Planting | మొక్కల రాజశేఖర్‌కు మోదీ ఆహ్వానం,ఈ పేరెలా వచ్చిందంటే...
కొత్తగూడెం జిల్లాకు చెందిన సింగరేణి కార్మికుడైన కొట్టూరు రాజశేఖర్‌ను ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు.ఎందుకంటే..;
By : Shaik Saleem
Update: 2025-01-25 13:08 GMT
కొత్తగూడెం సింగరేణిలో టెక్నిషీయన్ గా పనిచేస్తున్న కొట్టూరు నుర్వి రాజశేఖర్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ప్రత్యేక ఆహ్వానం పంపించారు. సాధారణ కార్మికుడికి ప్రధానమంత్రి నుంచి ప్రత్యేక ఆహ్వానం ఎందుకు పంపించారంటే కొత్త గూడెంలో మొక్కల రాజశేఖర్ గా పేరొందిన ఇతన్ని గురించి తెలుసుకోవాల్సిందే.
1671 రోజులుగా హరిత యాత్ర
సింగరేణిలో కార్మికుడిగా రాజశేఖర్ పనిచేస్తూనే విధి నిర్వహణ ముగిశాక మొక్కలు నాటడమే పరమావధిగా ఎంచుకొని ప్రతీ రోజూ ఒక మొక్క నాటుతూ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిని ఆకర్షించారు. ఇలా హరితయాత్ర ఆరంభించి శనివారం నాటికి 1671 రోజులు కావడంతో హైదరాబాద్ నగరంలోని బంధువుల ఇంట్లో ఓ మొక్క నాటి, భార్య కల్పన, కుమార్తె గాయత్రితో కలిసి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ వెళ్లే ముందు మొక్కల రాజశేఖర్ ‘ఫెడరల్ తెలంగాణ’ తో ప్రత్యేకంగా మాట్లాడారు. అయిదేళ్లుగా ప్రతీరోజూ ఓ మొక్క నాటుతూ పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్న కొట్టూరు నుర్వి రాజశేఖర్ పేరు మొక్కల రాజశేఖర్ గా మారింది. పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన రాజశేఖర్ కు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
నాన్న ఇచ్చిన స్ఫూర్తితో...
1980 వ సంవత్సరంలో టైలర్ అయిన పాండుకు మొక్కలంటే ప్రాణం. ఇంటి ఆవరణలోనే కూరగాయలు, పూలమొక్కలు నాటుతుండే పాండు తన పదకొండేళ్ల కుమారుడైన రాజశేఖర్ కు మొక్కలు నాటాలని కోరాడు. అంతే రాజశేఖర్ చిన్న నాటి నుంచి తండ్రి ఇచ్చిన స్ఫూర్తితో ప్రకృతి ప్రేమికుడిగా మారారు. సింగరేణిలో ఉద్యోగంలో చేరిన రాజశేఖర్ డ్యూటీ ముగిసిన తర్వాత ప్రతీ రోజూ రెండు గంటల సమయాన్ని మొక్కలు నాటడానికి, హరిత ప్రచారానికి వినియోగిస్తున్నారు.
గ్రీన్ మోటార్ వెహికిల్ గార్డెన్
నిత్యం మొక్కలు నాటుతూ హరిత ప్రచారం చేస్తున్న రాజశేఖర్ తన ద్విచక్రవాహనాన్ని గ్రీన్ మోటార్ వెహికిల్ గార్డెన్ గా తీర్చిదిద్దారు. 2016 వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు కూడా ప్రతిరోజు రాజశేఖర్ తన బైక్ పై ఒక పచ్చని మొక్కని,గ్లోబ్ ని స్థిరంగా అమర్చి ,మొక్కలు నాటుతూనే ఉన్నారు. గింజలు, మొక్కలు నాటి వాతావరణ సమతుల్యత కొసం వాటిని మహా వృక్షాలుగా చేయాలని ప్రచారం చేపట్టారు. ఉన్న చెట్లని కాపాడుకోవాలని, వన్య ప్రాణులను కాపాడుకోవాలని, కాటన్ బ్యాగ్స్ వాడాలని ప్రచారం చేపట్టారు. బైక్ పై ప్రతిరోజు ఏదైనా ఒక మొక్కను పెట్టుకొని ప్రచారం చేస్తూ వాహనాల నుంచి వచ్చే కాలుష్యం, వేడిని తగ్గించాలంటే ప్రతి వాహన దారుడు రోడ్ల వెంట మొక్కలు నాటాలని ప్రచారం చేపట్టారు. ‘‘మొక్కను , మాతృ భాష తెలుగు భాషను రక్షించు’’ అనే నినాదంతో కోటి గింజల సేకరణ , మొక్కలు నాటే కార్యక్రమం, గింజలు పంచే కార్యక్రమానికి రాజశేఖర్ 2022వ సంవత్సరంలో శ్రీకారం చుట్టారు.
మన్ కీ బాత్ కార్యక్రమంలో...
ప్రధానమంత్రి నరేంద్ర మోధీ శ్రీకారం చుట్టిన మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబరు 29వతేదీన జరిగిన 114వ కార్యక్రమంలో ప్రధాని మోదీ మొక్కల రాజశేఖర్ గురించి దేశవాసులకు వివరించి చెప్పి అభినందించారు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభించి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా దేశంలో వినూత్నంగా, స్వచ్ఛందంగా వివిధ రంగాల్లో సేవలు చేస్తున్న వారిని గుర్తించి రాజశేఖర్ తో పాటు పలువురికి ఢిల్లీలో కర్తవ్యపథ్ లో ఆదివారం(రేపు) జరిగే రిపబ్లిక్ డే వేడుకలు తిలకించేందుకు భారత ప్రభుత్వం తరపున మోదీ ఆహ్వానం పంపించారు.
ఫంక్షన్ ఏదైనా మొక్కలే బహుమతి...
మొక్కల రాజశేఖర్ ‘‘ప్లాస్టిక్ బొకేలు వద్దు - పచ్చని మొక్కలే ముద్దు’’ అనే నినాదాన్ని 2017 జులై 31వతేదీన ప్రారంభించారు. పెళ్లి అయినా, పుట్టినరోజైనా, బిడ్డ పుట్టినా, సమావేశమైనా వేడుక ఏదైనా అక్కడ మొక్కల రాజశేఖర్ ప్రత్యక్షమై మొక్కను బహుమతిగా అందజేస్తుంటారు. అధికారులకు, బంధుమిత్రులకు బొకేలు కాకుండా పచ్చని మొక్కలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపే సంప్రదాయాన్ని తానే ప్రారంభించానంటారు మొక్కల రాజశేఖర్. ఇంతకుముందు లేని ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎందరో బొకేలు బదులు మొక్కలు ఇస్తున్నారు.
ప్రకృతి హరిత దీక్ష
మొక్కలు నాటడాన్ని ప్రోత్సహించేందుకు ప్రకృతి హరిత దీక్ష కార్యక్రమాన్ని రాజశేఖర్ ప్రారంభించారు. భావితరాలకు రక్ష అనే కార్యక్రమానికి 2022వ సంవత్సరంలో శ్రీకారం చుట్టి అన్ని మతాల కి దీక్షలు ఉన్నట్టుగానే ప్రకృతికి కూడా దీక్షతో మొక్కలు నాటాలని చిన్నారుల నుంచి పెద్దవారి వరకు, ప్రముఖులకు ప్రకృతి హరిత దీక్షలు ఇచ్చి మొక్కలు నాటిస్తున్నారు.
మట్టి గణపతి
వినాయక చవితి కార్యక్రమంలో భాగంగా మట్టి గణపతి ని పూజిద్దాం అంటూ రాజశేఖర్ 2019వ సంవత్సరం నుంచి ప్రారంభించారు. గణేష్ నవరాత్రులలో దసరా నవరాత్రులలో వివిధ పండుగలకు దేవుళ్ళ తో పాటు మొక్కలను పూజించి భక్తులకు ప్రసాదంతో పాటు మొక్కలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.గణేష్ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేసి మొక్కలను మనకి కావాల్సిన చోట నాటాలని ప్రచారం చేపట్టానని రాజశేఖర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
మీ గూడు తో పాటు -పిచ్చుక గూడును పెట్టండి
మీ గూడు తో పాటు - పిచ్చుక గూడును పెట్టండి అనే కార్యక్రమాన్ని రాజశేఖర్ ఆరంభించారు. పిచ్చుక గూళ్లని ధాన్యపు గింజలను, మట్టి నీటి చిప్పలు అందిస్తూ జీవవైవిద్యం కోసం వన్యప్రాణుల ను కాపాడుకోవాలని ప్రచారం చేపట్టారు. చెట్లపై ఉన్న పక్షి గూళ్లను కోతులు ఆగం చేస్తున్నయి కాబట్టి , కోతులకు, ఇతర జీవులకు అందకుండా ఇంటి సూర్ల కింద మీకు నచ్చిన పక్షి గూళ్లను పెట్టాలని రాజశేఖర్ సూచించారు.
ఎన్నెన్నో అవార్డులు
మొక్కవోని దీక్షతో హరిత ఉద్యమ సైనికుడిగా రాజశేఖర్ సాగిస్తున్న హరిత యాత్రకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. 29-9-2024న 144వ మన్ కి బాత్ కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. 2019వ సంవత్సరం నుంచి సింగరేణి సంస్థ నుంచి నాలుగు సార్లు రాజశేఖర్ అవార్డులు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. గత ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా భద్రాద్రి జిల్లా కలెక్టర్ నుంచి ప్రశంసా పత్రం ప్రదానం చేశారు.యంగ్ ఇండియన్ బ్లడ్ డో నర్స్ క్లబ్ - భద్రాద్రి కొత్తగూడెం, హోప్ స్వచ్ఛంద సేవా సమితి - సూర్యాపేట, వి ఎన్ ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ - విజయవాడ, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ 2024, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కొణతాల రామలింగ స్వామి మెమోరియల్ ట్రస్ట్ పురస్కారం, వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి అవార్డులు అందకున్నారు.