ఎస్‌ఎల్‌బీసీ సహాయ పనుల్లో నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ బృందం
కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణతో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ సహాయ పనులు వేగవంతం అయ్యాయి.టన్నెల్ సహాయ పనుల్లో మంగళవారం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ బృందం రంగంలోకి దిగింది.;
By : Shaik Saleem
Update: 2025-03-04 13:58 GMT
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ సహాయ పనులు మంగళవారం వేగవంతం చేశారు. కన్వెయర్ బెల్టు పునరుద్ధరించడంతో మంగళవారం గంటకు 800 టన్నుల మట్టిని బయటికి చేరవేస్తున్నారు.ఢిల్లీ నుంచి మంగళవారం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం టన్నెల్ వద్దకు వచ్చి సహాయపనుల్లో దిగింది.
- మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లాలో దోమల పెంట ఎస్ ఎల్ బి సి టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పై సమీక్షా సమావేశాన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ , జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నిర్వహించారు.ఈ సమావేశంలో టన్నెల్ ఇన్ లెట్ ఆఫీస్ వద్ద రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్న బృందాల అధికారులతో జరిగిన సమీక్షలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టు (ఎస్ఎల్బీసీ) సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యలపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ డీజీపీ నాగిరెడ్డి, టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఆలీ, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్,కల్నల్ పరీక్షిత్ మెహ్ర, ఎన్డీఆర్ఎఫ్ అధికారి ప్రసన్న, హైడ్రా, సింగరేణి మైన్స్ రెస్క్యూ, ఎస్డీఆర్ఎఫ్ అధికారి, ఫైర్ సర్వీసెస్, దక్షిణ మధ్య రైల్వే ప్లాస్మా కట్టర్స్, ర్యాట్ మైనర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
అధికారుల సమీక్ష
టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, మైనింగ్, ఫైర్ సర్వీసెస్ బృందాల కృషి, ర్యాట్ మైనింగ్ ప్రత్యేకతలు, ప్లాస్మా కట్టర్స్ వినియోగం వంటి అంశాలపై సమీక్ష జరిగింది. రెస్క్యూ చర్యలను వేగవంతం చేయడం, బృందాల మధ్య సమన్వయం పెంచడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కన్వేయర్ బెల్ట్ ను పునరుద్ధరించిన కారణంగా గంటకు 800 టన్నుల మట్టిని బయటకు తీసుకురాగలమని అధికారులు వెల్లడించారు.టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాడార్ గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు
గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ ద్వారా గుర్తించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయని, కన్వేయర్ బెల్ట్ సిద్ధంగా ఉండటంతో వీలైనంత త్వరగా మట్టిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
రంగంలోకి ఎస్కలేటర్లు
రెండు ఎస్కలేటర్లను సిద్ధం చేసినట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ వెల్లడించారు. టన్నెల్ బోరింగ్ మిషన్ చివరి భాగాలను గ్యాస్ కట్టర్ ద్వారా తొలగించి లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకురానున్నట్లు ఆయన పేర్కొన్నారు.సహాయక చర్యలకు ఆటంకంగా మారుతున్న నీటిని ఎప్పటికప్పుడు పంపుల ద్వారా బయటకు పంపిస్తున్నట్లు వివరించారు. సహాయక బృందాలకు అవసరమైన ఆహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు.