‘తాను నడవలేక పోయినా సమాజానికి నడకనేర్పిన సాయిబాబా’

చేయని నేరానికి సాయిబాబాకు జీవిత ఖైదు విధిస్తూ గడ్చిరోలి బెంచ్ ఇచ్చిన తీర్పు న్యాయవ్యవస్థలోనే అత్యంత దారుణమైనది: ప్రొ. హరగోపాల్

Update: 2024-10-21 14:29 GMT

తాను నడవలేకపోయినా సమాజానికి సాయిబాబా నడక నే ర్పాడని, ఉద్యమాలకు కూడా నడక నే ర్పాడని ప్రొఫెసర్ జి. హరగోపాల్ అన్నారు. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం సాయిబాబా సంస్మరణ సభ పెద్ద ఎత్తున జరిగింది. ఈ సంస్మరణ సభకు అధ్యక్ష వర్గంగా పౌరహక్కుల సంఘం తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్, పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షులు రాఘవా చారి, పద్మ, రవీంద్రనాథ్ వ్యవహరించారు. సభలో సాయిబాబా భార్య వసంత కుమారి కూడా పాల్గొన్నారు.

"ఒక సారి  సాయిబాబా కేసుల డిఫెన్స్ కమిటీ  మహరాష్ట్రలో ఎన్. సీ.పీ నేత శరద్ పవార్ కలిసింది. ఆయన చొరవతీసుకుని  జైలులో ఉన్న సాయిబాబాను కలిసేందుకు హోంమంత్రిని జైలుకు పంపారు. జైలులో మీ సమస్యలేమిటో చెప్పమని హోం మంత్రి సాయిబాబాని అడిగితే, ఖైదీలందరి తరపున వారందరి సమస్యల గురించి సాయిబాబా మాట్లాడారే తప్ప తన ఒక్కడి సమస్యలు మాట్లాడలేదు," అని హరగోపాల్ తెలిపారు.

వలసపాలనలో ఉన్నప్పటికంటే ఇప్పటి జైళ్ళు చాలా అధ్వానంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. చేయని నేరానికి సాయిబాబాకు జీవిత ఖైదు విధించిన గడ్చిరోలి బెంచి ఇచ్చిన తీర్పు న్యాయవ్యవస్థలోనే అత్యంత దారుణమైన తీర్పని హరగోపాల్ ఆరోపించారు. మావోఇస్టుల పేరు చెప్పి ఆదివాసీలను అణచివేయడం ఏమి న్యాయమని ప్రశ్నించారు. ఆదివాసీ ఉద్యమాలను మీరు అణచివేయగలరా అని ఒక పోలీసు అధికారే ప్రశ్నించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

స్థూల జాతీయోత్పత్తి కోసం అడవిని కార్పొరేట్లకు అప్పగిస్తామంటున్నారు. అసలు అడవి ఎవరిది? అని ప్రశ్నించారు. ఛత్తీస్ ఘడ్ లో ఆదివాసీల సంక్షేమం కోసం పనిచేసిన కలెక్టర్ బిడి శర్మ రిటైరైన తరువాత అక్కడికెళితే ఆదివాసీలు ఆయనకు బ్రహ్మ రథం పట్టారని, అటవీ, పోలీస్, రెవెన్యూ అధికారులను అక్కడికి రానివ్వవద్దని వారాయనను కోరారని తెలిపారు. అంటే రాజ్యాన్ని తమ వద్దకు రానివ్వవద్దని ఆదివాసీలు కోరారు. రాజ్యం అలాంటి అధికారి గుడ్డలు చించి చెప్పుల దండవేయించిందని గుర్తుచేశారు. చట్టబద్ద పాలన అంటే మనమంతా అభివృద్ధి అనుకుంటాం. చట్టబద్దపాలన కావాలని మనం కోరితే మనల్ని అర్బన్ నక్సలైట్లు అని ముద్రవేస్తున్నారని తెలిపారు.

తనపై పెట్టిన తప్పుడు కేసులో తమ తరపున వాదించడానికి రాంజెఠ్మలానీని న్యాయవాదిగా నియమించమని డిఫెన్స్ కమిటీకి సాయిబాబానే సూచించారని, రాంజెఠ్మలానీకి డెమెన్షియా వచ్చి జ్ఞాపక శక్తి కోల్పోయారని, రాం జెఠ్మలానీ బతికి ఉంటే సాయిబాబా అప్పుడే కేసు నుంచి బైటపడేవారని హరగోపాల్ అన్నారు. న్యాయవ్యవహారాల్లో సాయిబాబాకు సరైన అంచనా ఉందన్నారు. జైలు నుంచి విడుదలైనాక ఢిల్లీ యూనివర్సిటీలో పాఠాలు చెప్పాలన్న సాయిబాబా కలనేరవేరకుండానే మనల్పి విడిచి వెళ్ళిపోయడని ఆవేదన వ్యక్తం చేశారు. సాయిబాబా పైన పెట్టింది తప్పుడు కేసని రుజువైనా, ఆయన కేసుకు డిఫెన్స్ కమిటీగా ఏర్పడ్డారని నలుగురిని జైలులో పెట్టారని, వారు ఇప్పటికీ విడుదల కాలేదని చెప్పారు.

 


సాయిబాబా మృతికి సంతాపం తెలుపుతూ విదేశీ రాయబా రు లు పంపిన సంతాప సందేశాలు సంస్మరణ సభలో చదివి వినిపిస్తున్న సాయిబాబా కుమార్తె మంజీరా


సాయిబాబాకు వివిధ దేశాల రాయబారుల సంతాపం


సాయిబాబా మృతికి అనేక దేశాల రాయబారుల నుంచి , హక్కుల సంఘాల నుంచి, కమ్యూనిస్టు పార్టీల నుంచి అసంతాప సందేశాలు వచ్చాయంటే దేశ విదేశాల్లో ఆయనకు ఎంత గుర్తింపు ఉందో స్పష్టమవుతుంది. ఆ సంతాప సందేశాలన్నిటినీ సాయిబాబా కుమార్తె మంజీర సభకు చదివి వినిపించారు.

ఫ్రాన్స్, జర్మనీ రాయబారుల తోపాటు ఆస్ట్రేలియా కమ్యూనిస్టు పార్టీ, ఇంటర్నేషనల్ లీగ్ ఆఫ్ పీపుల్స్ స్ట్రగుల్, రెవల్యూషనరీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్, బంగ్లదేశ్ రెవల్యూషనరీస్, కొలంబియా కమ్యూనిస్టు యూనియన్స్, గ్రీస్ కమ్యూనిస్టు పార్టీ, గ్రీస్ ఇంటర్నేషనల్ సాలిడారిటీ, బ్రెజిల్ కమ్యూనిస్టు పార్టీ, ఇంటర్నేషనల్ సాలిడారిటీ ఆఫ్ ఫ్రీడం తదితర సంస్థల నుంచి సాయిబాబా మృతికి సంతాప సందేశాలు వచ్చాయి.

చంపింది అనారోగ్యం కాదు రాజ్యం

సభ అధ్యక్ష్య వర్గంలో ఒకరైన తెలంగాణా పౌరహక్కుల సంఘం అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ, సాయిబాబాను చంపింది అనారోగ్యం కాదని, కేంద్రంలో ఉన్న అమిత్ షా వర్గమని ఆరోపించారు. సాయిబాబా ఏ నేరం చేయలేదని అత్యున్యత న్యాయస్థానం చెప్పిందని, గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఇచ్చిన తప్పుడు తీర్పును ఉన్నత న్యాయస్థానం తప్పు పట్టిందని, పోలీసులు అసలు విచారణ చేయలేదని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సాయిబాబా నిర్దోషి అని ఉన్నత న్యాయస్థానం నిర్ధారణ చేసిందని, సాయిబాబా జైలులో కోల్పోయిన పదిసంవత్సరాల జీవితాన్ని ఎవరు తిరిగి తెచ్చిస్తారని ప్రశ్నించారు. సాయిబాబా నిర్దోషి అయితే ఆయన పదేళ్ళ జీవితాన్ని హరించిన దోషి ఎవరని ప్రశ్నించారు. మనం రెండు కాళ్ళతో నడిస్తే, సాయిబాబా నాలుగు కాళ్ళతో నడిచాడని, ఆ దారిలో నడవడమే మనం ఆయనకు అర్పించే నివాళులని అన్నారు. 



వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ మాట్లాడుతూ, నడకరాని సాయిబాబా లక్షలాది మందిని పడిపించారని అన్నారు. సాయిబాబా పాల్గొన్నవి, నిర్వహించినవి 15 సంస్థల వరకు ఉన్నాయని, ఆయన జీవితం చాలా విస్తారమైనదని గుర్తు చేశారు. ఆయన కోల్పోయిన జీవితాన్నిఎవరు తిరిగి తెచ్చిస్తారని ప్రశ్నించారు. సాయిబాబా నిర్దోషి అయితే ఆయన పదేళ్ళ జీవితాన్ని హరించిన దోషి ఎవరని అన్నారు.

‘‘భారతీయ ఆంగ్ల రచనల్లో భారతీయత ఎలా ప్రతిబింబించిది’’ అన్న అంశంపై సాయిబాబా పరిశోధన చేశారని గుర్తు చేశారు. సాయిబాబా అస్తిత్వవాద పరిమితులను దాటి తెలంగాణా రాష్ట్రసాధన కోసం పనిచేశారన్నారు. ‘రాజ్య స్వభావం హింస’ అని మార్క్స్ అంటే, అదే విషయాన్ని తన జీవితం ద్వారా రుజువు చేశారని గుర్తు చేశారు. ప్రజలపై భారత ప్రభుత్వం యుద్ధం చేస్తోందని, దానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి సాయిబాబా అంతర్జాతీయంగా సంఘీభావాన్ని కూడగట్టాడన్నారు.

నక్సలైట్ల పేరుతో 180 మందిని చంపేశారని, చిత్రహింసలకు ‘ఉపా’ ఒక ఆయుధంగా మారిందని ప్రముఖ రచయిత్రి మీనా కందస్వామి మాట్లాడుతూ అన్నారు. ‘ఉపా’ నిరంకుశత్వం కు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. సనాతన ధర్మం అనాదిగా భారతీయ విశ్వవిద్యాలయాలలోనే తయారవుతోందని గుర్తు చేశారు. తన తండ్రిని రాజ్యం ఇబ్బంది పెడుతోందని కార్తీ చిదంబరం అనడాన్ని గుర్తు చేస్తూ, గ్రీన్ హంట్ తమ తండ్రి సృష్టే నని అన్నారు. సీపిఐ, సీపిఎం నాయకులు, పలు ప్రజాసంఘాల ప్రతినిధులు సాయిబాబాకు నివాళులర్పిస్తూ ప్రసంగించారు.

Tags:    

Similar News