హైదరాబాద్‌లో నోరోవైరస్,జికా, డెంగీ కేసుల కలవరం

హైదరాబాద్‌ నగరంలో నోరోవైరస్,జికా, డెంగీ కేసులు వ్యాప్తిచెందుతుండటంతో ప్రజలు కలవరపడుతున్నారు.ఈ రోగాల వ్యాప్తితో వైద్యఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.

Update: 2024-07-12 08:05 GMT

హైదరాబాద్ పాత నగరంలో నమోదవుతున్న నోరోవైరస్ కేసులతో ప్రజలు కలవరపడుతున్నారు. పాతబస్తీలోని ఆసుపత్రులకు ప్రతిరోజూ 25 నుంచి 30 మంది గ్యాస్ట్రోఎంటెరిటీస్ వ్యాధితో రోగులు వస్తున్నారు.

దీంతో పురానీ హవేలీలోని ప్రిన్సెస్ దుర్రు షెహ్వార్ చిల్డ్రన్స్ అండ్ జనరల్ హాస్పిటల్ రోగులతో కిటకిటలాడుతోంది. ఈ వైరస్ వల్ల మధ్య వయస్కులు, వృద్ధులు, గర్భిణీలు, కౌమారదశలో ఉన్న బాలికలు తీవ్రమైన కిడ్నీ గాయంతో సంక్లిష్టమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్ కు కారణమవుతుందని వైద్యులు చెప్పారు.
ఆసుపత్రుల్లో కిటకిట లాడుతున్న రోగులు
విరేచనాలు,వాంతులతో శరీరం వేగంగా డీహైడ్రేషన్ కు గురవుతున్నారు.దీనివల్ల మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం ద్వారా నోరో వైరస్ ప్రబలుతోంది. నోరోవైరస్ సోకిన రోగి ద్వారా ఇతరులకు కూడా వ్యాపిస్తుంది. గత రెండు వారాలుగా ప్రతిరోజూ 25 నుంచి 30 మంది రోగులు వస్తున్నారని పురానీ హవేలీలోని ప్రిన్సెస్ దుర్రు షెహ్వార్ చిల్డ్రన్స్ అండ్ జనరల్ హాస్పిటల్‌లోని కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ఎండీ ఫవాద్ అలీ ‘ఫెడరల్ తెలంగాణ’ కు చెప్పారు. పాత బస్తీలోని ప్రిన్సెస్ ఎస్రా హాస్పిటల్ కు వచ్చే రోగుల సంఖ్య బాగా పెరిగింది.

నోరో వైరస్ వ్యాప్తి
అజంపురా,ఈడీ బజార్,పురానీ హవేలీ,యాకుత్‌పురా,ఓల్డ్ మలక్‌పేట్ ప్రాంతాల్లో నోరోవైరస్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. తక్షణమే నివారణ చర్యలు చేపట్టకపోతే హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలకు నోరో వైరస్ వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.గ్యాస్ట్రోఎంటెరిటీస్ లక్షణాలతో ఆసుపత్రికి వచ్చే రోగుల్లో 2 నుంచి 5శాతం మందికి డయాలసిస్‌ చేస్తున్నామని వైద్యులు చెప్పారు. పాత నగరంలో వైరస్ వ్యాప్తికి ఆహారం, తాగునీరు కలుషితమే ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు.బయట ఆహారం తీసుకోకపోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా నోరోవైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చని వైద్యులు సూచించారు.

పెరుగుతున్న జికా వైరస్ కేసులు
దేశంలో 67 కొత్త జికా వైరస్ కేసులు వెలుగుచూశాయి. వీటిలో తెలంగాణలోనూ మొదట 2 కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19 మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో 2022వ సంవత్సరంలో జికా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని వారాలుగా జికా పాజిటివ్ కేసుల సంఖ్య 8కి పెరగినా, రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ వైరస్ నిరోధానికి పటిష్ఠమైన చర్యలు తీసుకోలేదు.

జూన్‌లో 263 డెంగీ కేసులు
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పరిశోధకుల అధ్యయనంలో కొత్త జికా వైరస్ కేసులు కనుగొన్నారు.తెలంగాణలో వర్షాలు కురుస్తుండటంతో డెంగీ కేసులు పెరుగుతున్నాయి.ఇప్పటికే 263 డెంగీ కేసులు నమోదయ్యాయి. డెంగీ,చికున్‌గున్యా జ్వరాలు పెరుగుతున్నాయని వైద్యులు చెప్పారు. జికా,డెంగీ వ్యాధులు ఏడిస్ దోమల ద్వారా వ్యాపిస్తున్నాయి.దీంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ జికా డయాగ్నస్టిక్ కిట్‌లను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది.మహారాష్ట్ర,కర్ణాటక,కేరళ రాష్ట్రాల్లో జికా వైరస్ కేసులు బయటపడ్డాయి.

డెంగీ నియంత్రణకు గట్టి చర్యలు
హైదరాబాద్ నగరంలో డెంగీ జ్వరాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్న తరుణంలో దీని నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలి కాటా వైద్య ఆరోగ్యశాఖ,ఎంటమాలజీ,శానిటేషన్ విభాగాల అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ, దోమలను నివారించడం ద్వారా డెంగీ, మలేరియా, చికెన్ గున్యా తదితర వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సజావుగా జరగాలన్నారు.ప్రజల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని,ఎంటమాలజీ అధికారికి సూచించారు.
దోమల నివారణకు స్పెషల్ డ్రైవ్ 
కమిషనర్ ఆమ్రపాలి కాట మాట్లాడుతూ, ప్రజలకు నమ్మకం కలిగించేలా ఆయా అధికారులు సమన్వయంతో పనిచేసి భరోసా కల్పించాలన్నారు.ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్స్ లో ప్రతి రూంలో దోమల నివారణకు స్ప్రే చేయాలని ఆమె ఆదేశించారు.అనంతరం జాయిన్ ది ఫైట్ అగెనెస్ట్ డెంగీ అన్న పోస్టర్ ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలి తో కలిసి ఆవిష్కరించారు.


Tags:    

Similar News