దేశంలోనే నిర్మల్ ఫస్ట్, ప్రభుత్వ పాఠశాలల్లో ఖగోళ శాస్త్ర ప్రయోగశాలలు
దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక అంతరిక్ష శాస్త్ర ప్రయోగశాలలు ప్రారంభించారు.;
By : Shaik Saleem
Update: 2025-07-21 00:41 GMT
నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గ్రామీణ ప్రభుత్వ పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ప్రయోగాత్మకంగా నిర్మల్ జిల్లాలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక అంతరిక్ష శాస్త్ర ప్రయోగశాలలను ప్రారంభించారు. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో నాలుగు అత్యాధునిక అంతరిక్ష శాస్త్ర ప్రయోగశాలలను కలెక్టర్ ప్రారంభించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యకు ఈ ప్రయోగశాలలు నమూనాగా నిలవనున్నాయి. ఈ ప్రయోగశాలల ప్రారంభం తెలంగాణ విద్యా సంస్కరణల్లో చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.
ఈ పాఠశాలలు ఎక్కడ ఏర్పాటు చేశారంటే...
నిర్మల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నాలుగు ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి రూ.20 లక్షల రూపాయల వ్యయంతో అంతరిక్ష ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు. తానూర్ మండలం బోసి గ్రామం, మామడ మండలం పోచల్ గ్రామం, సోన్ మండలం సోన్ గ్రామాల్లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు, నిర్మల్ మండలం అనంతపేట కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలల్లో అంతరిక్ష శాస్త్రంలో ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు.
ఎందుకంటే...
గ్రామీణ విద్యార్థులకు అంతరిక్ష శాస్త్రంపై శాస్త్రీయ అవగాహన, అభ్యాసం కల్పించాలనే ఉన్నతాశయంతో నాలుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఖగోళ శాస్త్ర ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల తరగతి గదుల్లోనే అత్యాధునిక మౌలిక సదుపాయాలతోపాటు అంతరిక్ష పరిశోధన సాధనాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగశాలల్లో హై-రిజల్యూషన్ టెలిస్కోప్, వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్, 3D సిమ్యులేషన్‌లతో కూడిన స్మార్ట్ టీవీ,ఉపగ్రహాలు, గ్రహాలు, సౌర వ్యవస్థ శాస్త్రీయ నమూనాలను తరగతి గదిలో ఏర్పాటు చేశారు.
పాఠశాల విద్యార్థులకు శాస్త్రీయ అవగాహన
ఇంటరాక్టివ్, వర్చువల్ సాధనాల ద్వారా గ్రామీణ పాఠశాల విద్యార్థులు ఇప్పుడు గ్రహాల కదలిక, నక్షత్ర నిర్మాణం, అంతరిక్ష సాంకేతికత, ఉపగ్రహ ఇంజనీరింగ్, జీవశాస్త్రం, భౌతిక శాస్త్ర విషయాల్లో సంక్లిష్టమైన శాస్త్రీయ విషయాలను అన్వేషిస్తారని ప్రభుత్వ ఉపాధ్యాయుడు జి వెంకటాచారి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గతంలో ఉన్నత సంస్థలలో మాత్రమే అందుబాటులో ఉండే పరికరాలను గ్రామీణ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
గ్రామీణ విద్యార్థులు శాస్త్రవేత్తలు కావాలి : కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైన్సులో ఉన్న ప్రతిభను గుర్తించి వారికి అంతరిక్ష పరిశోధన, సాంకేతికత, ఆవిష్కరణలపై ఆసక్తి కల్పిస్తామని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చెప్పారు. ఇస్రో, డీఆర్ డీఓ, నాసా ఇతర ప్రపంచ వేదికల్లో కెరీర్ లకు ఈ అంతరిక్ష ప్రయోగశాలలు తొలి మొట్టు అని కలెక్టరు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులు వ్యోమగామి లేదా శాస్త్రవేత్తలు కావాలని ఊహించుకకోవచ్చని, దీనికి ఈ అంతరిక్ష ప్రయోగశాలలు ఉపయోగపడతాయని కలెక్టరు వివరించారు.