10 వేల మందికి ఉపాధి బాట వేసిన స్నేహలత

న్యాక్ నుంచి నేషనల్ అవార్డ్ దాకా...వరంగల్ స్నేహాలత యాత్ర;

Update: 2025-09-09 09:28 GMT
గోడ నిర్మాణం గురించి నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్న నక్కా స్నేహలత

ఇదీ దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్...తెలంగాణలోని (Telangana) నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌లో (National Academy of Construction) సీనియర్ ఇన్‌స్ట్రక్టరుగా పనిచేస్తున్న నక్కా స్నేహలతకు (SnehaLatha Nakka) స్కిల్ డెవలప్‌మెంటులో జాతీయ అవార్డును సాక్షాత్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ప్రదానం చేశారు. ఈ అవార్డు కింద రాష్ట్రపతి మెరిట్ సర్టిఫికెట్ తో పాటు రూ.50వేల నగదు పురస్కారాన్ని, మెడల్ ను ప్రదానం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ అవార్డు పొందిన స్నేహలతకు ఆహుతులు చప్పట్లతో ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణకు చెందిన వరంగల్  స్నేహలతను అభినందించారు. 




 10వేల మంది కార్మికులకు శిక్షణ

న్యాక్ మహిళా ట్రైనర్‌ నక్కా స్నేహలతకు నేషనల్ అవార్డు దక్కింది. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ లో సీనియర్ ఇన్ స్ట్రక్టరుగా స్నేహలత పదివేల మంది మేస్త్రీలకు, సూపర్ వైజర్లు, భూసర్వేయర్లకు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి చూపారు. బీటెక్ చదివిన అమ్మాయిలు ఎక్కువగా ఐటీ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో నిర్మాణ రంగంపై ఆసక్తితో పట్టుదలగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ లో ఇన్ స్ట్రక్టరుగా చేరి కార్మికులకు భవన నిర్మాణ రంగంలో శిక్షణ ఇచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు.




 జీవితాల్లో వెలుగులు నింపిన స్నేహలత

నిరుద్యోగ యువతీ, యువకులకు భవన నిర్మాణం చేసే తాపీ మేస్త్రీలుగా, ల్యాండ్ సర్వే, ఆటో క్యాడ్ కార్మికులే కాకుండా నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపిన నక్కాస్నేహలత జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు. స్నేహలత తనకు ఇష్టమైన భవననిర్మాణ రంగంలో సక్సెస్ సాధించి, జాతీయ అవార్డు పొందారు. స్నేహలత సక్సెస్ స్టోరీని ఆమె మాటల్లోనే విందాం.



 భవననిర్మాణ రంగంపై ఆసక్తి

‘‘నా పేరు నక్కా స్నేహలత. మాది హన్మకొండ జిల్లాలోన హన్మకొండ నగరంలోని గోకుల్ నగర్ నా నివాసస్థలం. నాకు మొదటి నుంచి సివిల్ ఇంజినీరింగ్ రంగంపై ఆసక్తి ఉండటంతో 2007వ సంవత్సరంలో వరంగల్ కిట్స్ కళాశాలలో సివిల్స్ ట్రేడులో ఇంజినీరింగ్ పూర్తి చేశాను. నా చదువు పూర్తి కాగానే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ ఇన్ స్ట్రక్టర్ గా ఉద్యోగంలో చేరాను. నాటి నుంచి గడచిన 18 ఏళ్లలో పదివేల మందికి పైగా యువతీ, యువకులకు భవన నిర్మాణ రంగంలో కార్మికులుగా శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి బాట చూపించాను.



 తక్కువ ఖర్చుతో నాణ్యతగా భవన నిర్మాణం

వ్యవసాయ రంగం తర్వాత ప్రధాన మైన భవననిర్మాణరంగంలో (construction industry) కార్మికులకు మెరుగైన శిక్షణ ఇవ్వడానికి ఇన్ స్ట్రక్టరుగా నా శాయశక్తులా శ్రమిస్తున్నాను. తక్కువ ఖర్చుతో నాణ్యతగా భవన నిర్మాణాలు చేపట్టేలా కార్మికులకు పాఠాలు, ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నాను. భూముల సర్వేలో కొత్తగా డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం అందుబాటులోకి వచ్చింది. దీంతో సులభంగా భూముల సర్వే చేసేలా కార్మికులకు శిక్షణ ఇచ్చాను. భవన నిర్మాణం, స్ట్రీలు స్ట్రక్చర్, కాంక్రీట్ మిక్సింగ్, సెంట్రింగ్, గోడల ప్లాస్టరింగ్ ఇలా ఒకటేమిటి? భవన నిర్మాణంలో కార్మికులకు మెరుగైన శిక్షణ ఇచ్చి వారు బాగా పనిచేసేలా తీర్చిదిద్దడమే నా లక్ష్యం.భవిష్యత్ లోనూ నేను మహిళనైనా ఛాలెంజింగ్ గా తీసుకొని ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మికులకు మెరుగైన శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి బాట చూపించాలనేదే నా జీవితాశయం. దీని కోసం నేను అహర్నిశలు శ్రమిస్తుంటాను. నాకు వచ్చిన జాతీయ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది’’అంటారు నక్కా స్నేహలత.



 అవార్డు ఎందుకు వచ్చిందంటే...

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించినందుకు గాను నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ లో ఇన్ స్ట్రక్టర్ గా పని చేస్తున్న హన్మకొండకు చెందిన నక్క స్నేహలతకు జాతీయ అవార్డు లభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా, కరీంనగర్, జగిత్యాల పట్టణాల్లో నిరుద్యోగ యువతకు సర్టిఫికెట్ కోర్సులు, ఉద్యోగ అవకాశాలు కల్పించే వృత్తివిద్యా కోర్సులను అందిస్తూ, ఉత్తమ బోధన అందించేందుకు చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్ మెంట్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ విభాగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఢిల్లీలో జాతీయ ఉత్తమ టీచర్స్ అవార్డును న్యాక్ ట్రైనర్ స్నేహలత అందుకున్నారు.



 మంత్రి కోమటిరెడ్డి అభినందనలు

రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న స్నేహలతను న్యాక్ వైస్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అభినందించారు. భవన నిర్మాణ రంగంలో నైపుణ్యాలకు ఉత్తమ వేదికగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్ష న్(NAC) ను బలోపేతం చేస్తున్నామని మంత్రి ప్రకటించారు. వేలాది మంది కార్మికులకు నాణ్యమైన నైపుణ్య శిక్షణ ఇస్తూ,ఉపాధి కల్పించడం పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు విద్యార్థుల్లో స్కిల్ డెవలప్ మెంట్ పెంపొందించాలనే లక్ష్యంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పారు. తెలంగాణ నుంచి న్యాక్ ఇన్ స్ట్రక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న హన్మకొండకు చెందిన నక్కా స్నేహలతకు అవార్డు రావడం తెలంగాణ రాష్ట్రానికి గర్వ కారణం అని కరీంనగర్ జిల్లా న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ గోలి రమేష్ వ్యాఖ్యానించారు. న్యాక్ కు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు దక్కడం తమలో మరింత ఉత్సాహాన్ని నింపిందన్నారు.


Tags:    

Similar News