Revanth Reddy | సినిమా వాళ్లపైన సీఎం రేవంత్ సెటైర్లు

కొత్త సినిమాల బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2024-12-21 11:58 GMT

కొత్త సినిమాల బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎట్టిపరిస్థితుల్లో వీటికి అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది. పుష్ప-2 ప్రీమియర్స్‌లో భాగంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న సంధ్యథియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చాడు. ఆ సమయంలో అక్కడ తొక్కసలాట జరిగింది. అందులో రేవతి అనే మహిళ మరణించడంతో పాటు కుమారుడు శ్రీతేజ.. అప్పటి నుంచి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి బ్రెయిన్ డ్యామెజ్ అయినట్లు వైద్యులు చెప్తున్నారు. ఆ సమయంలోనే రాష్ట్రంలో ఇకపై బెన్‌ఫిట్ షోలో, ప్రీమియర్ షోలకు అనుమతులు ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కాగా తాజాగా సంధ్యథియేటర్ తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీలో కూడా చర్చ జరగడంతో మరోసారి బెన్‌ఫిట్ షోలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారిక ప్రకటన చేశారు. అసెంబ్లీలో ఈ అంశంపై ప్రభుత్వం ప్రకటన చేయాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ కోరడంతో ముందుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్బంగానే హీరో అల్లు అర్జున్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘‘ఒక్కరోజు అరెస్ట్ చేసినందుకు సినీ ప్రముఖులు, అభిమానులు అంతా కలిసి ప్రభుత్వాన్ని తిడుతున్నారు. సీఎంను తిడుతున్నారు. అరెస్ట్ అయిన ఆయన ఇంటి ముందు సెలబ్రిటీలు క్యూలు కట్టి మరీ కలుస్తున్నారు. పరామర్శిస్తున్నారు. కానీ బాధిత కుటుంబాన్ని కానీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని కానీ ఒక్క సెలబ్రిటీ అయినా పోయి కలిసి.. ఆ కుటుంబాన్ని పరామర్శించారా’’ అని ప్రశ్నించారు. అసలు ఈ సినిమా వాళ్ల ఆలోచన ఏంటో తనకు తెలియదంటీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే తెలంగాణలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్‌ షోల నిర్వహణపై మాట్లాడారు.

దేనికీ అనుమతివ్వను..: రేవంత్

‘‘తల్లి మరణించి, పిల్లాడు బ్రెయిన్ డ్యామేజ్ అయి ఉంటే ఒక్క సినిమా వ్యక్తి అయినా పోయి పరామర్శించారా. సినిమా వాళ్లు కావాలంటే మంచిగా బిజినెస్ చేసుకోండి.. సంపాదించుకోండి. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు తీసుకోండి, షూటింగ్‌లకు స్పెషల్ ప్రివిలేజ్ తీసుకోండి.. ఇన్సెంటివ్స్ తీసుకోండి. కానీ ఒక మనిషి ప్రాణం పోయిన తర్వాత మాత్రం ప్రత్యేక ప్రివిలేజ్ కావాలంటే కుదరదు. ఎవరైనా బాధ్యతగా ఉండాల్సిందే. ఇక నుంచి టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతులు ఉండవు. నేను సీఎంగా ఈ కుర్చీలో ఉన్నంత కాలం వాటిని అనుమతించను. మీ ఆటలు సాగనివ్వను. ఈ విషయంలో సినిమా వాళ్లు నన్ను విమర్శించారంటే పట్టించుకునేవాడిని కాదు. కొందరు రాజకీయ నాయకులు కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడారు. జాతీయ అవార్డు గ్రహితను అరెస్ట్ చేస్తారా అన్నారు. తెలంగాణ పేరును ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తిని ఇలా అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. మరికొందరు నీఛమైన భాష వాడి మరీ సీఎంను తిట్టారు. ప్రజల ప్రాణాలు తీస్తున్నా సినిమా వాళ్లు కాబట్టి, అవార్డులు అందుకున్న వాళ్లు కాబట్టి వాళ్లని ఏం చేయకూడా? స్టార్, ఫిల్మ్ స్టార్, సూపర్ స్టార్, పొలిటికల్ స్టార్‌కు ప్రత్యేక ప్రివిలేజ్ ఉందా? పోనీ వాళ్లు ఎన్ని హత్యలు చేసినా, ఏం చేసినా విచారణ, కేసు ఉండకూడదని ఒక చట్టం చేద్దామా?’’ అంటూ అసెంబ్లీలో ఘాటుగా ప్రశ్నించారు సీఎం రేవంత్.

Tags:    

Similar News