జీవన్ కు ఊహించని షాక్

బీఆర్ఎస్ ఎంఎల్ఏలను కాంగ్రెస్ లో కేర్చుకోవటాన్ని వ్యతిరేకించి 24 గంటలు కాకముందే సీనియర్ నేత, ఎంఎల్సీ జీవన్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు.

Update: 2024-06-24 08:42 GMT

బీఆర్ఎస్ ఎంఎల్ఏలను కాంగ్రెస్ లో కేర్చుకోవటాన్ని వ్యతిరేకించి 24 గంటలు కాకముందే సీనియర్ నేత, ఎంఎల్సీ జీవన్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎంఎల్ఏ సంజయ్ కుమార్ ను రేవంత్ కాంగ్రెస్ లోకి చేర్చుకుంటారని జీవన్ ఏమాత్రం ఊహించలేదు. పోయిన ఎన్నికల్లో సంజయ్ గెలిచింది జీవన్ పైనే. చాలాకాలంగా జీవన్-సంజయ్ మధ్య సంబంధాలు ఉప్పు నిప్పుగా ఉన్నాయని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

సంజయ్ అంటే ఏమాత్రం పడని జీవన్ పిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీఆర్ఎస్ బాన్సువాడ ఎంఎల్ఏ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరటాన్ని జీవన్ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం అందరికీ తెలిసిందే. పోచారం చేరికను జీవన్ వ్యతిరేకించారంటే రేవంత్ రెడ్డిని వ్యతిరేకించినట్లే అనుకోవాలి. అలాంటిది 24 గంటలు తిరగకముందే తన నియోజకవర్గం బీఆర్ఎస్ ఎంఎల్ఏ సంజయ్ ను కాంగ్రెస్ లో చేర్చుకోవటాన్ని జీవన్ తట్టుకోలేకపోతున్నారు. అందుకనే రేవంత్ వైఖరిపై మండిపోతున్నారట. సోమవారం ఉదయం నుండి నియోజకవర్గంలోని మద్దతుదారులంతా జీవన్ ఇంటికి వస్తున్నారు. ఎంఎల్సీ పదవికి జీవన్ రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా పార్టీలో జరుగుతోంది. అయితే రాజీనామా అస్త్రం ఉత్త బెదిరింపు మాత్రమే అని కూడా కొందరు అంటున్నారు.

రేవంత్ పై జీవన్ అధిష్టానం దగ్గర ఫిర్యాదు చేసినట్లుగా పార్టీలో సీనియర్లు చెప్పుకుంటున్నారు. అయితే రేవంత్ కు వ్యతిరేకంగా జీవన్ ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోరన్నది వాస్తవం. ఎందుకంటే బీఆర్ఎస్ ఎంఎల్ఏలను కాంగ్రెస్ లో చేర్చుకోవటంపై అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ రాకుండా రేవంత్ ముందుకెళ్ళరన్న విషయాన్ని జీవన్ ఆలోచించకపోవటమే విచిత్రంగా ఉంది. మద్దతుదారులతో ఎన్ని మీటింగులు పెట్టుకున్నా, అధిష్టానంతో ఏమి ఫిర్యాదుచేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. అధికారంలో ఉన్న పదేళ్ళు కేసీయార్ టీడీపీని భూస్ధాపితం చేసేయటం, కాంగ్రెస్ ఎంఎల్ఏలను లాగేసుకున్న విషయాన్ని జీవన్ మరచిపోయినట్లున్నారు.

ఇపుడు జరుగుతున్నదంతా సంప్రదాయ రాజకీయాలు కావు. దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా నడుస్తున్నది పవర్ పాలిటిక్స్ మాత్రమే. పవర్ పాలిటిక్స్ అంటేనే ప్రత్యర్ధిపార్టీలను గుక్కతిప్పుకోనీయకుండా చేయటమే. పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ నేతల విషయంలో కేసీయార్ ఇలాగే చుక్కలుచూపించారు. పైగా రేవంత్-కేసీయార్ బద్ధవిరోరధులు. ఈ విషయాలన్నీ తెలిసికూడా జీవన్ బీఆర్ఎస్ ఎంఎల్ఏల చేరికలను తీవ్రంగా వ్యతిరేకించటమే విచిత్రంగా ఉంది. బీఆర్ఎస్ ఎంఎల్ఏలను లాక్కుని కారుపార్టీని వీక్ చేసి కేసీయార్ ను రేవంత్ దెబ్బకొట్టకపోతే ఇదే పనిని అవకాశం దొరికినపుడు కేసీయార్ చేస్తారు. ఆ విషయం కూడా జీవన్ మరచిపోయి రేవంత్ ను బహిరంగంగా వ్యతిరేకించటమే తాజా రాజకీయంలో ట్విస్టు.

Tags:    

Similar News