జానీ మాస్టర్‌పై రేప్ కేసు: జనసేననుంచి సస్పెండ్ చేస్తారా?

జానీ మాస్టర్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. దక్షిణాదిలోనే నెంబర్ 1 కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతున్నాడు. బడాబడా స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేసే ఈయనపై తాజాగా ఓ మహిళ రాయదుర్గంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Update: 2024-09-16 07:24 GMT

దక్షిణాదివ్యాప్తంగా అగ్రస్థాయిలో కొరియోగ్రాఫర్‌గా కొనసాగుతూ, బడాబడా స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేసే జానీ మాస్టర్‌పై ఓ మహిళ రాయదుర్గంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ తనపై పలు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, ఔట్ డోర్ షూటింగ్ సమయాల్లో కూడా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఈ కేసు నార్సింగీ పోలీస్ స్టేషన్‌‌కు బదిలీ చేశారు. ఫిర్యాదు దారు నార్సింగి వాసి కావడంతోనే తాము ఈ కేసును బదిలీ చేశామని రాయదుర్గం పోలీసులు వివరించారు. బాధిత యువతిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కాగా జానీ మాస్టర్‌పై అత్యాచార కేసు నమోదు కావడం సినీ సర్కిల్స్‌లో సంచలనంగా మారింది. కొందరు ఇదంతా తప్పుడు ప్రచారమని, జానీ మాస్టర్‌ను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో గిట్టని వారే ఇలా చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరికొందరు మాత్రం సౌత్ ఇండియా నెంబర్ 1 కొరియోగ్రాఫర్ అనిపించుకోవడంతో కళ్లు నెత్తికి ఎక్కే జానీ మాస్టర్ ఇలా చేసుంటాడంటూ మండిపడుతున్నారు.

అసలు ఫిర్యాదులో ఏముంది..

అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న మహిళ జానీ మాస్టర్‌పై ఫిర్యాదు చేశారు. చెన్నై, ముంబై, హైదరాబాద్ సహా పలు ఇతర ప్రాంతాల్లో ఔట్ డోర్ షూటింగ్ వేళల్లో, నార్సింగిలోని నివాసంలో కూడా పలు సార్లు తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని, ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా నో అంటే టాలీవుడ్ డ్యాన్సర్ యూనియన్‌కు అధ్యక్షుడిగా ఉన్న అధికారంతో అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

మొదటి నుంచి వివాదాలే

తాను జానీ మాస్టర్ దగ్గర కోరియోగ్రాఫర్‌గా 2019 నుంచి పనిచేస్తున్నానని, అప్పటి నుంచే తనను తిట్టడం, వేధించడం, గాయపరచడం వంటివి చేసేవాడని ఆమె ఆరోపించింది. తనతో పాటు మరికొందరిని కూడా ఆయన అలానే వేధించేవాడని, తనపై వేధింపులు అధికమై.. అత్యాచారం వరకు వెళ్లాయని ఫిర్యాదులో వివరించింది సదరు మహిళ. ఇక తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించినట్లు చెప్తోంది. పలు సార్లు తీవ్ర బెదిరింపులకు పాల్పడిని అత్యాచారం చేశాడని పురుద్ఘాటించారామే.

జానీ మాస్టర్‌పై కేసు నమోదు

సదరు మహిళ ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనపై లైంగిక దాడి నార్సింగిలో జరిగిందని సదరు మహిళ ఆరోపించడంతో ఈ కేసును నార్సింగికి బదిలీ చేశారు. కాగా జానీ మాస్టర్‌పై ఐపీసీ సెక్షన్స్ 376, 506, 232(2) కింద కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్‌కు గతంలో కూడా నేర చరిత్ర ఉండటం ఈ మహిళ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. 2015లో ఓ కాలేజీ మహిళపై దాడికి పాల్పడ్డారన్న అభియోగాలను ఎదర్కొన్న జానీ మాస్టర్‌కు కోర్టు 2019లో ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించింది. అయితే ఈ ఏడాది జరిగిన ఎన్నికలతో జానీ మాస్టర్.. రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారాల్లో కూడా జోరుగా పాల్గొన్నారు.

భార్య అయేషాకు వంగి నమస్కరించిన జానీ మాస్టర్

జానీ మాస్టర్‌ ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ, తాను ఈ స్థితిలో ఉండటానికి కారణం తన భార్య అయేషా అని చెప్పారు. అంతేకాదు, మోకాళ్ళపై వంగి అయేషాకు నమస్కారం చేశారు. మరోవైపు రాజకీయాలలో ప్రవేశించిన తర్వాత, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఎప్పటికైనా ఏపీకి ముఖ్యమంత్రి అవుతానని, అదే తన జీవిత లక్ష్యం అని చెప్పారు.

జనసేననుంచి సస్పెండ్ చేస్తారా?

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై ఇటీవల లైంగిక ఆరోపణలు రావటంతో ఆయనను పార్టీనుంచి సస్పెండ్ చేశారు. మరి అదే రకమైన ఆరోపణలు వచ్చిన జానీ మాస్టర్‌పై జనసేన అధినేత ఎలాంటి చర్య తీసుకుంటారు అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. జానీ మాస్టర్ జనసేన తరపున ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో చురుకుగా పాల్గొన్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్‌లో కూడా హేమ కమిటీ కావాలి?

మహిళలపై లైంగిక దాడులకు సంబంధించి హేమ కమిటి సంచలన విషయాలు వెల్లడించింది. మాలీవుడ్‌ చీకటి కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఒక హీరోయిన్‌కు జరిగిన ఘటన కారణంగా కేరళ ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత పలు ఇతర రాష్ట్రాల సినీ పరిశ్రమల్లో కూడా ఇటువంటి కమిటీ ఒకటి రావాలని చాలా మంది అన్నారు. కాగా ఇలాంటి కమిటీ ఒక్కటి టాలీవుడ్ తప్పక కావాల్సిన అవసరం ఉందని తాజాగా డాన్స్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్పై నమోదైన కేసు చెప్పకనే చెప్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకునో, అర్థ బలం ఉందనో, ఎదుటి వారి అవసరాన్ని అవకాశం తీసుకునో టాలీవుడ్‌లో కూడా మహిళలు కూడా తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారన్న బావన కలిగిస్తోంది ఈ కేసు. అచ్చం హేమ కమిటీ చెప్పినట్లే.. ప్రతి ఒక్కరూ లేడీ ఆర్టిస్ట్ అంటే పడక సుఖాన్ని కోరుకుంటున్నారని, తన కింద పనిచేసేవారైతే బలవంతం చేస్తున్నారని, కాదుకూడదు అంటే అవకాశాలు ఇవ్వం, లైఫ్ లేకుండా చేస్తామని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పుడు జానీ మాస్టర్ కేసు విషయంలో కూడా ఇవే బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదు దారు ఆరోపిస్తున్నారు. దీంతో టాలీవుడ్‌లో కూడా హేమ కమిటీ వంటి కమిటీ తప్పక రావాల్సిన అవసరం ఉందనిపిస్తోంది.

Tags:    

Similar News