రుణమాఫీ సరే.. రైతుభరోసా మెలిక ఏంటి?
మూడవ విడత రైతు రుణమాఫీ, రైతుభరోసా అమలుపై వ్యవసాయశాఖ మంత్రి మీడియా ఎదుట క్లారిటీ ఇచ్చారు.
మూడవ దశ రుణమాఫీ ఆగస్టు 15న ప్రకటించబడుతుందని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆగస్టు 15న వైరాలో సీఎం రేవంత్ రెడ్డి రూ.2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. రుణమాఫీ కానీ వారికి కూడా అదే రోజు అవుతుందని అన్నారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రుణమాఫీ కానీ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యవసాయ అధికారులు ప్రతి రైతు చెంతకు వెళతారన్నారు. రుణమాఫీ అమలు కాకపోవడానికి సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడంలో రైతులకు వారు సహాయం చేస్తారని చెప్పారు.
మొదటి దశలో సుమారు 17,000 మంది రైతులు రుణమాఫీకి సంబంధించిన సమస్యలను ఎదుర్కొన్నారు. అలాంటి దాదాపు 10,000 ఖాతాలకు సంబంధించి ఎదురైన సాంకేతిక సమస్యలు పరిష్కరించి, రుణాలు మాఫీ మొత్తాలు జమ చేయబడ్డాయని మంత్రి తెలిపారు. రెండవ దశలో, దాదాపు 30,000 ఖాతాలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నాయి. మూడవ దశ మాఫీ అమలులోకి వచ్చిన తర్వాత, అటువంటి సమస్యలన్నింటినీ పరిశీలించి, మాఫీ మొత్తాలు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మాఫీ ప్రయోజనం నిజమైన రైతులకు చేరేలా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ భుజానకెత్తుకుందని స్పష్టం చేశారు.
ఆలస్యంగానే రైతు భరోసా...
బీఆర్ఎస్ నేతలు ఇంకా రైతు భరోసా నిధులు విడుదల చేయకపోవడంపై ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్న విషయం తెలిసిందే. వానాకాలం వ్యవసాయ పెట్టుబడికోసం ఎదురుచూస్తున్న రైతులకు రైతు భరోసా నిధులివ్వకుండా ఆలస్యం చేయడాన్ని తప్పుబడుతున్నాయి. ఈ క్రమంలో రైతుభరోసా అమలుపైనా మంత్రి స్పష్టం చేశారు. రైతు భరోసా అమలుపై, లబ్ధిదారుల అర్హతపై ఒక నిర్ధారణకు వచ్చేందుకు ప్రభుత్వం ఇంకా వివిధ వర్గాల అభిప్రాయాన్ని తీసుకునే ప్రక్రియలో ఉందని మంత్రి చెప్పారు. సహాయం అమలు కోసం కౌలు రైతులు, భూమిని కలిగి ఉన్న రైతులకు సంబంధించి మరింత స్పష్టత అవసరం ఉందని మంత్రి వెల్లడించారు. ఇంకా మూడు నాలుగు జిల్లాల్లో రైతుల ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదని తెలిపారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలి ఇంకా అ గుర్తింపు పక్రియ కూడా మొదలు కాలేదు. ఈ వానా కాలం రైతు భరోసా కొంచెం లేట్ అవుతది. ఈ ప్రక్రియలో ప్రభుత్వం పూర్తిగా నిమగ్నమై ఉందని, అయినప్పటికీ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తుమ్మల తెలిపారు.