తెలంగాణలో రాణిస్తున్న శివంగి, ఉమెన్ యాక్షన్, రెస్క్యూ టీంలు
తెలంగాణలో పోలీసు, సింగరేణి సంస్థల్లో మహిళలు శివంగి, ఉమెన్ యాక్షన్, రెస్క్యూ టీంలుగా ఏర్పడి విశిష్ఠ సేవలందిస్తున్నాయి.;
By : Shaik Saleem
Update: 2025-07-06 14:05 GMT
తాము సైతం అంటూ అత్యంత క్లిష్టతరమైన ఆపరేషన్లలో పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారు. మొన్న నిర్మల్ జిల్లాలో 20 మంది మహిళా కమాండోలతో శివంగి దళం పలు క్లిష్టతరమైన ఆపరేషన్లను విజయవంతం చేసి శెభాష్ అనిపించుకుంది.హైదరాబాద్ నగరంలోని 35 మంది మహిళా పోలీసులకు ఇజ్రాయెల్ ఆత్మరక్షణ యుద్ధ కళ అయిన క్రావ్ మాగాలో రెండు నెలలపాటు శిక్షణ ఇచ్చి వారిని స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్ (SWAT)గా రంగంలోకి దించారు. మరో వైపు సింగరేణి 136 సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా, రెస్క్యూ ఆపరేషన్లలో శిక్షణ పొందిన మొదటి మహిళా రెస్క్యూ టీంను ఏర్పాటు చేశారు.
స్విప్ట్ మహిళా యాక్షన్ టీం
హైదరాబాద్ నగరంలో తరచూ ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభల సమయంలో మహిళా నిరసనకారులను అదుపు చేసేందుకు 35 మంది మహిళా పోలీసులతో స్వాట్ పేరిట (Swift Women Action Team) ప్రత్యేక మహిళా యాక్షన్ టీంను నగర పోలీసు విభాగం ఏర్పాటు చేసింది. ఆర్మీలో ఆలివ్ గ్రీన్ దుస్తులు ధరించిన ఈ ప్రత్యేక మహిళా పోలీసు దళం మహిళా నిరసనకారులను అదుపు చేయడంలో వ్యూహాత్మకంగా పనిచేస్తోంది.నగరంలో అత్యవసర పరిస్థితుల్లో నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఈ స్వాట్ దళాన్ని రంగంలోకి దించుతున్నారు. ఈ మహిళా దళం నగరంలో వేగవంతమైన ప్రతిస్పందన విభాగంగా పనిచేస్తుందని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు.
ఇజ్రాయెల్ ఆత్మరక్షణ యుద్ధ కళలో శిక్షణ
మొదటిసారిగా, హైదరాబాద్ నగరంలోని 35 మంది మహిళా పోలీసులను ఎంపిక చేసి వారికి రెండు నెలల పాటు ఇజ్రాయెల్ ఆత్మరక్షణ యుద్ధ కళ(Israeli self-defence martial art) అయిన క్రావ్ మాగాలో (Krav Maga) శిక్షణ ఇచ్చారు. మహిళా పోలీసు అధికారులతో కూడిన ప్రత్యేక స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్ సేవలను తాజాగా ప్రారంభించారు. ఈ మహిళా బృందాన్ని శనివారం తెలంగాణ సచివాలయంలో అధికారికంగా మోహరించారు.
అత్యవసర పరిస్థితుల్లోనూ...
మహిళా పోలీసులకు క్రావ్ మాగా నిరాయుధ పోరాటంలో రెండు నెలల ఇంటెన్సివ్ శిక్షణ ఇచ్చామని ఓ పోలీసు అధికారి చెప్పారు. ఇజ్రాయెల్‌లో అభివృద్ధి చేసి అక్కడి రక్షణ దళాలు ఉపయోగించే ఈ వ్యవస్థను హైదరాబాద్ నగరంలో రంగంలో కొత్తగా ప్రవేశపెట్టారు. ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభల సమయంలో మహిళా నిరసనకారులను అదుపు చేయడం ఈ స్వాట్ బృందం బాధ్యత. హైదరాబాద్ నగరంలోని ప్రధాన కార్యక్రమాలు, పండుగలలో కూడా ఈ బృందం సేవలను వినియోగించుకుంటామని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. ఈ మహిళా స్వాట్ బృందం మహిళలకు సంబంధించిన సున్నితమైన కేసుల్లో నగర పోలీసులకు సహాయపడతాయి. అత్యవసర సమయాల్లో ఆయుధాలు లేకుండా, ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా నిర్వహించడానికి మహిళలకు ఆత్మరక్షణ పద్ధతుల్లో శిక్షణ ఇచ్చామని ఆనంద్ వివరించారు.
సింగరేణిలో మొదటి మహిళా రెస్క్యూ టీం
సింగరేణి 136 సంవత్సరాల చరిత్రలో తొలిసారిగా రెస్క్యూ ఆపరేషన్లలో శిక్షణ పొందిన మొదటి మహిళా రెస్క్యూ టీంను ఏర్పాటు చేశారు.హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సింగరేణి మహిళా రెస్క్యూ టీం సభ్యులకు అధికారులు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.ఈ మహిళా బృందం సింగరేణి గనుల్లో రెస్క్యూ ఆపరేషన్లలో నైపుణ్యాన్ని ప్రదర్శించనుంది. అత్యవసర పరిస్థితులు, సేవా కార్యకలాపాల సమయంలో మహిళా రెస్క్యూ బృందం తమ బలాన్ని ప్రదర్శించనుంది.ఈ మహిళా బృందం త్వరలో జాతీయ,అంతర్జాతీయ రెస్క్యూ పోటీల్లో పాల్గొననుంది.
జాతీయ రెస్క్యూ పోటీలకు మహిళా బృందం
సింగరేణిలో మొదటిసారిగా 13 మంది మహిళా అధికారులను మహిళా రెస్క్యూ బృందానికి ఎంపిక చేశామని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం చెప్పారు. వీరికి 14 రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని ఆయన తెలిపారు.శిక్షణ సమయంలో, మహిళా అధికారులు పురుష అధికారులతో సమానంగా తమ సామర్థ్యాలను ప్రదర్శించారని ఆయన పేర్కొన్నారు. రాబోయే రెస్క్యూ పోటీలకు కూడా మహిళా బృందానికి శిక్షణ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన వివరించారు.