తెలంగాణ కాంగ్రెస్ కి ఊహించని తలనొప్పులు
14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ కి ఊహించని తలనొప్పులు మొదలయ్యాయి. మాదిగలకు పార్టీ అన్యాయం చేసిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పార్లమెంటు ఎన్నికలవేళ కాంగ్రెస్ పై మాదిగ సామాజికవర్గం నుండి వ్యతిరేక స్వరం వినిపిస్తోంది. టికెట్ల కేటాయింపులో తమకి అన్యాయం జరిగిందంటూ ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. టికెట్ల కేటాయింపుపై పునరాలోచన చేయాలని సూచిస్తున్నారు. లేదంటే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 14 జనరల్ స్థానాలుండగా.. 3 ఎస్సీ రిజర్వుడ్ స్థానాలున్నాయి. రాష్ట్రంలో 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ కి ఊహించని తలనొప్పులు మొదలయ్యాయి. ఎస్సీ సెగ్మెంట్లలో మాదిగలకు పార్టీ అన్యాయం చేసిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రెండు స్థానాల్లో తమ సామాజికవర్గానికి టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేసినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం పెడచెవిన పెట్టిందని ఆరోపిస్తున్నారు. కేవలం ఒక్క సీటులో, అది కూడా మాదిగ ఉపకులానికి చెందిన వారికి టికెట్ ఇచ్చారని మండిపడుతున్నారు.
రాష్ట్రంలో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 80 లక్షల మంది, ఎస్సీ మాల సామాజికవర్గ ఓటర్లు 17 లక్షలమంది. దీంతో పార్టీలు రిజర్వుడ్ స్థానాల్లో మెజారిటీ సీట్లను మాదిగ కులానికి కేటాయిస్తాయి. కానీ కాంగ్రెస్ ఈ సమీకరణలకు భిన్నంగా 3 రిజర్వుడ్ సెగ్మెంట్లలో రెండు సీట్లు మాల సామాజికవర్గానికే కేటాయించింది. పైగా వరంగల్ సీటుని మాదిగ సామాజికవర్గంలోని ఉపకులానికి చెందిన కడియం కావ్యకి కేటాయించారని ఆగ్రహంతో ఉన్నారు.
ఎంఆర్పీఎస్ వ్యవస్ధాపకులు మందక్రిష్ణ మాదిగ కాంగ్రెస్ తీరుకి వ్యతిరేకంగా 10 రోజుల పాటు ధర్నాలకు, దీక్షలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేస్తోందని, మాదిగలకు రెండు సీట్లు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. పార్టీ నేతలు కూడా అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి మాదిగలకు ఒక ఎంపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు నేతలు హస్తినబాట పట్టి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. హై కమాండ్ వద్దే తమ అసంతృప్తిని తెలియజేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీకి ప్రచారం చేస్తున్న మందకృష్ణ మాటలు నమ్మొద్దని సూచిస్తున్నారు. వర్గీకరణ కాంగ్రెస్తోనే సాధ్యమని, మాదిగ సామాజికవర్గానికి కాంగ్రెస్ న్యాయం చేసిందని చెబుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న మల్లిఖార్జున ఖర్గే స్వయంగా దళితవర్గానికి చెందినవాడేనని గుర్తు చేస్తున్నారు.
కానీ, కాంగ్రెస్ మాదిగ సామాజిక వర్గం నేతల నుండి నిరసన వ్యక్తం అవుతూనే ఉంది. తాజాగా మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నరసింహులు సైతం మీడియా ముందు అసంతృప్తిని బయటకి వెల్లడించారు. "పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం బాధ కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలనే మేమంతా పార్టీలో చేరాము. మాజీ సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ మాదిగలను చిన్నచూపు చూస్తున్నారనే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం. కానీ మా జాతి మొత్తాన్ని పక్కన పెట్టి అవమానించారు. నేను రాజకీయ లబ్ది కోసం మాట్లాడట్లేదు, పార్టీ మారె ఆలోచన లేదు. సీఎం రేవంత్ రెడ్డికి అన్నగా తన పక్కనే పని చేయాలనుకునే వ్యక్తిని. మాదిగల విషయంలో ఇదే ధోరణి కొనసాగితే పార్టీకి నష్టం తప్పదు" అని మోత్కుపల్లి హెచ్చరించారు.