బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటనపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
మీ పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన వారికే పదవులు ఇస్తారా? అని రాజాసింగ్ ప్రశ్నించారు.;
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు అంతా సిద్ధమయింది. ఒక్కోపార్టీ తమ అభ్యర్థిని ప్రకటిస్తున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దూరంగా ఉంటుంది. ఎంఐఎం అభ్యర్థికి మద్దతు పలకాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. అయితే తాజాగా హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. ఈ ఎన్నికలలో తమ పార్టీ తరుపు ఎన్ గౌతమ్ రావు పోటీ చేయనున్నట్లు బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. ఆయన హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. మే 1తో ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవీకాలం ముగియనుంది. దీంతో ఈ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్, 25న కౌంటింగ్ జరగనున్నాయి. అయితే ఇప్పుడు గౌతమ్ రావుకు టికెట్ ఇవ్వడం బీజేపీలో కలకలం రేపుతోంది. ఆయనకు టికెట్ ఇవ్వడాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తప్పుబడుతున్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు.
మీ పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన వారికే పదవులు ఇస్తారా? అని రాజాసింగ్ ప్రశ్నించారు. ‘‘బీజేపీలో సీనియర్ నేతలు, కార్యకర్తలు కనబడం లేదా? మీకు గులాంగిరీ చేసే వాళ్లకే పోస్ట్‌లు, టికెట్లు కేటాయిస్తున్నారు. అలా గులాంగిరి చేయని మిగిలినవాళ్లని పక్కబెడుతున్నారు. టికెట్ అనేది పార్టీకి చేసే సేవను చూసి ఇవ్వాలి కానీ.. మీకు చేరసే సేవను చూసి కాదు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. తెలంగాణ బీజేపీలో చీలికలు, విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయన్న అనుమానాలను రాజాసింగ్ మాటలు బలోపేతం చేస్తున్నాయి.
అయితే పార్టీ, పార్టీలోని నేతల తీరుపై రాజాసింగ్ విమర్శలు చేయడం ఇదేమీ తొలిసారి కాదు. ఇది వరకే కొందరు తనను కావాలని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. అదే విధంగా ఇటీవల పార్టీలోని కొందరు నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలంటే పాత సామానంతా బయటకు పోవాలన్నారు. అంతేకాకుండా సీఎం పదవిలో ఎవరు ఉంటే వారితో కొందరు లోపాయికారి మంతనాలు చేస్తున్నారని, ఇలా చేస్తే రాష్ట్రంలో పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాదని కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇప్పుడు గౌతమ్‌రావుకు ఎమ్మెల్సీ టికెట్ రావడాన్ని ఆయన తప్పుబట్టారు.