‘విలువలతో కూడిన విమర్శలు ఆయన స్టైల్’.. రోశయ్య వర్ధంతిలో కోమటిరెడ్డి
భారతదేశ రాజకీయాలకు రోశయ్య చేసిన సేవ అమోఘమైనదని మంత్రి కోమటిరెడ్డి వెంకటడ్డి కొనియాడారు.
భారతదేశ రాజకీయాలకు రోశయ్య చేసిన సేవ అమోఘమైనదని మంత్రి కోమటిరెడ్డి వెంకటడ్డి కొనియాడారు. ఎటువంటి రాజకీయ బ్యాగ్రౌండ్ లేకపోయినా.. రాజకీయాల్లో తన మార్క్ చూపించుకున్నారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఏనాడు కూడా పదవుల కోసం తాపత్రయపడని ఏకైక నాయకుడు రోశయ్య అని చెప్పారు. ఆయన 1968లో ఎమ్మెల్సీగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి.. 2016లో గవర్నర్‌గా తన ప్రస్థానం ముగించారని, మొత్తం 48 ఏళ్లు ఆయన రాజకీయాల్లో ఉన్న ఆయనతో తనకు 30ఏళ్ల అనుబంధం ఉందని కోమటిరెడ్డి గుర్తు చేసుకున్నారు. ఏపీలో కానీ, తెలంగాణలో కానీ రాజకీయ నాయకుల భాష దిగజారుతోందని సీనియర్ నేతలు మదరపడుతున్న ఈ సమయంలో రోశయ్యను గుర్తు చేసుకునే సందర్భం రావడం చాలా అరుదైన విషయమని పేర్కొన్నారాయన.
ఆయనవి విమర్శలు చాలా ప్రత్యేకం..
‘‘ఆయనకు కోపం వచ్చేది.. కానీ పగ ఉండేది కాదు. విలువలతో కూడిన విమర్శలు చేయడం ఒక్క రోశయ్యకే చెల్లిందనడం అతిశయోక్తి కాదు. రోశయ్య ఎప్పుడు కలిసిన ఒక మాట చెప్తుండేవారు.. రాజకీయాలు వ్యక్తిగతం కావు.. ప్రజలు ఇచ్చిన నమ్మకాల్ని నిలబెట్టే బాధ్యత.. ఇందులో వ్యక్తిగత రాగద్వేషాలకు తావులేదు అని. ప్రజలకు మంచి చేస్తే ఎవ్వరినైన అభినందించు.. ప్రజలకు చెడు చేస్తే ఎవ్వరినైనా వ్యతిరేకించు. అంతేకానీ పగ పెంచుకోకు అనేవారు. అప్పుడే ప్రజలు నిన్ను గౌరవిస్తారని చెప్పేవారు. బహుశా.. సమకాలిన రాజకీయాల్లో రోశయ్య నిర్వహించినన్ని పదవులు, బాధ్యతలు ఏ రాజకీయ నాయకుడు నిర్వహించి ఉండకపోవచ్చు. ఆయన్న అసెంబ్లీకి వెళ్లారు. శాసన మండలికి వెళ్లారు. పార్లమెంట్‌కు వెళ్లారు. ముఖ్యమంత్రి అయ్యారు. గవర్నర్ అయ్యారు. దాదాపు నాకు తెలిసి పదికి పైనే మంత్రిత్వ శాఖలు నిర్వహించి ఉంటారు’’ అని తెలిపారు.
16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు..
‘‘రోశయ్య ఉమ్మడి అసెంబ్లీలో ఆర్ధిక మంత్రిగా 15 సార్లు, ముఖ్యమంత్రిగా ఒకసారి మొత్తం 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నాయకుల్లో రోశయ్య అగ్రగణ్యుడు. ఇవ్వాళ కొందరు నాయకులు అప్పులు చేయడానికి పోటీ పడేస్థాయికి రాజకీయాల్ని దిగజార్చారు. ఇన్ని సంవత్సరాలు ఆర్ధిక మంత్రిగా చేసినా.. ఏ రోజు ఓవర్ డ్రాఫ్ట్‌కు పోలేదని ఆయన గొప్పగా చెప్తుండేవారు. ఆర్ధిక శాఖపట్ల, రాష్ట్ర ఆర్ధికరంగాన్ని పరిపుష్టం చేయడం పట్ల వారికున్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఆ రోజుల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా వార్తలు రాసే పత్రికలే గానీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికలే గానీ.. రోశయ్య గారి గురించి ఏదైన పత్యేకంగా రాయల్సి వస్తే.. అజాత శత్రువు, రాజకీయ భీష్ముడు అంటూ గొప్పగా రాసేవి. విలువలతో కూడిన రాజకీయాలు చేసిన నిఖార్సయిన, నిక్కచ్చి నాయకుడు కొణిజేటీ రోశయ్య’’ అని వ్యాఖ్యానించారు.
ఆయన చాణక్యం అమోఘం
‘‘రోశయ్య శాంత స్వభావులు.. అయితే ప్రభుత్వాన్ని అకారణంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తే మాత్రం తనదైన చాణక్యంతో ప్రతిపక్షాలను కంట్రోల్లో పెట్టేవారు. ఒకసారి ఒక టీడీపీ ఎమ్మెల్యే.. సభను అదేపనిగా డిస్టర్బ్ చేస్తూ... అధ్యక్ష సభ ఆర్డర్‌లో లేదు.. దయచేసి ఆర్డర్‌లో పెట్టండని పదే పదే స్పీకర్‌ను విజ్ఞప్తి చేస్తున్నాడు. అందరికి ఆశ్చర్యం.. అరే ఆయనే సభను నడవనివ్వకుండా అడ్డుకుంటున్నాడు.. ఆయనే సభ ఆర్డర్‌లో లేదు అంటున్నాడని. అప్పుడు రోశయ్య వెంటనే లేచి ఒక చిన్న కథ చెప్పడం ప్రారంభించారు.. అధ్యక్ష తండ్రిని చంపిన కేసులో ముద్దాయిగా ఉన్న యువకున్ని జడ్జి శిక్షించి చివరగా ఏదైనా కోరిక ఉంటే కోరుకో అన్నడటా.. అందుకు ఆ యువకుడు అయ్యా.. నేను తండ్రి లేని పిల్లవాన్ని దయచేసి నన్ను కనికరించి శిక్ష నుంచి విముక్తున్ని చెయ్యండన్నాడట.. సదరు సభ్యుని వాలకం కూడా అచ్చం అలాగే ఉంది అంటూ సదరు టీడీపీ సభ్యునికి జ్ఞానోదయం కలిగించారు రోశయ్య’’ అని ఆనాటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
‘‘ఒకసారి నేను రోశయ్య గారిని అసెంబ్లీ లాబీల్లో కలిసి పిటీషన్లు ఇస్తుంటే.. మీరు ఇప్పుడు సీఎంను కలిశాక దయచేసి ఈ వినతిపత్రాలన్నీ ఇవ్వకండి.. చూస్తే ఖజనా నిండుకున్నది... నా మాట విని ఒకటి రెండు మాత్రమే అడగండి.. అవి నేను చేసి పెడతా అన్నారు.. ఆ నిబద్ధత చూసి నాకే ఆశ్చర్యం వేసింది. వాస్తవానికి ఏ ఆర్ధిక మంత్రి అంత జాగ్రత్తగా, అంత నిజాయితీగా ఆ శాఖను నడిపిన వ్యక్తి లేడంటే అతిశయోక్తి కాదు. రోశయ్య గురించి చెప్పాలంటే ఒకరోజు సరిపోదు. ఆయన ఒక రాజకీయ పాఠం కాదు.. గ్రంధం. ఆయన ప్రతీ నిర్ణయంలో ప్రజాసంక్షేమం, ప్రజల ఆకాంక్షలు కనిపించేవి. పౌరుషానికి ప్రతీకైన పల్నాటి నుంచి శత్రువులే లేని అజాతశత్రువు రోశయ్య. రోశయ్యలాంటి మంచి నాయకుడు మన నుంచి దూరం కావడం కలిచివేసేది. రోశయ్య ఆశయాల్ని, విలువల్ని పాటించడమే వారికి మనమిచ్చే నివాళి’’ అని తన ప్రసంగాన్ని ముగించారు కోమటిరెడ్డి.