Mohan Babu | ‘నేను పరారీ కాలేదు’..

మీడియాకు అదే నా విజ్ఞప్తి అని మోహన్ బాబు ఏం చెప్పారు.

Update: 2024-12-14 08:25 GMT

ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టవేయడంతో నటుడు మోహన్ బాబు పరారయ్యారు. పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. ముంబై వెళ్లినట్లు సమాచారం.. అంటూ శుక్రవారం సాయంత్రం నుంచి వార్తలు సోషల్ మీడియా సహా సాధారణ మీడియాలో కూడా హోరెత్తుతున్నాయి. జర్నలిస్ట్‌పై దాడి ఘటనకు సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మోహన్ బాబు కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై వాదోపవాదాలు విన్న న్యాయస్థానం.. ఆయన పిటిషన్‌ను కొట్టేసిందని, ఈ కేసులో మోహన్ బాబుకు ఊరట లభించలదేని వార్తలు హోరెత్తాయి. ఈ నేపథ్యంలోనే అరెస్ట్‌ నుంచి తప్పించుకోవడం కోసం మోహన్ బాబు పరారయ్యారని, ఎక్కడ ఉన్నారో కూడా తెలియదన్న వార్తలు కూడా జోరుగా వచ్చాయి. కాగా తాజాగా ఈ వార్తలపై మోహన్ బాబు స్పందించారు. ఇటువంటి అవాస్తవాలను ప్రచారం చేయడం సబబు కాదన్నారు. తానెక్కడికీ పారిపోలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు.

‘‘నాపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. నా ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం నిరాకరించలేదు. ప్రస్తుతం నేను వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాను. అది కూడా నా నివాసంలోనే ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్లిపోలేదు. ఒక వార్తను ప్రచురితం చేసే ముందు అందులోని నిజానిజాలను ఒకసారి సరిచూసుకోవాలని మీడియాను కోరుతున్నాను’’ అని మోహన్ బాబు వివరించారు.

అయితే జల్‌పల్లి ఫామ్ హౌస్‌లో మోహన్ బాబు, మనోజ్ మంచు మధ్య కొన్ని రోజులుగా తీవ్ర వివాదం నడుస్తోంది. వీరి ఇంటిపోరు కాస్తా రచ్చకెక్కడమే కాకుండా డీజీపీ ఆఫీసు వరకు చేరుకుంది. డిసెంబర్ 3వ తేదీన మనోజ్ దంపతులు తెలంగాణ అదనపు డీజీపీని కలిసి పరిస్థితిని వివరించారు. ఆ తర్వాత తిరిగి మోహన్‌బాబు ఇంటికి వెళ్లారు. కాగా అప్పటికే గేట్లకు తాళాలు వేసేయడంతో మనోజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. గేట్లు తోసుకుని ఇంట్లోకి వెల్లారు. ఈ ఉద్రిక్తల నడుమ మోహన్ బాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. మనోజ్ వెంటే లోపలికి వెళ్లిన మీడియాపై దాడి చేశారు మోహన్ బాబు. ఈ ఘటనకు సంబంధించి మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ విచారణ క్రమంలోనే మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు.

Tags:    

Similar News