సీఎంని కలిసిన రోహిత్ వేముల తల్లి..

ఎనిమిదేళ్ల తర్వాత రోహిత్ వేముల కేసు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. రోహిత్ ఆత్మహత్యకి ఎవరూ కారణం కాదని పోలీసులు హైకోర్టుకి తుది నివేదిక ఇచ్చారు.

By :  Vanaja
Update: 2024-05-04 08:27 GMT

ఎనిమిదేళ్ల తర్వాత రోహిత్ వేముల కేసు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. రోహిత్ ఆత్మహత్యకి ఎవరూ కారణం కాదని పోలీసులు హైకోర్టుకి తుది నివేదిక ఇచ్చారు. అతను దళితుడు కాదని, ఫేక్ సర్టిఫికెట్ వ్యవహారం బయటపడుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పేర్కొన్నారు. సాక్ష్యాధారాలు లభించకపోవడంతో కేసు క్లోజ్ చేస్తున్నామని న్యాయస్థానానికి తెలిపారు. అయితే పోలీసుల విచారణపై వేముల రోహిత్ తల్లి, విద్యార్థుల నుండి నిరసన వ్యక్తం అవడంతో కేసు రీఓపెన్ చేయాలనీ డీజీపీ నిర్ణయం తీసుకున్నారు.

తన కొడుకు ఆత్మహత్యకి పాల్పడినవారిపై శిక్ష పడేలా చూడాలని రోహిత్ తల్లి రాధిక వేముల డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శనివారం ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తనకి న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. రోహిత్ వేముల కులం పై పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ ని సమీక్షించాలని, కేసుని పారదర్శకంగా విచారించి, తన కొడుకు చావుకి కారణమైన వారికి శిక్ష పడేలా చేయాలని సీఎం రేవంత్ కి వినతి పత్రం ఇచ్చారు.

రాధిక వేముల విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే కేసు రీఓపెన్ చేయించామని చెప్పారు. తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కేసుపై తమకి క్లారిటీ ఉందని, నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని రాధిక కి సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు.

రోహిత్ కేసు క్లోజ్ చేయడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అతను దళితుడు కాదని, తన చావుకి ఎవరూ బాధ్యులు కాదని నివేదిక ఇవ్వడంపై మండిపడుతున్నాయి. రోహిత్ కేసుపై మళ్ళీ విచారణ జరపాలని, నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.

కాగా 2016, జనవరిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడు. వర్సిటీలో ఉన్న కుల వివక్ష కారణంగానే అతను బలవన్మరణానికి పాల్పడ్డాడని పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుని, యూనివర్సిటీలో జరుగుతున్న నిరసనల్లో పాల్గొన్నారు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం అయింది. 

Tags:    

Similar News