తెలంగాణలో రెండున్నరేళ్లుగా ఆర్టీఐ కమిషన్ ఖాళీ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీఐ యాక్టు అమలును తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది.ఇప్పటి వరకు కమిషనర్ల పోస్టులను భర్తీ చేయలేదు.;
By : Shaik Saleem
Update: 2025-03-11 04:29 GMT
కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర నాయకురాలు సోనియాగాంధీ యూపీఏ ఛైర్‌పర్సన్ గా ఉన్నపుడు దేశంలో సమాచార హక్కు చట్టాన్ని(ఆర్టీఐ) తీసుకువచ్చింది.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీఐ యాక్టు అమలును తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం దాటినా, ఇప్పటి వరకు తెలంగాణ సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్, కమిషనర్ల పోస్టులను భర్తీ చేయలేదు.
ఆర్టీఐ యాక్ట్ ఏం చెబుతుందంటే...
రైట్ టు ఇన్‌ఫర్ మేషన్ యాక్ట్ సెక్షన్ 15 (1) ప్రకారం తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ ను రాష్ట్రప్రభుత్వం నియమించి పనిచేసేలా చూడాలి. ఈ చట్టం ప్రకారం సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్, కమిషనర్ల పోస్టుల్లో ప్రజా జీవితంలో పనిచేసిన,లా, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీస్, మేనేజ్ మెంట్, జర్నలిజం, మాస్ మీడియా, పరిపాలనా అనుభవమున్న వారిని నియమించాలి.
ఎవరు నియమిస్తారంటే...
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, మరో సీనియర్ మంత్రి, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ లతో కూడిన ఎంపిక కమిటీ ఆర్టీఐ కమిషనర్లను ఎంపిక చేయాలి. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇన్నాళ్లు అసెంబ్లీ సమావేశాలకు కూడా రాకుండా ఫాం హౌస్ కే పరిమితం అయ్యారు.మరో వైపు సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై తీవ్ర జాప్యం చేస్తోంది.
సమాచారం అడిగినా ఇవ్వడం లేదు...
తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎ శాంతికుమారి మరో నెలరోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీఐ చీఫ్ కమిషనర్ పోస్టును శాంతికుమారికి అప్పగించేందుకు కాంగ్రెస్ సర్కారు కమిషన్ నియామకంలో జాప్యం చేస్తుందని వార్తలు వెలువడ్డాయి.ఆర్టీఐ కమిషన్ ఖాళీగా ఉండటం వల్ల సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వ అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదని సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ లుబ్నా సార్వత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తాను కూడా ఆర్టీఐలో అప్పీలు చేసినా అవి షరిష్కారానికి నోచుకోలేదని ఆమె తెలిపారు. కమిషన్ ను భర్తీ చేసి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని లుబ్నా సార్వత్ డిమాండ్ చేశారు.
ఆర్టీఐ కమిషన్ ఖాళీ
తెలంగాణ ఆర్టీఐ కమిషన్ రెండున్నరేళ్లుగా ఖాళీగానే ఉంది. చీఫ్ కమిషనర్ పోస్టు 2020 ఆగస్టు 24 వతేదీ నుంచి ఖాళీగా ఉంది. కమిషన్ లో ఉన్న అయిదుగురు కమిషనర్లు కూడా 2023 ఫిబ్రవరి 24వతేదీన పదవీ విరమణ చేశారు. 2023 ఫిబ్రవరి 24వతేదీ నుంచి తెలంగాణ ఆర్టీఐ కమిషన్ పనిచేయడం లేదు.
రెండున్నరేళ్లుగా నిరీక్షణ
తెలంగాణలో సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్, కమిషనర్ల నియామకంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గత రెండున్నరేళ్లుగా కమిషన్ ఖాళీగా ఉండటంతో ప్రజలకు సమాచారం ఇచ్చే వారే కరవయ్యారు. ఆర్టీఐ యాక్ట్ ను నిర్వీర్యం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్లను నియమించకుండా తాత్సారం చేస్తుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అదిగో కమిషనర్లను నియమిస్తున్నామని చెబుతున్నా, పార్లమెంట్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం జరుగుతుందని చెబుతున్నట్లు ఆయన తెలిపారు. ఆర్టీఐ యాక్ట్ తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే కమిషన్ ను నియమించడంలో జాప్యం చేస్తుందని ఆయన ఆరోపించారు.
పోస్టుల కోసం దరఖాస్తులు
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీఐలో కమిషనర్ల పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానించినా భర్తీ చేయలేదు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా వారు కూడా నియమించలేదు. బీఆర్ఎస్ హయాంలో వచ్చిన దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. మరో సారి కాంగ్రెస్ సర్కారు దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తంమీద ఆర్టీఐ కమిషనర్ల పోస్టుల కోసం 600 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను పరిశీలించిన సెర్చ్ కమిటీ ఒక్కో పోస్టుకు ముగ్గురు పేర్ల చొప్పున 21 మందితో షార్ట్ లిస్టును తయారు చేసింది. అయినా ఆర్టీఐ కమిషనర్ల పోస్టులను భర్తీ చేయలేదు.
సీఎంకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
తెలంగాణ ఆర్టీఐ కమిషన్ లో కమిషనర్ల పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గత ఏడాది సెప్టెంబరు 28వతేదీన సీఎం ఎ రేవంత్ రెడ్డికి లేఖ రాసినా స్పందించలేదు. గతంలో ఆర్టీఐలో కమిషనర్ల పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ తాము హైకోర్టులో పిల్ దాఖలు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ సోమ శ్రీనివాసరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ పిటిషన్ పై తాము ఆర్టీఐ కమిషన్ నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశామని త్వరలో నియమిస్తామని 2023 ఫిబ్రవరి 24వతేదీన అప్పటి బీఆర్ఎస్ సర్కారు హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ ద్వారా సమాధానం ఇచ్చింది. అయినా బీఆర్ఎస్ సర్కారు కమిషన్ లో ఖాళీలను భర్తీ చేయలేదు.
పెండింగులోనే దరఖాస్తులు
ఆర్టీఐ కమిషన్ ఖాళీగా ఉండటంతో కమిషన్ లో సమాచారం కోరుతూ దాఖలైన దరఖాస్తుల సంఖ్య 17వేలకు దాటింది. ఆర్టీఐ కమిషన్ ఖాళీగా ఉండటంతో 2017 నుంచి వచ్చిన దరఖాస్తులు పెండింగులోనే ఉన్నాయి. తెలంగాణలో పలు ప్రభుత్వ విభాగాలు సమాచార హక్కు చట్టం కింద తమకు సమాచారం ఇవ్వడం లేదని చెబుతూ ఆర్టీఐకు అప్పీలు చేసినా వాటిపై చర్యలు తీసుకోవాల్సిన కమిషన్ ఖాళీగా ఉండటంతో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేవారు కరవయ్యారు.ఆర్టీఐలో అప్పీళ్లు, ఫిర్యాదులు పేరుకుపోయాయి. 2017వ సంవత్సరంలో 55 అప్పీళ్లు, 2018లో 70, 2019వ సంవత్సరంలో 156, 2020లో 129, 2021లో 1780 ,2022లో 4,821, 2023లో 5,117 అప్పీళ్లు, దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోలేదని ఆర్టీఐ అధికారులు అందించిన సమాచారంతో తేటతెల్లమైంది. కమిషన్ ఖాళీగా ఉండటంతో ఆర్టీఐ అధికారులకు కూడా పని లేకుండా పోయింది.