పాక్ క్షిపణి దాడులను తిప్పికొట్టిన మిసైల్ రూపకర్త తెలుగు బిడ్డ

పాక్ భారత్ పై ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను ఆకాశ్ క్షిపణులు నేలకూల్చాయి. పాక్ దాడులను తిప్పి కొట్టిన ఆకాశ్ క్షిపణులను తయారు చేసింది తెలుగు బిడ్డ రామారావు.;

Update: 2025-05-10 08:28 GMT
ఆకాశ్ క్షిపణిని తయారు చేసిన తెలుగుబిడ్డ డాక్టర్ ప్రహ్లాద్ రామారావు

ఆపరేషన్ సింధూర్ అనంతరం పాకిస్థాన్ టర్కీ క్షిపణులు, డ్రోన్లను భారతదేశ సరిహద్దుల్లోని పలు నగరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది.మే 8,మే 9వతేదీ మధ్య రాత్రి సమయంలో జమ్మూ కాశ్మీర్‌లోని పశ్చిమ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ ప్రయోగించిన పలు డ్రోన్ దాడులను భారత సైన్యం విజయవంతంగా తిప్పికొట్టింది.మేడ్ ఇన్ ఇండియా ఆకాశ్ క్షిపణి (Akash Missile)వ్యవస్థ ద్వారా పాకిస్తాన్‌ డ్రోన్లను విధ్వంసం చేసింది. పాక్ ప్రయోగిస్తున్న క్షిపణులు, డ్రోన్లను భారత సైన్యం ఆకాశ్ క్షిపణుల సాయంతో తిప్పి కొట్టింది. పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను నేలకూల్చిన ఆకాశ్ క్షిపణులను తయారు చేసింది హైదరాబాద్ డీఆర్ డీఓ శాస్త్రవేత్తగా పనిచేసి పదవీ విరమణ చేసిన తెలుగుబిడ్డ డాక్టర్ ప్రహ్లాద్ రామారావు. భారతదేశంలో తయారు చేసిన ఆయుధాలు కూడా శత్రువులను సమర్థవంతంగా ఢీకొంటాయని నిరూపించింది.


నా బిడ్డ ఆకాశ్ క్షిపణి
నాడు తయారు చేసిన ఆకాశ్ క్షిపణులు నేడు దేశంలోని సరిహద్దు ప్రాంతాల ప్రజలకు పాక్ దాడుల నుంచి రక్షణగా నిలిచాయి. తాను తయారు చేసిన ఆకాశ్ నేడు పాక్ క్షిపణులను సమర్ధవంతంగా ఎదుర్కోవడం చూసి తానెంతో సంతోషించాని రామారావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తన బిడ్డ లాంటి ఆకాశ్ క్షిపణి పాక్ దేశ ప్రయోగించిన వైమానిక లక్ష్యాలను తిప్పి కొట్టగలగడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని రామారావు పేర్కొన్నారు. పాక్ దాడిని తాను తయారు చేసిన క్షిపణులు తిప్పికొట్టగలగడం తన జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణం అని డాక్టర్ ప్రహ్లాద్ రామారావు చెప్పారు.



 పాక్ డ్రోన్లకు మేడ్ ఇన్ ఇండియా కౌంటర్

పాకిస్తాన్ ప్రయోగించిన టర్కీ డ్రోన్లకు మేడ్-ఇన్-ఇండియా ఆకాశ్ క్షిపణి గట్టి సమాధానం ఇచ్చింది. భారత సైన్యం స్వదేశీ సాంకేతికతతో ప్రహ్లాద రామారావు తయారు చేసిన ఆకాశ్ క్షిపణి పాకిస్తాన్ డ్రోన్ దాడులను విజయవంతంగా అడ్డుకుంది.ఇదీ భారత దళాల బలాన్ని,రక్షణ సాంకేతికత ప్రభావాన్ని నిరూపించింది. ఈ వ్యవస్థను మాజీ డీఆర్ డీఓ శాస్త్రవేత్త డాక్టర్ ప్రహ్లాద రామారావు నాయకత్వంలో రూపొందింది.తాను తయారు చేసిన క్షిపణి శత్రువుల వైమానిక లక్ష్యాలను ఇంత ఖచ్చితత్వంతో ఢీకొట్టడాన్ని చూశానని చెప్పారు.నా క్షిపణి అంచనాలకు మించి పనితీరును కనబర్చిందని చెప్పారు.

ఆకాశ్ ప్రత్యేకతలెన్నో...
'ఆకాశ్' ను డాక్టర్ ప్రహ్లాద్ రామారావు ఆధ్వర్యంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసింది.ఇదీ ఉపరితలం నుంచి గగనతలానికి మధ్యస్థ-శ్రేణి క్షిపణి రక్షణ వ్యవస్థ. ఈ క్షిపణులను భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తయారు చేసింది.'ఆకాశ్' ప్రత్యేకత ఏమిటంటే దీనిని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. దీన్నిట్రక్కులు లేదా ట్యాంకులు వంటి వాహనాల ద్వారా ఎల్‌ఓసి లేదా ఇతర సరిహద్దుల మీదుగా రవాణా చేయవచ్చు. దీని అధునాతన వెర్షన్ ఆకాష్-ఎన్‌జి 70 నుంచి 80 కి.మీ. వరకు దూసుకుపోతుంది. దీని వేగం గంటకు 2,500 కిలోమీటర్లు. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న 64 లక్ష్యాలను గుర్తించగలదు. ఇది ఒకేసారి 12 క్షిపణులను ప్రయోగించగలదు.ఈ క్షిపణికి స్మార్ట్ గైడెన్స్ సిస్టమ్ ఉంది.

15 ఏళ్ల పాటు పరిశోధించి...
హైదరాబాద్ కంచన్ బాగ్ లోని డీఆర్ డీఓలో ఆకాశ్ క్షిపణి తయారీ ప్రాజెక్టు కోసం అప్పటి మిస్సైల్ మ్యాన్ ఏపీజే అబ్దుల్ కలాం డాక్టర్ ప్రహ్లాద రామారావును 1983వ సంవత్సరంలో డైరెక్టరుగా నియమించారు. డీఆర్ డీఓలో వెయ్యిమంది శాస్త్రవేత్తలు, టెక్నీషియన్లు కలిసి తాను 15 ఏళ్ల పాటు శ్రమించి ఆకాశ్ క్షిపణిని తయారు చేశానని ప్రహ్లాద రామారావు గుర్తు చేసుకున్నారు. తాము రూపొందించిన క్షిపణిని హైదరాబాద్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేసింది. ఈ క్షిపణుల తయారీ ద్వారా 200 కంపెనీలకు చెందిన 20వేల మందికి ఉపాధి లభించిందని రామారావు చెప్పారు. ఆకాశ్ మిస్సైల్ బహుళ వాయు ముప్పుల నుంచి వాయు రక్షణను అందిస్తుందని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చెబుతోంది.

అవార్డులెన్నో...
ఆకాశ్ క్షిపణిని తయారు చేసిన డాక్టర్ ప్రహ్లాద్ రామారావుకు 2015వ సంవత్సరంలో కేంద్రప్రభుత్వం పద్మశ్రీ అవార్డునిచ్చి సత్కరించింది. స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థాన్ ఫ్రొఫెసర్ ఛాన్సలర్, డైరెక్టరుగా పనిచేశారు. ప్రస్థుతం 78 ఏళ్ల వయసులో సెంటర్ ఫర్ ఎనర్జీ రీసెర్చ్ చేస్తున్నారు. ఈయన ది పెనిన్సులా ఫౌండేషన్‌కు విశిష్ట సలహాదారు.ఆయన బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్,నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ లలో మేనేజ్‌మెంట్ విభాగంలో, ఏరోస్పేస్ విభాగంలో అనుబంధ ఫ్యాకల్టీగా ఉన్నారు.2011 నుంచి 2014 వరకు పూణేలోని డీమ్డ్ విశ్వవిద్యాలయం అయిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేస్తూ 2014లో పదవీ విరమణ చేశారు.


హైడ్రోజన్ బేస్‌డ్ ఎనర్జీపై పరిశోధనలు

రక్షణ రంగంలో ఆకాశ్ క్షిపణిని కనుగొని భారత దేశ సైనికబలగాలకు బలం అందించిన ప్రహ్లాద రామారావు పదవీ విరమణ చేసిన తర్వాత 78 ఏళ్ల వయసులోనూ ప్రజలకు తక్కువ ఖర్చుతో హైడ్రోజన్ విద్యుత్ ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. భారతదేశం పెట్రోలు, డీజిల్ ను దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో భవిష్యత్ లో ప్రత్య్నామ్నాయ ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తాను పరిశోధనలు చేస్తున్నానని ప్రహ్లాద రామారావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ప్రస్థుత మున్న విద్యుత్ ఖర్చు కంటే తక్కువ వ్యయంతో హైడ్రోజన్ బేస్ డ్ విద్యుత్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తాను పరిశోధనలు కొనసాగిస్తున్నానని తెలిపారు. వచ్చే రెండేళ్లలో తక్కువ ఖర్చుతో హైడ్రోజన్ సంబంధిత విద్యుత్ ను అందేలా చూస్తానని వివరించారు.




Tags:    

Similar News