తెలంగాణ కీలక నేతలపై పెట్టీ కేసులు...ఎందుకు పెట్టారంటే...

తెలంగాణలో కీలక రాజకీయ నేతలపై పోలీసులు రాజకీయ దురుద్ధేశంతో పెట్టీ కేసులు పెట్టారు. విపక్ష నేతలపై పోలీసులు పెట్టిన పెట్టీ కేసుల విచారణ పెండింగులో ఉంది.

Update: 2024-06-18 11:22 GMT

అధికార పార్టీ నేతల ఆదేశాలతో విపక్ష నేతలు చేసిన చిన్న చిన్న తప్పిదాలపై పోలీసులు కేసులు పెడుతుండటంతో వారు నేరచరితులుగా రికార్డుల్లోకి ఎక్కుతున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిపై గతంలో పోలీసులు 82 కేసులు నమోదు చేశారు. దీంతో దేశంలోనే అత్యధిక పోలీసు కేసులున్న సీఎంగా ఏడీఆర్ రికార్డుల్లోకి ఎక్కారు. కానీ రేవంత్ రెడ్డిపై నమోదైన కేసులను పరిశీలిస్తే వాటిలో ఎక్కువ కేసులు చిన్నవని తేలింది.
- కొత్తగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అయిన బండి సంజయ్ పైనే 42 పోలీసు కేసులు నమోదయ్యాయి. కేవలం చిన్న చిన్న తప్పులు, నిబంధనల ఉల్లంఘన పేరిట పోలీసులు బండి సంజయ్ పై కేసులు పెట్టారు. అధికార పార్టీ ఆదేశంతో అలా కేసులు పెట్టిన పోలీసులే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కావడంతో బండి సంజయ్ కు ప్రోటోకాల్ ప్రకారం శాల్యూట్ చేయాలి.
- తెలంగాణ మాజీ సీఎం, ప్రస్థుత ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కూడా పోలీసులు 9 కేసులు పెట్టారు.

నేరచరితులుగా రికార్డుల్లోకి ఎక్కిన నేతలు
ఇలా తెలంగాణలోని కీలక నేతలపై పోలీసులు రాజకీయ దురుద్ధేశంతో కేసులు పెడుతుండటంతో వారంతా నేరచరితులుగా రికార్డుల్లోకి ఎక్కుతున్నారు. క్రిమినల్సే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనే భావంతో కొందరు మేధావులు, సంఘసేవకులు వారికి ఓట్లు వేసేందుకు ముందుకు రావడం లేదు.దీంతో పోలింగ్ శాతం తగ్గుతోంది. దీంతో పాటు కొందరు నోటాకు కూడా ఓటేస్తున్నారు. రాజకీయ నేతలంతా నేరచరితులేననే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుంది. కానీ కొందరు ఉన్నత విద్యావంతులు, సచ్ఛీలురు కూడా రాజకీయాల్లో ఉన్నారు.

రాజకీయ ఒత్తిళ్లతోనే రేవంత్ రెడ్డిపై 89 పోలీసు కేసులు
గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీగా పనిచేసిన ఎ రేవంత్ రెడ్డిపై పోలీసులు అత్యధికంగా 89 కేసులు పెట్టారు.సీఎంపై మూడు ప్రధాన కేసులు మినహాయిస్తే 86 కేసులు కూడా చిన్న చిన్న తప్పిదాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులు అధికారపార్టీ తరపున పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై పోలీసులు గతంలో 35 కేసులు పెట్టారు. పోలీసుల నుంచి అనుమతి పొందిన సంఖ్య కంటే ఎక్కువ మంది ప్రజలతో సభ నిర్వహించారని రేవంత్ రెడ్డిపై పోలీసులు కేసులు బనాయించారు. ఎన్నికల సమావేశాల్లో రేవంత్ రెడ్డి మాస్కు పెట్టుకోలేదని కూడా పోలీసులు కేసు నమోదు చేయడం విశేషం.

బండి సంజయ్ పై అనుమతి లేకుండా ఆలయప్రవేశం చేశారని కేసు
కేంద్ర సహాయమంత్రి అయిన బండి సంజయ్ పై తెలంగాణ పోలీసలు 49 కేసులు నమోదు చేశారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బండి సంజయ్ ఎలాంటి అనుమతి లేకుండా అనుచరులతో కలిసి ఆలయంలోకి ప్రవేశించారని యాదగిరి గుట్ట పోలీసులు క్రైం నంబరు 312 నంబరుతో 2022లో కేసు పెట్టారు. సీఎం కుమార్తె, ఎమ్మెల్సీపై తప్పుడు ఆరోపణలు చేశారని బండి సంజయ్ పై జోగిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ టూ టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో బండి సంజయ్ 2022లో మాస్కు ధరించలేదని కేసు నమోదు చేశారు. కొవిడ్ గైడ్ లైన్స్ పాటించలేదని సెక్షన్ 147, 148,188,341,332,149,151 ల కిద బండి సంజయ్ పై పోలీసులు కేసులు పెట్టారు.

కేసీఆర్ పై 9 కేసులు
మాజీ సీఎం, ప్రస్థుత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ పై పోలీసులు 9 కేసులు నమోదు చేశారు. మిలియన్ మార్చ్ జరిగినపుడు 2011 మార్చి 10వతేదీన కొందరు వ్యక్తులు మీడియా వారి నుంచి కేమెరాలను లాక్కున్నారని, కేసీఆర్ పై కేసు పెట్టారు. కేమెరాలు లాక్కున్నపుడు కేసీఆర్ అక్కడ లేకపోయినా మూడు కేసుల్లో అతన్ని ఏ2 ముద్దాయిగా చేర్చారు. 12 ఏళ్ల నుంచి ఈ కేసులు ఎలాంటి విచారణకు నోచుకోలేదు. 2009 నవంబరు 29వతేదీన కేసీఆర్ తెలంగాణ సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కొందరు ఉద్యమకారులు రాస్తారోకో చేశారు. ఎవరో రాస్తారోకో చేస్తే కేసీఆర్ పై పోలీసులు ఏ2 ముంద్దాయిగా కేసు పెట్టారు. తెలంగాణ ఉద్యమ కేసులు గత 15 సంవత్సరాలుగా ఎలాంటి విచారణ లేదు.

గోండుల హక్కుల కోసం పోరాడితే కేసులా ?
గోండుల హక్కుల కోసం పోరాటం జరిపిన ప్రస్థుత ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపై 2017లో 52 పోలీసు కేసులు పెట్టారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతోనే వెడ్మ బొజ్జుపై పోలీసులు కేసులు పెట్టారు. చిన్న చిన్న కారణాలు చూపించి 52 కేసులు పెట్టారు. ఇలా పోలీసులు రాజకీయ ఒత్తిళ్లలో 52 కేసులు పెట్టడంతో క్రిమినల్ ఎమ్మెల్యేగా రికార్డుల్లోకి ఎక్కారు.

పెట్టీ కేసులు ఎత్తివేయాలి : యం పద్మనాభరెడ్డి
తెలంగాణలోని కీలక నేతలపై పోలీసులు పెట్టిన పెట్టీ కేసులను తక్షణం ఎత్తివేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ యం పద్మనాభ రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రాన్ని సమర్పించారు. పోలీసులు నేతలు, ప్రజాప్రతినిధులపై నమోదు చేసిన పెట్టీ కేసులను పరిశీలించి వాటిని ఎత్తివేయాలని సీఎంను కోరారు. గతంలో కూడా జిల్లా కలెక్టరు లేదా డీజీపీ సలహాలతో పెండింగులో పెట్టీ కేసులను వాపసు తీసుకోవాలని పద్మనాభరెడ్డి సూచించారు.

రాజకీయ దురుద్ధేశంతోనే కేసులు : సోమ శ్రీనివాసరెడ్డి
రాజకీయ దురుద్ధేశంతో విపక్ష నేతలపై అధికార పార్టీ నేతలు పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి సోమ శ్రీనివాసరెడ్డి కోరారు. చిన్న చిన్న కేసులను విచారించకుండా ఏళ్లతరబడిగా పెండింగులో ఉన్నాయని ఆయన చెప్పారు. 2015లో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నేతలపై ఉన్న కేసులను ఎత్తివేశారని, అలా తెలంగాణలో నేతలపై ఉన్న పెట్టీ కేసులను పరిశీలించి ఎత్తివేయాలని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.


Tags:    

Similar News