తెలంగాణలో గుంతలు లేని రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక
తెలంగాణలో గుంతలు లేని రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించినట్లు రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.
By : Shaik Saleem
Update: 2024-11-11 14:28 GMT
తెలంగాణలో రోడ్లపై గుంతలను పూడ్చేందుకు అధునాతన పద్ధతులు అవలంభిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. మెషినరీని ఉపయోగించి వేగంగా గుంతలను పూడ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన చెప్పారు.
- రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూర్ గ్రామం వద్ద రహదారులపై గుంతలను పూడ్చేందుకు సిద్ధం చేసిన ఎయిర్ ప్రెషర్ జెట్ ప్యాచర్,పాట్ హోల్ అండ్ రోడ్ మెయింటెనెన్స్ మిషనరీల పనితీరును మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్,స్పెషల్ సెక్రెటరీ దాసరి హరిచందనతో కలిసి మంత్రి మిషన్ల పనితీరును ప్రత్యక్షంగా చూశారు.
గుంతలు పూడ్చే మిషన్లు
మంత్రి కోమటిరెడ్డి స్వయంగా ఎయిర్ ప్రెషర్ జెట్ ప్యాచర్ మిషన్ ఎక్కి దీని పనితీరు గురించి టెక్నీషియన్లతో చర్చించారు. 6 ఎంఎం, 25 ఎంఎం స్టోన్ మెటీరీయల్, డస్ట్ తో కూడిన మిశ్రమం ఏ విధంగా రోడ్లపై గుంతలను పూడుస్తుందో మంత్రి పరిశీలించారు.రోజుకు 10-20 కిలోమీటర్ల మేర గుంతలను పూడ్చే సామర్ధ్యం కలిగిన రెండు మిషన్లను ఆయన స్వయంగా పరిశీలించి మిషనరీ సామర్ధ్యం గురించి, వాటి పనితీరుగురించి టెక్నీషియన్లను అడిగి తెలుసుకున్నారు.
వేగంగా గుంతలు పూడ్చేందుకు...
మీడియాకు రోడ్లపై గుంతలను మరమ్మతులను చేసే విధానాన్ని మంత్రి చూపించారు. రోడ్లపై గుంతలను సంప్రదాయ పద్ధతుల్లో నింపడం వల్ల నెలల సమయం పడుతుందని ఈ లోపు రహదారులపై మరోచోట గుంతలు పడుతున్నాయని కోమటిరెడ్డి చెప్పారు. మెకనైజ్డ్ రోడ్ రిపేరింగ్ విధానంలో గుంతలను పూడిస్తే, తక్కువ సమయంలో ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను అందించవచ్చని మంత్రి తెలిపారు.రద్దీగా ఉండే రహదారులపై పనులు వేగంగా చేయడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయని.. ఖచ్చితత్వంతో ప్యాచ్ వేయగలిగే మెకనైజ్డ్ సిస్టం వల్ల ప్యాచ్ వేసినట్టు కనిపించకుండా సహజంగా రోడ్డు వేసినట్టే ఉంటుందన్నారు. రిపేర్ల వల్ల వాహనాలు కుదుపులకు గురికాకుండా పూర్తిగా రోడ్డంతా ఒకేసారి వేసినట్టు ఉంటుందని ఆయన తెలిపారు.తక్కువ ఖర్చుతో ఎక్కువ రోడ్లను తక్కువ సమయంలో రిపేర్లు చేయడం వల్ల ప్రభుత్వానికి ఆర్ధిక భారం తగ్గడంతోపాటు..ప్రజలకు గుంతలు లేని రోడ్లు అందుబాటులోకి వస్తాయని మంత్రి వివరించారు.
గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల ఇప్పటికి ప్రభుత్వానికి గుదిబండగా మారిందని రాష్ట్రంలో ఏ ఊరికి పోయినా రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి దోచుకొని తెలంగాణ ప్రజలపై భారం మోపిన కేసిఆర్.. కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదని ఆయన ఆరోపించారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడంలో రోడ్లు కీలకపాత్ర పోషిస్తాయని చెప్పిన మంత్రి అందుకు అనుగుణంగా వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఎక్కడా గుంతలనేవి లేకుండా చేస్తామని మంత్రి తేల్చి చెప్పారు.