కాగితాల్లోనే పోలీసు సంస్కరణలు,తెలంగాణలో అమలు ఏది?

తెలంగాణ రాష్ట్రంలో పోలీసు సంస్కరణలు కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయి. రాష్ట్ర భ‌ద్ర‌తా క‌మిష‌న్, పోలీసు కంప్ల‌యింట్ అథారిటీలు జీఓలకే పరిమితమైనాయి.

Update: 2024-11-05 10:38 GMT

పోలీసుశాఖ‌లో సంస్క‌ర‌ణ‌లు తీసుకురావాల‌ని స్వాతంత్య్రం వ‌చ్చిన త‌ర్వాత ఎన్నో క‌మిటీలు సిఫార‌సు చేశాయి. చివ‌ర‌కు 2006 సంవ‌త్స‌రంలో సుప్రీమ్‌కోర్టు తీర్పు వెలువ‌రిస్తూ ఆరు మార్గ‌ద‌ర్శ‌కాలు సూచించింది. ఈ మార్గదర్శకాల్లో ముఖ్యంగా రాష్ట్ర భ‌ద్ర‌తా క‌మిష‌న్,పోలీసు కంప్ల‌యింట్ అథారిటీలు ఏర్పాటు చేయాలి.

- భ‌ద్ర‌తా క‌మిష‌న్ పోలీసుశాఖ ప‌నితీరును నిశితంగా స‌మీక్షించ‌డంతో పాటు పోలీసులకు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇవ్వాలి. పోలీసుశాఖ వారు చ‌ట్ట ప్ర‌కార‌ము ప‌నిచేసే విధంగా భద్రతా కమిషన్ స‌హ‌క‌రించాలి.

పోలీసు కంప్ల‌యింట్ అథారిటీ ఏది?
సుప్రీం మార్గదర్శకాల ప్రకారం పోలీసు కంప్ల‌యింట్ అథారిటీని రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయాలి. రాష్ట్ర పోలీసు కంప్ల‌యింట్ అథారిటీని విశ్రాంత హైకోర్టు జ‌డ్జి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలి. ఐ.పి.ఎస్‌. అధికారుల‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఈ అథారిటీ విచారిస్తుంది.అలాగే జిల్లా అథారిటీ విశ్రాంత జిల్లా జ‌డ్జి ఆధ్వర్యంలో డి.ఎస్‌.పి.కిందిస్థాయి అధికారులపై వ‌చ్చే ఫిర్యాదుల‌ను విచారించాలి.

పోలీసు శాఖలో అక్రమాలు
తెలంగాణ రాష్ట్రంలో గ‌త కొద్ది సంవ‌త్స‌రాలుగా పోలీసుశాఖ‌ను ప్రజా ప్రతినిధులు త‌మ గుప్పిట్లో పెట్టుకొని పలు అక్ర‌మాలు చేయించారు.ముఖ్యంగా అన‌ధికారంగా ప్రతిపపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేయించారు.పోలీసులు, ప్రజాప్రతినిధులు నేర‌చ‌రిత్రుల‌తో కుమ్మ‌క్కై భూక‌బ్జాలు, అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారు.

ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ హైకోర్టులో పిల్
సుప్రీం కోర్టు ఆదేశాల‌కు అనుగుణంగా పోలీసుశాఖ‌లో సంస్క‌ర‌ణ‌లు కావాల‌ని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ హైకోర్టులో పిల్ కూడా వేసింది.ఈ వ్యాజ్యం కేసు కోర్టులో విచారణలో ఉంది. పోలీసుశాఖ‌లో సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ పలు స‌ల‌హాలు, సూచ‌న‌లు చేసింది.
- తెలంగాణ రాష్ట్రానికి కొత్త పోలీసు చ‌ట్టం : దేశంలోని చాలా రా ష్ట్రాల్లో కొత్త పోలీసు చ‌ట్టం లేదా ఉన్న‌వాటికే స‌వ‌ర‌ణ‌లు చేయ‌డం జ‌రిగింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పోలీసు చ‌ట్టం తీసుకురావాలి.
- రాష్ట్ర భ‌ద్ర‌తా క‌మిష‌న్ ఏర్పాటు,విధివిధానాల ఖ‌రారు : 2021వసంవత్సరంలో హైకోర్టులో కేసు ఉన్నందున ఆద‌రా బాద‌ర‌గా ఒక భ‌ద్ర‌తా క‌మిష‌న్ ఏర్పాటు చేస్తున్న‌ట్లుగా తెలంగాణ సర్కారు జి.ఓ. ఇచ్చినా అది ఇంత‌వ‌ర‌కు అమ‌లు కాలేదు. ఇప్పుడైనా గ‌ట్టి రాష్ట్ర భ‌ద్ర‌తా క‌మిష‌న్ ఏర్పాటు చేయాలి.

 పోలీసు కంప్త‌యింట్ అథారిటీ నియమించాలి
రాష్ట్ర, జిల్లాల వారీగా పోలీసు కంప్లయింట్ అథారిటీని నియ‌మించాలి. హైకోర్టులోని కేసు దృష్ట్యా 2021లో హైద‌రాబాద్, వ‌రంగ‌ల్ జిల్లాలో మాత్ర‌మే పోలీసు కంప్లయింట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ జి.ఓ. ఇచ్చినా అది అమ‌లు కాలేదు. ఇప్పుడైనా సుప్రీమ్‌కోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర, ప్ర‌తి జిల్లాకు ఒక పోలీసు కంప్ల‌యింట్ అథారిటీని ఏర్పాటు చేసి, విధి విధానాలు ఖ‌రారు చేయాలి.

పోలీసు సంస్కరణలు అమలు చేయండి : ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
పోలీసు సంస్కరణలు అమలు చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేర ఆయన సీఎంకు మంగళవారం లేఖ రాశారు. ప్ర‌స్థుతం రాష్ట్రంలో పోలీసు వ్య‌వ‌స్థ స‌రైన దిశ‌లో ప‌ని చేయ‌డం లేదని ఆయన ఆరోపించారు. రాజ‌కీయ ఒత్తిళ్ల మ‌ధ్య పోలీసు శాఖ త‌మ విధులు స‌క్ర‌మంగా నిర్వ‌హించటం లేదని సీఎంకు తెలిపారు. పోలీసు అధికారులపై వ‌చ్చే ఫిర్యాదులను విచారించ‌డానికి ఒక స్వ‌తంత్ర వ్య‌వ‌స్థ లేదని,దీని కోసం రాష్ట్ర భ‌ద్ర‌తా క‌మిష‌న్, పోలీసు కంప్ల‌యింట్ అథారిటీలను నియమించి , వాటి విధివిధాన‌లు ఖ‌రారు చేయాల‌ని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ పక్షాన పద్మనాభరెడ్డి రాష్ట్ర ముఖ్య‌మంత్రిని కోరారు.


Tags:    

Similar News