50 రోజులు దాటినా ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లో మృతదేహాల జాడ ఏది?

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లోపల 50 మీటర్ల మేర సహాయ పనులను మరో అయిదు రోజుల్లో పూర్తి చేస్తామని సీనియర్ ఐఎఎస్ అధికారి శివశంకర్ లోతేటి వెల్లడించారు.;

Update: 2025-04-14 09:33 GMT
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లోపలకు లోకోలో వెళుతున్న సహాయసిబ్బంది

శ్రీశైలం ఎడమ గట్టు కెనాల్ టన్నెల్ (ఎస్ఎల్‌బీసీ) టన్నెల్ లోపల సహాయ పనులను మరో అయిదు రోజుల్లో పూర్తి చేస్తామని సహాయ పనులను పర్యవేక్షిస్తున్న సీనియర్ ఐఎఎస్ అధికారి శివశంకర్ లోతేటి సోమవారం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. సొరంగం లోపల 50 మీటర్ల మేర మట్టి, బురద, టన్నెల్ బోరింగ్ మిషన్ యంత్రాల ముక్కలు పడి ఉన్నాయని వాటిని మరో అయిదు రోజుల్లో తరలించి, లోపల చిక్కుకున్న ఆరుగురి మృతదేహాలను వెలికితీస్తామని శివశంకర్ పేర్కొన్నారు. ఒక వేళ మృతదేహాలు దొరకకుంటే సహాయ పనుల తీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ఆయన చెప్పారు.




ఆరు మృతదేహాల కోసం కొనసాగుతున్న సహాయ పనులు

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లోపల పైకప్పు కూలిన ప్రాంతంలో 45 మీటర్ల మేర ‘నో గో జోన్’గా ప్రకటించి, ఎవరూ అందులోకి వెళ్లకుండా ఫెన్సింగ్ వేశారని ఐఎఎస్ అధికారి శివశంకర్ లోతేటి చెప్పారు. టన్నెల్ పై భాగం కూలినపుడు టన్నెల్ బోరింగ్ మిషన్ ధ్వంసమైందని, అందులో 8 మంది చిక్కుకు పోయారని ఆయన పేర్కొన్నారు. లోపల చిక్కుకున్న వారిలో ఇద్దరి మృతదేహాలను వెలికితీసి వాటిని మృతుల బంధువులకు అప్పగించామని చెప్పారు. టన్నెల్ లోపల మట్టి, ఇసుకతో కూడి నీరు ఉబికి వస్తుండటంతో లోపల చిక్కుకున్న మృతదేహాలు చెడిపోవని చెప్పారు. ప్రతీరోజూ సహాయ పనులను ముమ్మరం చేసి, ఆరుగురి మృతదేహాలను వెలికి తీసేందుకు చర్యలు తీసుకున్నామని శివశంకర్ వివరించారు.



 మృతదేహాలు కుళ్లిపోయే అవకాశం

టన్నెల్ లోపల చిక్కుకున్న కార్మికులు మరణించి 50 రోజులు దాటిన నేపథ్యంలో మృతదేహాలు కుళ్లిపోయి, అవి లభించే అవకాశాలు తక్కువ అని హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మట్టిలో మృతదేహాలు కూరుకుపోతే చర్మం, మజిల్స్ ఉండవని, కేవలం ఎముకలు, వెంట్రుకల సాయంతో డీఎన్ఏ పరీక్షలు చేయించి మృతదేహాలను గుర్తించవచ్చని డాక్టర్ చెప్పారు.



 సొరంగం లో వెంటిలేషన్ వ్యవస్థ పునరుద్ధరణ

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం లో ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యలు చేపడుతున్న సహాయక సిబ్బందికి అవసరమైన ఆక్సిజన్ ను అందించేందుకు వెంటిలేషన్ వ్యవస్థ మరమ్మతులు కొనసాగిస్తున్నామని శివశంకర్ చెప్పారు. 5 ఎస్కవేటర్ల ద్వారా మట్టి తవ్వకాలు నిరంతరం చేపడుతూ కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు.సోమవారం ఎస్ ఎల్ బి సి టన్నెల్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు అందజేసినట్లు శివశంకర్ వివరించారు.ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లోపల 500 మంది సహాయక బృందాలు నిర్విరామంగా సేవలందిస్తున్నాయని శివశంకర్ చెప్పారు. సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నట్లు వివరించారు. టన్నెల్లోపల అత్యధికంగా ఉన్న మట్టిని ఎస్కవేటర్ల సహాయంతో కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు.



నిర్విరామంగా కొనసాగుతున్న సహాయక చర్యలు

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామంలో గల ఎస్ ఎల్ బి సి సొరంగం లోపల జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు జరుగుతున్న సహాయక చర్యలు నిర్విరామంగా కొనసాగుతున్నట్లు శివశంకర్ చెప్పారు.ఫిబ్రవరి 22వ తేదీ నుంచి టన్నెల్ లోపల సహాయ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.ఎస్ ఎల్ బి సి సొరంగంలో సహాయక బృందాలు తమ సహాయక చర్యల ద్వారా మట్టి తవ్వకాలకు ఏర్పడే ఆటంకాలను నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని శివశంకర్ చెప్పారు.టన్నెల్ లోపల సహాయక చర్యలు అత్యంత సమగ్రంగా, ప్రణాళికాబద్ధంగా సాగుతున్నట్లు తెలిపారు. జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా కు చెందిన శాస్త్రవేత్తలు, నీటిపారుదల శాఖ నిపుణులు, టన్నెల్ నిర్మాణాల్లో అనుభవం కలిగిన ఇంజినీర్లు, మరియు ఇతర సంబంధిత శాఖల నిపుణుల సూచనలు, సలహాలను అనుసరిస్తున్నామన్నారు.



 మూడు షిఫ్టుల్లో సహాయ పనులు

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లోపల 51రోజులుగా మూడు షిఫ్టుల్లో ఉదయం 7.00, మధ్యాహ్న 3.00, రాత్రి 6.00 గంటలకు లోకోలో వెళ్లి సహాయ పనులు చేస్తున్నారని నాగర్ కర్నూలు డీపీఆర్వో కిరణ్, సహాయ పీఆర్వో యాదగిరి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, దక్షిణ మధ్య రైల్వే,సింగరేణి, హైడ్రా , ఆర్మీ విభాగాలకు చెందిన 500 మందికి పైగా ఉద్యోగులు నిత్యం సహాయ పనులు చేపడుతున్నారని వారు వివరించారు.

మృతుల కుటుంబసభ్యుల ఆవేదన
టన్నెల్ ప్రమాదంలో లోపల చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన తమ వారి మృతదేహాల కోసం వారి కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. టన్నెల్ వద్ద ఉండి తమ వారి కోసం రోదిస్తున్న కుటుంబ సభ్యుల ఆవేదన అరణ్య వేదన అవుతుంది.ఈ టన్నెల్ ప్రమాదంలో 8 మంది మరణించగా, ఇంకా మరో ఆరు మృతదేహాలను వెలికితీయాల్సి ఉంది.

రేవంత్ సర్కారు విఫలం : మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు

రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనకు 51 రోజులు పూర్తి అయినా ప్రభుత్వ సహాయక చర్యల్లో పురోగతి లేదని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు.టన్నెల్ లో చిక్కుకున్న వారిని కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇద్దరి మృతదేహాలను వెలికి తీసి చేతులు దులుపుకుందని, మరో ఆరుగురి జాడ లేదని ఆయన చెప్పారు. పబ్లిసిటీ కోసం టన్నెల్ లోపలకు వెళ్లి రావడం తప్ప ఇప్పటి వరకు చేసిందేం లేదని హరీష్ రావు ఆరోపించారు.సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పి ఇంకెన్ని రోజులు కాలయాపన చేస్తారని, లోపల చిక్కుకున్న ఆరుగురి పరిస్థితి ఏమిటని హరీష్ రావు ప్రశ్నించారు. ఎస్ ఎల్ బి సి ప్రమాద ఘటన పట్ల పూర్తి స్థాయి విచారణ జరిపి, వాస్తవాలను బయటపెట్టాలని హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.




Tags:    

Similar News