా అమృత్ టెండర్లతో వేల కోట్ల ప్రజాధనాన్ని సీఎం రేవంత్ రెడ్డి పక్కదారి పట్టించేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సృజన్‌కు రేవంత్ సంబంధం లేదు: ఉపేందర్

కేటీఆర్ చెప్తున్నట్లు సృజన్ రెడ్డి.. రేవంత్ రెడ్డి బామ్మర్ది కాదని బీఆర్ఎస్ నేత ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సృజన్ రెడ్డ తన సొంత అల్లుడని, శోభ కన్‌స్ట్రక్షన్ తన అల్లుడి సంస్థే అని ఉపేందర్ తేల్చి చెప్పారు. ‘‘సృజన్ రెడ్డి నా సొంత అల్లుడు. రేవంత్ రెడ్డి బామ్మర్ది కాదు. రేవంత్ రెడ్డి చిన్న మామ కుమారుడు సృజన్ రెడ్డి. సృజన్ రెడ్డికి చిన్న సంస్థ ఉంది. ఆ సంస్థకు సొంతగా ప్రాజెక్ట్ తీసుకునే అర్హత లేదు కాబట్టే జాయింట్ వెంచర్‌కు వెళ్లారు. సృజన్‌కి రాజకీయాలతో సంబంధం లేదు. అమృత్ టెండర్ల విషయంలో కేటీఆర్‌కు ఎక్కడో తప్పుడు సమాచారం అందింది. అది వెరిఫై చేసుకోవడం కేటీఆర్ మర్చిపోయినట్లు ఉన్నారు’’ అని ఉపేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలోనే తనపై లేనిపోని వ్యాఖ్యలు చేసి తన పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ సృజన్ రెడ్డి.. కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు.

అసలేంటీ అమృత్ టెండర్ల వివాదం..

‘‘సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది సూదిని సృజన్ రెడ్డికి చెందిన కంపెనీకి ఎటువంటి అర్హతలు లేకపోయినా వేల కోట్ల విలువైన పనులను సీఎం కట్టబెట్టారు. ఇండియన్ హ్యూమ్ పైప్ అనే సంస్థను పిలిచి బెదిరించి వారి పేరుతో బామ్మర్ది కంపెనీకి టెండర్లను కట్టబెట్టించారు. పనుల టెండర్లు సొంతం చేసుకుందని పేరుకే ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ కానీ పనులు చేస్తుందని మాత్రం రేవంత్ బామ్మర్ది. టెండర్ దక్కించుకున్న ఇండియన్ హ్యూమ్ పైప్‌ కంపెనీతో జాయింట్ వెంచర్ డ్రామా ఆడి రేవంత్ బామ్మర్ది రూ.1,137 కోట్ల కాంట్రాక్టు సొంతం చేసుకున్నారు. ఇందులో టెండర్ గెలుచుకున్న కంపెనీ 20 శాతం పని చేస్తుంటే.. సీఎం రేవంత్ బామ్మర్ది సంస్థ 80శాతం అంటే రూ.1000 కోట్ల పని చేస్తుంది. ఈ మేరకు ఐహెచ్‌పీ అనే సంస్థ సెబీకి సమాచారం ఇచ్చింది. ఇండియన్ హ్యూమ్‌ను శిఖండి సంస్థగా అడ్డుపెట్టుకుని రేవంత్ రెడ్డి, ఆయన బామ్మర్ది కలిసి తెలంగాణ ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారు. స్వయంగా రంగంలోకి దిగి.. అధికారులను భయపెట్టి మరీ సీఎం రేవంత్ ఈ కాంట్రాక్టులను తన బామ్మర్ది సంస్థకు కట్టబెట్టారు’’ అని కీలక ఆరోపణలు చేశారు కేటీఆర్.

అందుకే గోప్యత: కేటీఆర్

‘‘తన ఇంట్లోని లంకె బిందెలు నింపుకోవడం కోసం సీఎం రేవంత్ రెడ్డి అక్రమ టెండర్లకు తెరలేపారు. బామ్మర్ది కళ్లలో సంతోషం చూడటం కోసం ఎన్నుకున్న ప్రజల వెన్నునే విరిస్తున్నారు. అమృత్ టెండర్ల పేరిట రూ.8,888 కోట్ల కుంభకోణం చేశారు. అందుకనే రూ.8,888 కోట్ల టెండర్లకు సంబంధించిన వివరాలను బయటపెట్టకుండా గోప్యంగా ఉంచుతున్నారు. స్టాక్ ఎక్సేంజీలకు ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ సమాచారం ఇవ్వాల్సిన గత్యంతరం పట్టడంతోనే ఈ టెండర్ల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది దక్కించుకున్న వందల కోట్ల టెండర్ల వ్యవహారం వెలుగు చూసింది. ఈ టెండర్లకు సంబంధించిన ఒక్క జీవోను కూడా ప్రభుత్వం బహిర్గతం చేయడం లేదు. రేవంత్ రెడ్డి పాల్పడుతున్న అనేక కుంభకోణాలకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలను ప్రజల ముందు ఉంచుతాం. కొడంగల్ ఎత్తిపోతల పథకం, ఫోర్ బ్రదర్స్ సిటీ వంటి ఎన్నో కుంభకోణాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. తన బామ్మర్దికి అమృతం పంచుతూ ఎన్నుకున్న ప్రజలకు విషాన్ని పంచుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి’’ అని మండిపడ్డారు కేటీఆర్.

Tags:    

Similar News