యూరియా అందక పొలాల్లో పొట్టిగా పూతకొస్తున్న మొక్కలు

సకాలంలో యూరియా వేయకపోవడంతో ఎత్తు పెరగని పంట, దిగుబడి తగ్గుతుందనే భయం.

Update: 2025-09-30 13:57 GMT
వరి పంటకు యూరియా కొరత :దిగుబడికి దెబ్బ

తెలంగాణలో (Telangana) రైతులు కొత్త సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారు.ఇంతవరకు యూరియా కోసం విపరీతంగా కష్టపడ్డారు.చిన్నరైతులెవరికి అవసరానికి తగ్గ యూరియా దొరకలేదు. ఖరీఫ్ సీజను చివరిలోనూ ఇంకా రైతులు రేయింబగళ్లు యూరియా (shortage of urea) కోసం వేచి చూస్తూనే ఉన్నారు. దీంతో చాలా మంది రైతులు పంటలకు సకాలంలో తగిన మోతాదులో యూరియా వాడలేకపోయారు. ఫలితంగా పలు ప్రాంతాల్లో మొక్కలు కావాల్సినంత ఎత్తు పెరగడం లేదని, పొట్టివైపోయాయని రైతులు చెబుతున్నారు. దీని వల్ల పంటదిగుబడి బాగా తగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.


యూరియా కొరతతో తగ్గనున్న దిగుబడులు
యూరియా వేస్తేనే వివిధ పంటు ఏపుగా, ఎత్తుగా పెరగడంతోపాటు పచ్చదనంతో కళలాడుతుంటాయి. కానీ సకాలంలో పంటలకు యూరియా వేయకపోతే పసుపురంగులోకి మారి దిగుబడి తగ్గుతాయని వ్యవసాయ శాస్త్రవేత్త ఎన్డీఆర్కే శర్మ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పెరగాల్సిన ఎత్తుకంటే మొక్కలు పెరగకపోతే, దిగుబడి తగ్గిపోతుందని ఆయన చెప్పారు. దీన్నే స్టన్టెడ్ గ్రోత్ ( Stunted Growth) అంటారని ఆయన తెలిపారు.

తెలంగాణ రైతుల ఆందోళన
సకాలంలో యూరియా అందకపోవడంతో ఆశించిన మేరకు పంట దిగుబడులు రాకపోవచ్చని తెలంగాణ రైతులు (Telangana farmers worry)ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ పంటల సాగు మొదలై మూడు నెలలు అయినా యూరియా వేయకపోవడం వల్ల పంట ఎదుగుదల సరిగా లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు.పంటలకు యూరియా సరిపడా వేస్తేనే పంట దిగుబడులు వస్తాయని, సకాలంలో వేయాల్సిన యూరియా అందుబాటులో లేక వరి చేలు పసుపురంగు, ఎరుపు రంగులోకి మారుతున్నాయని రైతులు చెప్పారు. ‘‘మొక్క జొన్న ల్లో ఎదుగుదల లేదు. కంకి గింజలు సరిగ్గా రావటం లేదు. యూరియా వేయకపోవడంతో బలం లేక కంకులు సరిగ్గా పడటం లేదు’’ అని జగిత్యాలకు చెందిన రైతు డి వేణుమాధవరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

ముంచిన మొక్కజొన్న
మొక్కజొన్న చేతికందాల్సి ఉండగా ఎదుగుదల లేక కొంత ఎత్తులోనే తల వెన్ను దశకు చేరుకుంది. అక్కడక్కడా పీచులు తీయగా కంకిలో నాణ్యత కనిపించలేదు. వరి పంట పొట్ట దశకు వచ్చే సరికి రెండు దఫాలుగా యూరియా వేయాల్సి ఉంటుంది. కానీ దుక్కి దున్నినపుడు వేసిన యూరియాతో రైతులు సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇక పూత దశకు చేరాల్సిన పత్తి చేలు ఎదుగుదల లేక అడుగు ఎత్తునే పెరిగాయి. ఎక్కువ పూత రావడం లేదు.పోడు భూముల్లో యూరియా సకాలంలో వేయక పోవడం వల్ల పంటలు దెబ్బతిన్నాయి.

చాలీ చాలని యూరియా
తెలంగాణలో ఈ ఏడాది ఖరీఫ్ సీజనులో 9.80 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా ఏప్రిల్ నుంచి సెప్టెంబరు దాకా 7.88 లక్షల టన్నుల యూరియానే వచ్చింది. డిమాండుకు అనుగుణంగా యూరియాను సరఫరా చేయలేక పోవడంతో బస్తా యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడ్డారు. ఖరీఫ్ సీజన్ మరో పదిరోజుల్లో ముగియనున్నా ఇంకా ఆశించిన మేర యూరియా రాష్ట్రానికి రాలేదు. ఖరీఫ్ సీజన్ ముగిసి, వేసంగి సీజన్ ఆరంభం అయ్యే పరిస్థితుల్లో నేటికి రైతులు యూరియా కోసం అగచాట్లు పడుతున్నారు.

ఖరీఫ్ ముగియనున్నా తీరని యూరియా కొరత
- తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ముగియనున్నా యూరియా కొరత మాత్రం తీరలేదు. మెదక్ జిల్లా శివ్వంపేట సహకార సంఘం వద్ద మహిళలు, వృద్ధ రైతులు బస్తా యూరియా కోసం రాత్రి నుంచి 15 గంటల పాటు క్యూలో వేచి ఉన్నారు.రాత్రి 11 గంటల నుంచి చెప్పులు, ఇటుకల వరస పెట్టి నిరీక్షించినా దొరక లేదని కె లక్ష్మయ్య చెప్పారు. రైతులు యూరియా కోసం రాత్రీ పగలూ సొసైటీల చుట్టూ తిరుగుతున్నారు. యూరియా కోసం రైతు వేదికల వద్ద రేయింబవళ్లూ పడిగాపులు పడినా ఒక బస్తా యూరియా దొరకలేదని రైతులు ఆవేదనగా చెప్పారు.
- వరంగల్ జిల్లా కేసముద్రంలో రైతు వేదిక వద్ద యూరియా టోకెన్ల కోసం రైతులు రాత్రి నుంచి వేచి చూసినా కేవలం 300 మందికే టోకెన్లు అందించారు. తాను రెండు రోజులుగా యూరియా కోసం సొసైటీ కార్యాలయం వద్ద చంటి బిడ్డను ఎత్తుకొని నిల్లున్నా ఒక బస్తా కూడా దొరకలేదని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం గూడెం గడ్డ గ్రామానికి చెందిన కొట్టే లక్ష్మీ అనే రైతు ఆవేదనగా చెప్పారు.
- తెలంగాణలోని పలు గ్రామాల్లో రైతులు యూరియా కష్టాలు ఎదుర్కొంటున్నారు. యూరియా కోసం ఆగ్రహించిన రైతులు పలు చోట్ల రాస్తారోకోలు చేసినా సమస్య మాత్రం పరిష్కరించలేదు. చేర్యాల మండల పీఏసీఎస్ కార్యాలయం వద్ద 2,243 యూరియా బస్తాలు రాగా, వేలాది మంది రైతులు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులతో రైతులు తరలివచ్చారు.
- వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామంలో తెల్లవారుజామున 4గంటల నుంచి తాము వేచి ఉంటే ఒక బస్తా యూరియానే దొరికిందని రైతులు ఆవేదనగా చెప్పారు. తెలంగాణలో ఈ ఖరీఫ్ సీజనులో ఎక్కడా చూసినా యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడ్డారు. యూరియా కొరత ముందుగా వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి ఆరంభం అయి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది.

తెలంగాణలో పంటల సాగు ఇలా...
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజనులో 1.33 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. 67 లక్షల ఎకరాల్లో వరి, 48.93 లక్షల ఎకరాల్లో పత్తి, 5.21 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న,6.69 లక్షల ఎకరాల్లో కంది పంటలు సాగుచేస్తున్నారు. మిరప 1.90 లక్షల ఎకరాల్లో, సోయాబీన్ 4.10లక్షల ఎకరాల్లో, పెసలు 65వేల ఎకరాల్లో, మినుములు 28వేల ఎకరాల్లో సాగవుతున్నట్టు వ్యవసాయశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

యూరియా ఎప్పుడు వేయాలంటే...
పత్తి, వరి, మొక్కజొన్న, కంది పంటలకు యూరియాను రైతులు వేస్తుంటారు. వరినాట్లు వేసే సమయంలో, కలుపుతీసే సమయంలో, పిలకలు వచ్చే సమయంలో 30 రోజులకు ఒకసారి యూరియాను వేస్తుంటారు. పంటలకు ఎరువులను నాలుగు మోతాదులు నత్రజని, రెండు మోతాదులు భాస్వరం, ఒక మోతాదు పోటాష్ వేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కానీ రైతులు యూరియాను 8 మోతాదులు వేస్తున్నారు. ‘‘మేం సిఫార్సు చేసిన దానికంటే ఎరువులు అధికంగా వాడితే దిగుబడులు ఆశించినంతగా రావు, యూరియా అధికంగా వాడినందువల్ల పంటలపై చీడపీడల బెదద పెరుగుతుంది, పంటలు పూత, కాయ, విత్తనం దశకు చేరుకున్నాక యూరియా వేయడం వల్ల ఉపయోగం లేదు’’అని వ్యవసాయ శాస్త్రవేత్త ఎన్డీఆర్ కే శర్మ చెప్పారు.అధిక యూరియా వేస్తే పెట్టుబడి పెరగడంతోపాటు ఆశించిన మేర దిగుబడులు రావని ఆయన వివరించారు.

యూరియా కొరతకు కారణాలివి...
తెలంగాణలో యూరియా కొరత ఏర్పడటానికి పలు కారణాలున్నాయి. దిగుమతి టెండర్లలో ఆలస్యం కారణంగా రైతులకు సరిపడా యూరియా బస్తాలు రాలేదు. ‘‘ఏప్రిల్, మే నెలల్లో యూరియా కొరత ఏర్పడనుందని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వల్ల ఆందోళన చెందిన బడా రైతులు, డబ్బున్న రైతులు యూరియాను కొని స్టాకు పెట్టుకున్నారు,దీంతో డిమాండుకు అనుగుణంగా కేంద్రం యూరియాను సప్లయి చేయక పోవడంతో యూరియా సంక్షోభం ఏర్పడింది’’ అని వ్యవసాయ శాఖ సీనియర్ శాస్త్రవేత్త ఎన్డీఆర్కే శర్మ వ్యాఖ్యానించారు.

రామగుండం ఎరువుల కర్మాగారం షట్ డౌన్
తెలంగాణ రాష్ట్రంలోని రామగుండం ఎరువుల కర్మాగారాన్ని షట్ డౌన్ చేయడం యూరియా కొరతకు ప్రధాన కారణంగా మారింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు 145 రోజులు యూరియా ఉత్పత్తి చేయాల్సి ఉండగా 78 రోజులపాటు ఉత్పత్తి నిలిచిపోయిదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. కాగా అమ్మోనియం లీకేజీ, సాంకేతిక కారణాలతో తాము కర్మాగారాన్ని షట్ డౌన్ చేశామని ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతుంది.‘‘ రామగుండం ఎరువుల కర్మాగారంలో నెలకు లక్ష టన్నుల యూరియా ఉత్పత్తి అవుతోంది. ఈ ఫ్యాక్టరీలో 11 శాతం వాటా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే యూరియాను మన రాష్ట్రానికే కేంద్రం కేటాయిస్తే అసలు యూరియా కొరత ఉండేది కాదు’’అని అఖిల భారత కిసాన్‌ సభ అధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

యూరియాకు ప్రత్యామ్నాయం ఉందా?
యూరియా కొరత ఏర్పడిన నేపథ్యంలో నానో యూరియాను వేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నా రైతులు మాత్రం యూరియానే కావాలంటున్నారు. నానో యూరియాలో నత్రజని శాతం తక్కువగా ఉంటున్నందున మొక్కలు పెరగటానికి అది ఉపయోగపడటం లేదని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన డి బాపన్న అనే రైతు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కొన్ని చోట్ల నానో యూరియా పిచికారి చేసినా ప్రయోజనం ఉండటం లేదని పలువురు రైతులు చెబుతున్నారు.నానో యూరియా వేస్తే పచ్చదనం వస్తుందే తప్ప పైరు ఎదుగుదల కనిపించడం రైతులు పేర్కొన్నారు.యూరియాకు బదులు నానో యూరియా పిచికారీ చేయాలని వ్యవసాయ శాఖ అంటుండగా, రైతులు మాత్రం అందుకు ముందుకు రావడం లేదు.

రాజకీయం తప్పా సమస్య పరిష్కారం ఏది?
యూరియా కొరతకు కేంద్రమే కారణమని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపించగా, తాము పంపిన యూరియాను రాష్ట్ర ప్రభుత్వం సరిగా పంపిణీ చేయడం లేదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే యూరియా కోసం సోసైటీల ముందు బారులుత తీరాల్సిన పరిస్థితులు వచ్చాయని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా మూడు ప్రధాన పార్టీలు యూరియా కొరతపై తమ తమ వాదనలు వినిపిస్తున్నా యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు మాత్రం తీరడం లేదు.

ఎరువుల వాడకం తగ్గించేందుకే పీఎం ప్రణామ్ పథకం
దేశంలో రైతులు ఎరువుల వాడకాన్ని విచక్షణా రహితంగా చేస్తున్నారని, దీన్ని తగ్గించేందుకు ‘పీఎం ప్రణామ్’ పథకాన్ని కేంద్రం చేపట్టింది. ‘‘ఎరువుల వాడకాన్ని తగ్గించడం ద్వారా ఎరువుల సబ్సిడీలపై కేంద్రం కోత పెడుతుంది. దేశంలో హెక్టారుకు 177 కిలోల ఎరువులను వాడుతున్నారు. కాగా అమెరికా,చైనా దేశాల్లో హెక్టారుకు 400 కిలోలఎరువులు వేస్తున్నారు, ఎరువులపై సబ్సిడీలను తగ్గించుకునేందుకే కేంద్రం సుభాష్ పాలేకర్ ప్రవేశపెట్టిన సేంద్రీయ సేద్యాన్ని ప్రోత్సహించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నాయి. ఎరువుల సబ్సిడీని తగ్గించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిధులను పంచుకుంటున్నాయి. 45 కిలోల యూరియా బస్తా అసలు ధర 1700రూపాయలు కాగా దాన్ని కేంద్రం సబ్సిడీతో రైతులకు 250రూపాయలకే అందజేస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎరువుల సబ్బిడీ 2.5 లక్షల కోట్లు కాగా, 2025-26 నాటికి ఈ సబ్సిడీలు రూ. 1.6 లక్షల కోట్లకు తగ్గాయి’’అని అఖిల భారత కిసాన్‌ సభ అధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

అన్నదాతకు సర్కారు ఆసరా ఏది?
తెలంగాణలో రైతులకు ప్రభుత్వాల నుంచి ఆసరా లభించడం లేదని అఖిల భారత కిసాన్‌ సభ అధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. భూమి సారాన్ని భూసార పరీక్షల ద్వారా కనుగొని ఏ పంటకు ఏ భూమిలో ఎంత ఎరువు వేయాలని వ్యవసాయ శాఖ అధికారులు గతంలో చెప్పే వారని, ప్రస్థుతం ఆ వ్యవస్థ లేదని మల్లారెడ్డి చెప్పారు. వ్యవసాయ పరిశోధనలు కూడా కుంటుబడ్డాయని ఆయన ఆరోపించారు. పంటల దిగుబడి తగ్గించడం ద్వారా దిగుమతులు చేసుకునేందుకు విదేశాలు కుట్రపన్నుతున్నాయని చెప్పారు.

వేసంగి సీజనుకు యూరియా ఇవ్వండి : మంత్రి తుమ్మల
తెలంగాణలో వేసంగి సీజన్ మరో పదిరోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో నెలకు 2లక్షల టన్నుల యూరియాను సరఫరా చేయాలని తాను కేంద్రాన్ని కోరినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. యాసంగి సీజనులో అక్టోబరు, నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రతీ నెలా 2 లక్షల టన్నుల యూరియా అవసరమని మంత్రి పేర్కొన్నారు. వేసంగి సీజనులో ఎరువల సన్నద్ధతపై మంత్రి అధికారులతో సమీక్షించారు. రాష్ట్రానికి వరంగల్, మంచిర్యాల, గద్వాల, కరీంనగర్, పందిళ్లపల్లి, జడ్చర్ల, తిమ్మాపూర్ రైల్వే రేక్ పాయింట్లకు సీఐఎల్, ఐపీఎల్ గంగవరం, ఎన్ ఎఫ్ఎల్ వైజాగ్ , ఐఫ్కో, ఎస్ పీ ఐసీ కంపెనీల నుంచి యూరియాను సరఫరా చేస్తున్నామని మంత్రి చెప్పారు.


Tags:    

Similar News