శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్‌బీసీ) టన్నెల్‌లో చిక్కుకుపోయిన కార్మికులను గుర్తించేందుకు కేంద్ర,రాష్ట్ర విపత్తు బృందాలతో పాటు ఆర్మీ, నేవీ, సింగరేణి, కేంద్ర ప్రభుత్వ రహదారుల విభాగం, జేపీ,నవయుగ లకు చెందిన ఇంజినీర్ల బృందం సహాయ చర్యలు ముమ్మరం చేసినా సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాడ దొరకలేదు. దీంతో టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు స్నిపర్ డాగ్‌లను రంగంలోకి దించారు.
- సొరంగం లోపల దెబ్బతిన్న కన్వర్ కు మరమ్మత్తులు చేపట్టాలని నిర్ణయించారు. వర్టికల్ డ్రిల్లింగ్ ప్రతిపాదనకు స్వస్తి చెప్పారు. సోమవారం ఉదయం నుంచి సంఘటన స్థలంలో పరిస్థితులను మంత్రి కోమటిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి,తెలంగాణ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది.
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఎస్ఎల్‌బీసీ దోమలపెంట వద్ద జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెలికితీయడానికి కేంద్ర,రాష్ట్ర విపత్తు బృందాలతో పాటు ఆర్మీ, నేవీ, సింగరేణి, కేంద్ర ప్రభుత్వ రహదారుల విభాగం, జేపీ, నవయుగ లకు చెందిన ఉన్నతాధికారుల బృందం ఇప్పటివరకు ఏడు సార్లు టన్నెల్ లో తనిఖీలు నిర్వహించాయి. వీరి బృందంలో 584 నిపుణులైన సిబ్బంది ఉన్నారు.ఉత్తరాఖండ్ లో జరిగిన విపత్తుల్లో ఈ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లను సమర్థవంతంగా నిర్వహించాయి. వీరితోపాటు 14 మంది ర్యాట్ హోల్ టీమ్ సేవలను ముమ్మరంగా ఉపయోగిస్తున్నారు.
లోపలకు వెళ్లలేక పోయిన స్నిపర్ డాగ్ లు
టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీని తెలుసుకునేందుకు స్నిపర్ డాగ్స్ లను కూడా రప్పించారు. టన్నెల్ లోపల నీరు ఉన్నందున ఈ స్నిపర్ డాగ్స్ లోపలికి వెళ్లలేక పోయాయి. ఇప్పటికే డ్యామేజి అయిన కన్వీయర్ బెల్ట్ కు మరమ్మతులు చేపట్టారు.టన్నెల్ లోపలికి పై నుంచి రంద్రం చేసి లోపలికి వెళ్లాలన్న (వర్టికల్ డ్రిల్లింగ్ ) ప్రతిపాదనను తోసిపుచ్చారు. 5 గ్యాస్ కట్టింగ్ మిషన్లు రాత్రీ పగలూ పని చేస్తున్నాయి. టన్నెల్ లో సహాయ కార్యక్రమాలను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దోమలపెంట ప్రాజెక్టు సైట్ లో ఉండి పర్యవేక్షిస్తున్నారు.
ప్రమాద స్థలానికి చేరువలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
టన్నెల్ వద్ద జయ్ ప్రకాష్ సంస్థ క్యాంప్ కార్యాలయంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాబిన్స్ టన్నెల్ కంపెనీ ప్రతినిధి గ్రేస్, ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధి, టన్నెల్ వర్క్స్ ఎక్స్ పర్ట్ ఇంజనీర్ క్రిస్ కూపర్ తో పాటు డిజాస్టర్ మేనేజ్ మెంట్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్,హైడ్రా కమిషనర్ ఏ.వి.రంగనాథ్, ఇండియన్ ఆర్మీ ప్రతినిధులు,ఎన్.డీ.ఆర్.ఎఫ్. ప్రతినిధులు, జయ్ ప్రకాష్ సంస్థ ప్రతినిధులు, ఇరిగేషన్ సీఈ అజయ్ కుమార్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. సత్వర సహాయ చర్యలతో టన్నెల్ లో చిక్కుకున్న వారిని కాపాడాలని మంత్రి ఆదేశించారు.టన్నెల్ ప్రమాద ప్రాంతంలో బురదను తొలగిచేందుకు 100 హెచ్.పి మోటార్లను రప్పించారు.ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రమాద ప్రాంతానికి చేరినట్టుగా ఎన్డీఆర్ఎఫ్ హెడ్ చెప్పారు.
కార్మికులను కాపాడేందుకు యత్నం : మంత్రి కోమటిరెడ్డి
టన్నెల్ వద్ద సహాయక చర్యలను మంత్రి కోమటిరెడ్డి పర్యవేక్షించారు. ఎంత కష్టమైనా సరే టన్నెల్ లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ఉన్న అన్ని మార్గాల్లో ప్రయత్నించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దేశవ్యాప్తంగా జరిగిన టన్నెల్ ప్రమాద సంఘటనల్లో చిక్కుకున్న బాధితులను కాపాడిన నిపుణుల అనుభవాలను తీసుకొని వారిని సురక్షితంగా కాపాడే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి వివరించారు.