పదేళ్ళ తెలంగాణలో పౌరహక్కుల అణచివేత ! : హరగోపాల్

పదేళ్ల తెలంగాణలో పౌరహక్కుల పరిస్థితి ఎలా ఉంది? పదేళ్లకే బీఆర్ఎస్ పాలనను ప్రజలు ఎందుకు తిరస్కరించారు? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు ప్రొఫెసర్ హరగోపాల్ సమాధానాలు..

Update: 2024-05-26 05:40 GMT

"భౌగోళిక తెలంగాణ వాస్తవమైంది. ఎక్కడా జరగని పౌరహక్కుల ఉల్లంఘన తెలంగాణలో జరిగింది. రాజకీయ నాయకత్వం లంపెన్ వర్గం చేతిలోకెళ్ళిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో విస్మరించిన నీటి పారుదల రంగంలో కొంత కృషి జరిగింది. ప్రజల ఆకాంక్షలు పరిపాలనలో ప్రతిఫలించలేదు. అందువల్లనే పదేళ్ళకే బీఆర్ఎస్‌ను ప్రజలు తిరస్కరించారు” అంటారు పౌరహక్కుల నేత ప్రొఫెసర్ జి. హరగోపాల్.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్ 2వ తేదీ నాటికి పదేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా మే 23వ తేదీ గురువారం హైదరాబాద్‌లో ప్రొఫెసర్ హరగోపాల్‌తో జరిపిన ఇంటర్వ్యూ.

 

 

ప్రశ్న : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2024 జూన్ 2వ తేదీ నాటికి పదేళ్ళు పూర్తవుతాయి. ఈ పదేళ్ళ తెలంగాణలో పౌరహక్కుల పరిస్థితి ఎలా ఉంది?

హరగోపాల్ : తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలోనే 'తెలంగాణ పీపుల్స్ మూమెంట్ అన్ ఫోల్డింగ్ పొలిటికల్ కల్చర్' అన్న వ్యాసం ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో రాశాను. ఈ వ్యాసంలో తెలంగాణ ఉద్యమం రెండు పాయల్లో జరుగుతున్నదని పేర్కొన్నాను.

మొదటిది ప్రధాన స్రవంతి రాజకీయాలు. ఆ రాజకీయాలు భౌగోళిక తెలంగాణపై దృష్టి పెట్టాయి. రెండవది ప్రజాస్వామిక తెలంగాణ. 'అంతిమంగా ప్రధాన స్రవంతి రాజకీయాలే తెలంగాణలో ప్రధానంగా కొనసాగుతాయి.' ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఉద్యమాలు కొనసాగవలసి ఉంది. భౌగోళిక తెలంగాణ వాస్తవమైంది.

నిజానికి ఉద్యమ కాలంలోనే తెలంగాణ రాష్ట్రమంటూ ఏర్పడితే పౌరహక్కులకు స్థానమేముంటుంది? అనే ప్రశ్న అడుగుతూ వచ్చాం. పౌరహక్కుల సంఘం నిర్వహించిన ఒక సదస్సుకు కేసీఆర్‌ని పిలిచాం. ఆయన మాట్లాడే ముందు నా ప్రసంగంలో "తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మీరు ముఖ్యమంత్రి అయితే మీరు తప్పకుండా పౌరహకుల ఉల్లంఘన చేస్తారు. ఆ విషయం చెప్పడానికే మిమ్మల్ని మేం ఇవాళ ఆహ్వానించాం" అని అన్నాను.

ఈ వ్యాఖ్యకు స్పందిస్తూ కేసీఆర్ "నేనెందుకు ముఖ్యమంత్రిని అవుతాను, ఒక దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు. నేను పౌరక్కుల సంఘంలో చేరి ఆ ఉద్యమానికి అగ్రభాగాన ఉండి పనిచేస్తాను” అని అన్నారు.

ఈ విషయం ఆయన చెప్పిన రోజే అది అబద్దమని మాకు తెలుసు. ఆయన తెలంగాణ ఏర్పడుతూనే ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. పౌరహక్కుల ఉల్లంఘన కూడా జరిగింది. మా భయమే నిజమైంది.

దేశంలో ఎక్కడా జరగని పౌరహక్కుల ఉల్లంఘన తెలంగాణలో జరిగింది. ఈ పదేళ్ళలో దాదాపు 200 మంది మీద 13 'ఉపా' కేసులు పెట్టారు. నా యాభై ఏళ్ళ పౌరహక్కుల జీవితంలో ఎప్పుడూ నేను అరెస్టు కాలేదు.

కానీ, తెలంగాణ విద్యాపరిరక్షణ ఉద్యమంలో భాగంగా అమర వీరుల స్తూపం దగ్గర మమ్మల్ని అరెస్టు చేశారు. దానికి మించి 'తాడ్వాయ్ ఉపా' కేసులో నాతోపాటు 150 మందిని ఇరికించారు. ఈ కేసు చాలా హాస్యాస్పదమైన కేసు.

బాంబే హైకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ సురేష్‌ని ఈ 'ఉపా' కేసులో చేర్చారు. న్యాయవ్యవస్థలో వారు అత్యంత గౌరవం పొందిన న్యాయమూర్తి. రెండేళ్ళ క్రితమే చనిపోయిన జస్టిస్ సురేష్‌పైన ఈ 'ఉపా' కేసు పెట్టారు. అలాగే భీమా కోరేగాం కేసులో నిందితురాలు సుధా భరద్వాజ్ పైన కూడా ఈ 'తాడ్వాయ్ ఉపా' కేసు పెట్టారు. ఆమె ఇవాళ బెయిల్‌పైన ఉన్నారు.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అనే ఉపాధ్యాయ సంఘం తమ అంతర్గత కౌన్సిల్ మీటింగ్ పెట్టుకోడానికి వస్తే నేను కూడా ఆ మీటింగ్‌లో మాట్లాడవలసి ఉంది. ఉపాధ్యాయులతో పాటు నన్ను కూడా అరెస్టు చేశారు.

ఆ ఉపాధ్యాయ సంఘానికి ఉపాధ్యాయ లోకంలో నిజాయితీ కలిగిన సంస్థగా మంచి పేరుంది. మరి వాళ్ళను చిన్న మీటింగు కూడా పెట్టుకోనివ్వకపోవడం గమనిస్తే పౌరహక్కుల ఉల్లంఘన ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.

అధికారంలోకి వస్తూనే ఎన్ కౌంటర్లు కొనసాగించారు. ఈ ఎన్ కౌంటర్లకు పెద్ద ఎత్తున స్పందన రావడంతో ఎన్ కౌంటర్లు తెలంగాణలో తగ్గాయి కానీ, ఛత్తీస్‌గడ్‌లోని విప్లవోద్యమంలో భాగం పంచుకుంటున్న చాలా మందిని ఎన్‌కౌంటర్ల పేరుతో హత్యలు చేశారు. భీమా కోరెగాం కేసులో వరవరరావును అరెస్టు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం కనీసం నిరసన కూడా ప్రకటించలేదు.

 

ప్రశ్న : ప్రత్యేక తెలంగాణ ఉద్యమం స్వాతంత్య్ర పోరాటంలా సుదీర్ఘకాలం సాగింది. రాజకీయ నాయకుల్లో స్వాతంత్ర్యోదమ విలువలు కొంతకాలమైనా కొనసాగాయి. తెలంగాణ ఉద్యమంలో అలా ఎందుకు లేవు?

హరగోపాల్ : స్వాతంత్రోద్యమ కాలంలో ఎదిగిన రాజకీయ నాయకత్వం వల్ల అది చరిత్రను మలుపు తిప్పిన ఉద్యమం అయ్యింది. జై తెలంగాణ ఉద్యమానికి 1969లో నాయకత్వం వహించిన చెన్నారెడ్డి ఒక భూస్వామ్య భావజాలం నుంచి వచ్చిన వారు. ఉద్యమాన్ని చివరి దాకా తీసుకుపోలేదు. ఆ ఉద్యమంలో 350 మంది విద్యార్థులు చనిపోయారు. నాయకత్వం నిజాయితీగా పనిచేయకపోవడం వల్ల ఆ ఉద్యమం విఫలమైంది.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1996 నుంచి ప్రారంభమైనప్పుడు తెలంగాణలో ఎదిగిన రాజకీయ నాయకత్వంలో చాలా వరకు భూ ఆక్రమణ దారులు, కాంట్రాక్టర్లు, మద్య దళారీలు. ఈ ఉద్యమం ఈ వర్గం చేతిలోకి వెళ్ళిపోయింది.

ఈ ఉద్యమంలో కీలక పాత్ర నిర్వహించిన డాక్టర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే మరణించారు. మరో నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం. ఈ ఇద్దరు నాయకులు విద్యారంగం నుంచి రావడం ఒక విశేషం. ఈ ఇద్దరు కూడా వ్యక్తిగత నిజాయితీ కలిగిన వారు.

ఇక ఉద్యమం విస్తృతంగా ఎదిగింది. ఊహించని విధంగా ప్రజల భాగస్వామ్యం ఉంది. కానీ, తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రొఫెసర్ కోదండరాం ఇంటి మీద దాడి చేయడం, ఆయనను ఎక్కడా కదలనివ్వకపోవడం చాలా అప్రజాస్వామిక ధోరణి.

ఈ ప్రధాన స్రవంతి రాజకీయాల్లో; అధికారంలోకి వచ్చిన వర్గం రాజకీయ సంస్కృతి లంపెన్ వర్గం చేతిలోకి పోవడం వల్ల ఎదుగుతున్న యువత కానీ, విద్యార్థి లోకం కానీ, దళిత వర్గాల నుంచి కానీ, ఆదివాసుల నుంచి కానీ కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించలేదు.

స్వాతంత్ర్యోదమం అలా కాదు. స్వాతంత్ర్యోద్యమంలో ఆదివాసీ పోరాటాలు దళిత పోరాటాల నుంచి వచ్చి నాయకత్వం కొంతకాలమైనా నిజాయితీగా తమ పాత్రను నిర్వహించాయి. దళిత పేద వర్గాల ఉద్యమానికి నాయకత్వం వహించిన డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్ గా కీలకమైన పాత్ర నిర్వహించారు.

ఈ సంస్కృతి ఎక్కువ కాలం కొనసాగలేదు. కానీ, రెండు దశాబ్దాల కాలం స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న నాయకత్వానికి ఎంతో గౌరవం, కొన్ని విలువలు ఉండేవి.

యాభై అరవైయవ దశకాల వరకు పార్లమెంటులో అటు క్యాబినెట్‌లో కానీ, ఇటు ప్రతిపక్ష పార్టీలలో కానీ చాలా త్యాగాలు చేసినవారి నాయకత్వం లభించడం వల్ల స్వాతంత్ర్యోద్యమ ప్రభావం కనిపించింది. అరవైయవ దశాబ్దం తరువాత రాజకీయ సంస్కృతి మారింది. స్వప్రయోజన పరులు, స్వార్థ పరుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. పేద వర్గాలకు ప్రాతినిధ్యం వహించే నాయకత్వాన్ని ఎదగనివ్వలేదు.

ఈ 70వ దశకం నుంచి పూర్తిగా దాని స్వభావమే మారిపోయింది. ఈ మారిన రాజకీయ సంస్కృతే తెలంగాణ రాష్ట్రంలో కూడా రావడం వల్ల అటు జాతీయ స్థాయిలో కానీ, ఇటు ప్రాంతీయ పార్టీలలో కానీ ఒక ఆదర్శాలు, ఆశయాలు విలువలు కాపాడి, ప్రజలను ప్రేమించే నాయకత్వం ఇవాళ లేకుండా పోయింది.

సామ్రాజ్యవాద ప్రేరేపిత అభివృద్ధి నమూనా, అలాగే భూస్వామ్య భావజాలం జమిలిగా దేశాన్ని ఫాసిజం వైపు తీసుకెళుతున్నాయి. ప్రధానంగా స్వాతంత్ర్యోద్యమం వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడాయి కానీ, భూస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడకపోవడంతో ఇవాళ ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి బదులుగా ప్రమాదంలో పడింది. తెలంగాణ కూడా ఇందులో భాగమైపోయింది.

ప్రశ్న : తెలంగాణ రాకముందు రాజకీయాలు ఎలా ఉన్నాయి? వచ్చాక ఎలా ఉన్నాయి?

హరగోపాల్ : తెలంగాణ ఉద్యమం నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వలన అప్పటి వరకు ఆధిపత్యం వహిస్తున్న ఆంధ్రాప్రాంత సంపన్న వర్గం అధిపత్యం పోయింది. సమాజంలో ఆధిపత్యం అనేది భిన్న పొరల్లో ఉంటుంది. ఇందులో ఒక పొర పోయింది. కానీ మిగతా అధిపత్య పొరలు కొనసాగడం వలన గతంలో దళితులు, ఆదివాసీలు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితే దాదాపు కొనసాగుతోంది. చివరికి తెలంగాణ అస్తిత్వం, దాని ఆత్మ గౌరవం విలువలు, చైతన్యం కూడా నిర్వీర్యం అయిపోయాయి.

ప్రశ్న : తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి, అధికారం చేపట్టిన టీఆర్ఎస్‌ను కేవలం పదేళ్ళలోనే ప్రజలు ఎందుకు తిరస్కరించారు?

హరగోపాల్ : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాయకత్వం గుణాత్మకంగా ఎంతో భిన్నంగా లేదు. అయినా ఒక దశాబ్ద కాలం ప్రజలు వారి నాయకత్వానికి మద్దతిచ్చారు. నాయకత్వమే ప్రజల పక్షాన లేకపోవడం, ఏక వ్యక్తి పాలన రావడం, పౌరహక్కుల ఉల్లంఘన జరగడం, తెలంగాణ ఆకాంక్షలు ఏ మాత్రం పాలనలో ప్రతిఫలించకపోవడం వలన ఒక దశాబ్ద కాలంలోనే ఆ నాయకత్వాన్ని తిరస్కరించే దశకు తెలంగాణ ప్రజలు వచ్చేశారు.

ప్రశ్న : రాజకీయంగా తెలంగాణ సాధించింది ఏమిటి? విఫలమైంది ఏమిటి?

హరగోపాల్ : తెలంగాణలో వచ్చిన మార్పుల్లో ఒకటి, ఈ పదేళ్ళలో మతసామరస్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కాపాడింది. కొంతవరకు గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల పునరుద్ధరణ జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో దీన్ని పూర్తిగా విస్మరించారు.

రెండవది కొన్ని భారీ నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించే ప్రయత్నం జరిగింది. రైతు బంధు పథకాల వలన, ఉచిత విద్యుత్ ఇవ్వడం వలన రైతుల ఆత్మహత్యలు చాలా పెద్ద ఎత్తున తగ్గాయి.

వైఫల్యాల గురించి చెప్పాలంటే, తెలంగాణలో ప్రభుత్వం ఏ పథకం పెట్టినా దాని ముందు వెనక అలోచించకపోవడం దీర్ఘ కాలిక పరిణామాల గురించి పట్టించుకోకపోవడం, తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టుకోలేకపోవడం విద్యారంగం లాంటి రంగాన్ని విధ్వంసం ప్రధాన వైఫల్యంగా చెప్పుకోవాలి.

 

ప్రశ్న : కేసీఆర్‌ కుమార్తెపై లిక్కర్ స్కాం అరోపణలు, కుమారుడిపైన కూడా ఇతర అవినీతి ఆరోపణలు రావడంపై మీరేమంటారు?

హరగోపాల్ : స్కాంలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయని బీజేపీ ప్రభుత్వం అంటున్నది. స్కాంలలో కొన్ని నిజమైనవి, కొన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపైన రుద్దినవి.

కనుక మొత్తంగా నిజా నిజాలు తేలవలసి ఉంది. నిజానికి లిక్కర్ స్కాం అనేది దేశ వ్యాపితంగా జరిగింది. దాని కంటే కూడా కాళేశ్వరంలో జరిగిన అవకతవకల గురించి ఆందోళన పడవలసి ఉంది. ఇవాళ దానిపైన ఒక ఎంక్వయిరీ జరుగుతున్నది.

చాలా వైపల్యాలకు కేసీఆర్‌ గారు తనకు ఏది తోస్తే దాన్నే విధానంగా ప్రకటించడం వలన, స్కాం అనేది ప్రధానం కాదు కానీ, విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయి.

 

ప్రొఫెసర్ జీ హరగోపాల్

ప్రశ్న : గ్రామాల్లో నక్సలైట్ల ప్రభావంతో భూములు వదిలిపెట్టి పట్టణాలకు, నగరాలకు వెళ్ళి పోయిన భూస్వాములు, కేసీఆర్‌ పాలనలో మళ్ళీ గ్రామాలకు వచ్చి ఆ భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరిగిందనే వాదన గురించి మీరేమంటారు?

హరగోపాల్ : పాత భూస్వామ్యానికి, ఇప్పుడుండే భూస్వామ్యానికి తేడా ఉంది. గతంలో తెలంగాణకు అధిపత్యం వహించి గ్రామాన్ని గ్రామాన్నే తమ చెప్పుచేతల్లో పెట్టుకునే భూస్వాములు పట్టణాలకు చేరుకున్నారు. కానీ, ఇవ్వాళ భూస్వామ్య భావజాలం చాలా బలంగా తెలంగాణ గ్రామాలను కట్టడి చేస్తోంది. అప్పట్లో భూస్వాముల భయం స్థానంలో రాజ్యం చేసే నిర్బంధం పెరిగింది.

ప్రశ్న : రైతుబంధు పథకం కానీ, ధరణి పథకం కానీ ఎక్కువగా భూస్వాములకే ఉపయోగపడిందనే ఆరోపణ గురించి మీరేమంటారు?

హరగోపాల్ : రైతు బంధు పథకం కొంత వరకు రైతులకు సహాయపడింది. కానీ, వంద ఎకరాలున్నవారికి, రెండువందలెకరాలున్నవారికి, అసలు తమ భూమి ఎక్కడుందో తెలియని వారికి, అమెరికాలో స్థిరపడిన వారికి దీన్ని వర్తింప చేశారు. ఈ పథకం వలన చిన్న సన్న కారు రైతులకు కొంత మేలు జరిగింది.

రాత్రింబవళ్ళు ఎవరైతే శ్రమ చేశారో అలాంటి కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వకుండా భూ యజమానులకు డబ్బు ఇవ్వడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద అది భారంగా మారి అదనపు ఆదాయం ఉన్న రాష్ట్రం తీవ్రమైన అప్పుల్లో పడిపోయింది.

ప్రశ్న : కాళేశ్వరం ప్రాజెక్టు బీటలు వారడంతో దాని భవిష్యత్తు ఎలా ఉంటుందనుకుంటున్నారు?

హరగోపాల్ : కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు జరిగింది చాల స్పష్టమే. ప్రాజెక్టుని కొంత రిపేరు చేయాలా, మొత్తం ప్రాజెక్టును రద్దు చేయాలా అన్న అంశంపైన ఇవాళ నిపుణులు చర్చిస్తున్నారు. ఈ అంశాన్ని నిపుణుల కమిటీ సమగ్రంగా పరిశీలిస్తున్నది. మొత్తంగా ప్రాజెక్టుని రద్దు చేస్తే, కూలగొడితే, దాన్ని తెలంగాణ యొక్క పెద్ద విషాదంగా పరిగణించాలి.

 

ప్రొఫెసర్ జి హరగోపాల్ ని ఇంటర్వ్యూ చేస్తున్న రచయిత రాఘవశర్మ

ప్రశ్న : తెలంగాణలోని 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించడం వల్ల పరిపాలనా పరంగా మేలేమైనా జరిగిందా?

హరగోపాల్ : ఈ నిర్ణయం కూడా ఆలోచనా రహితంగా తీసుకున్న నిర్ణయం. నిజానికి తెలంగాణలో 17 పార్లమెంటరీ నియోజకవర్గాలున్నాయి. వాటిని 17 జిల్లాలుగా చేస్తే సరిపోయేది.

ఇంత పెద్ద సంఖ్యలో జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల ఆఫీసులు లేకపోవడం, సౌకర్యాలు లేకపోవడం, కొత్త నియామకాలు జరగకపోవడం, ఒక జిల్లాకు కావలసిన హంగులేవీ లేకుండా చేయడం వల్లన కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆఫీసులు పట్టణానికి దూరంగా కట్టడం ప్రజలకు సౌకర్యాల కంటే కూడా ఎక్కువ అసౌకర్యం కలిగింది.

ప్రశ్న : ఈ అయిదారు నెలల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది?

హరగోపాల్ : అయిదారు నెలల కాంగ్రెస్ పాలనను గమనిస్తే అభివృద్ధి నమూనా గత అభివృద్ధి నమూనా దిశగానే వెళుతున్నది. ఏక వ్యక్తి నాయకత్వం పోయింది. కేసీఆర్ పాలన శైలి నుంచి నేర్చుకున్న పాఠాలు కొంత కాంగ్రెస్ పాలన మీద ప్రభావం కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా విభేదాలు ఉండడం వలన ఏక వ్యక్తి పాలన కూడా సాధ్యం కాదు. కాంగ్రెస్‌కు డిల్లీ హైకమాండ్ పర్యవేక్షణ కూడా ఉంటుంది. కొంతకాలమైనా ప్రజలకు ప్రజాస్వామిక చోటు (డెమోక్రటిక్ స్పేస్) ఉంటుందనే నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను.

Tags:    

Similar News