గణపతి పూజతో సరస్వతీ పుష్కరాలు ఆరంభం

తెలంగాణలోని కాళేశ్వరం త్రివేణి సంగమంలో సరస్వతీ పుష్కరాలు గురువారం ప్రారంభం అయ్యాయి. శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్నానంతో పుష్కరాలు ప్రారంభం అయ్యాయి.;

Update: 2025-05-15 02:18 GMT
కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సరస్వతీ పుష్కరాలు ప్రారంభం

గలగల పారుతున్న సరస్వతీ నదీ...అతి పురాతన మైన కాళేశ్వరంలోని త్రివేణి సంగమం గురువారం సరస్వతీ పుష్కరాలతో భక్త జన సంద్రంగా మారింది. కాళేశ్వరం త్రివేణి సంగమంలో గణపతి పూజతో సరస్వతి పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. గురువారం తెల్లవారుజామున 5.44 గంటలకు శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి చేతుల మీదుగా పుష్కర స్నానంతో పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి శాసనసభ్యుల గండ్ర సత్యనారాయణ రావు, హై కోర్టు న్యాయమూర్తి సూరపల్లి నంద తదితరులు సరస్వతీ నదిలో పుష్కర స్నానం చేశారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు సరస్వతీ నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.




 సరస్వతి పుష్కర ఘాట్ కు సీఎం నేడు ప్రారంభం

జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా కాళేశ్వరంలో మే 15 వ తేదీన ప్రారంభం అయిన సరస్వతి పుష్కరాల సందర్బంగా త్రివేణి సంగమం వద్ద సరస్వతి ఘాట్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించనున్నారు. ఈ పుష్కర ఘాట్ ప్రారంభం అనంతరం కాళేశ్వర త్రివేణీ సంగమంలో ముఖ్యమంత్రి పుణ్యస్నానం ఆచరిస్తారు. ముఖ్యమంత్రి తోపాటు పలువురు మంత్రులు కూడా ఈ పుష్కరాల్లో పాల్గొంటారు.



 12 ఏళ్లకు ఓ సారి పుష్కరాలు

12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అరుదైన సరస్వతి మహా పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. గురువారం ఉదయం 5 .44 గంటలకు తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ సంకల్పంతో పాటు పుష్కర స్నానం ఆరంభమైంది. ప్రతీ రోజూ ఉదయం 8 .30 గంటలనుంచి 11 గంటల వరకు యాగాలు నిర్వహిస్తున్నారు. ప్రతీ రోజూ సరస్వతి ఘాట్ లో 6 .45 గంటల నుంచి 7 .35 గంటల వరకు సరస్వతి ఘాట్ లో ప్రత్యేక సరస్వతి నవరత్న మాలహారతి నిర్వహిస్తున్నారు. పుష్కర్ స్నానం ఆచరించేవారికి తాత్కాలిక టెంట్ సిటీని ఏర్పాటు చేశారు. వీటితో పాటు రోజూ రాత్రి కళా, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.



 

12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిధునరాశిలో ..
సరస్వతి నదిని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రవహించే అంతర్వాహిని" గా పరిగణిస్తారు. ఈ పుష్కరాన్ని బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. గురువు ఏడాదికి ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. ఒక రాశి నుంచి వెళ్లిన తర్వాత అదే రాశిలోకి అడుగు పెట్టడానికి 12 ఏళ్లు పడతాయి. ఏ రాశి లో సంచరిస్తాడో ఆ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సంవత్సరం మే 14 న రాత్రి 10.35 గం మిథునరాశిలోకి బృహస్పతి అడుగు పెట్టాడు.



 సరస్వతి నది అంతర్వాహినిగా..

2025 మే 14న రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కరకాలం ప్రారంభమవుతుందని పండితులు చెప్పారు. గురువారం సూర్యోదయం నుంచి పుష్కర పుణ్యస్నానాలు ఆచరిస్తున్నామని కాళేశ్వరం పుణ్యక్షేత్ర ఆలయ అర్చకులు వివరించారు. మే 15 నుంచి 26 వతేదీ వరకు పుష్కర కాలం ఉంటుందని ఆయన వివరించారు.

కాళేశ్వరం త్రివేణి సరస్వతి పుష్కరాలు : మంత్రి కొండా సురేఖ 
ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కాళేశ్వరం త్రివేణి సరస్వతి పుష్కరాలు ఈ నెల 15 నుంచి26 వరకు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం ఈ గొప్ప పుష్కర ఉత్సవాలను ఎంతో భక్తితో, వైభవంగా నిర్వహించబోతోందని ఆమె చెప్పారు. త్రివేణి సంగమానికి పవిత్ర స్నానాలు మరియు ఆధ్యాత్మిక పూజల కోసం వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం దేవాదాయ శాఖ అన్ని రకాల సౌకర్యాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిందని ఆమె వెల్లడించారు.

పుష్కరాలకు రూ.802.27 లక్షలు
సరస్వతీ పుష్కరాల ఏర్పాట్ల కోసం రూ.802.27 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 16 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పుష్కరాలు ఏర్పాట్లు చేశారు.


Tags:    

Similar News