Kavitha | తెలంగాణలో విద్యార్థుల మరణాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనా..?

తెలంగాణ రాష్ట్రంలో సంభవిస్తున్న విద్యార్థ మరణాలపై బీఆర్ఎస్ నేతలు మరోసారి గళమెత్తారు.

Update: 2024-11-23 11:43 GMT

తెలంగాణ రాష్ట్రంలో సంభవిస్తున్న విద్యార్థుల మరణాలపై బీఆర్ఎస్(BRS) నేతలు మరోసారి గళమెత్తారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజను ఈరోజు బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ కవిత(Kavitha), కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) వేరువేరుగా పరామర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) విమర్శలు వెల్లువెత్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం కూడా కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల కష్టాలను ప్రభుత్వం యుద్దప్రాతిపదికన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు బాగుంటే రాష్ట్రం, దేశం బాగుంటాయని అన్నారు. తమ సమస్యలను తెలపడం కోసం విద్యార్థులు రోడ్డెక్కినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న విద్యార్థి మరణాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హత్యలేనని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ప్రభుత్వం చేతకానితనం వల్లనే విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలించిన పదేళ్ల కాలంలో ఏనాడూ విద్యార్థులకు ఇన్ని కష్టాలు రాలేదని అన్నారు.

ప్రభుత్వం స్పందించాలి: కవిత

‘‘కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, శుభ్రమైన వసతిని అందించాలి. తమ పరిస్థితులకు వ్యతిరేకంగా విద్యార్థులు ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం’’ అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందే విద్యార్థి శైలజ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. శైలజ పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. శైలజ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వం మారిన 11 నెలల సమయంలోనే 42 మంది విద్యార్థులు మరణించడం అత్యంత బాధాకర విషయమని, ప్రతి విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని కవిత డిమాండ్ చేశారు.

ఇవి ప్రభుత్వ హత్యలే: కొప్పుల ఈశ్వర్

‘‘కలుషిత ఆహారం తిని విద్యార్థులు అనారోగ్యానికి గురికావడం బాధాకరం. బాగా చదువుకుని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుందామని ఎన్నో కలలు కంటున్న విద్యార్థులకు మరణాలకు ఆందోళనకరం. ఎన్నో ఆశలు, ఆశయాలను నెరవేర్చుకోవడం కోసం వసతి గృహంలో ఉండయినా చదవాడానికి సిద్ధమైన ఒక విద్యార్థి శైలజ ఇప్పుడు ఫుడ్ పాయిజన్ కారణంగా చావుతో పోరాటం చేస్తుండటం నా గుండెను పిండేస్తోంది. విద్యార్థుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి చూపిన నిర్లక్ష్యం ఖరీదు 42 మంది విద్యార్థుల ప్రాణాలు. హాస్టళ్లలో పురుగులన్నం తినలేక విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నా ప్రభుత్వం తనకు పట్టనట్లు వ్యవహరిస్తోంది. విద్యార్థులు తమకు కనీస అవసరాలు తీర్చాలంటూ రోడ్డెక్కినా కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం సోకలేకుండా వ్యవహరిస్తోంది. తెలంగాణలోని రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. శైలజకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన కోరారు. ఇదిలా ఉంటే వాంకిడి బాలికల పాఠశాల వసతి గృహం అంశంపై గతంలోనే మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంలా మారిందంటూ మండిపడ్డారు.

విద్యార్థులకు శాపంగా ప్రభుత్వ నిర్లక్ష్యం

‘‘ప్రభుత్వ నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపమవుతున్నది. సోకాల్డ్ ప్రజా పాలనలో అభం శుభం తెలియని పిల్లల భవిష్యత్తు ఆందోళనకరమవుతున్నది. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులు అస్వస్థత గురైతే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గం. స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో విడతల వారీగా విద్యార్థులను చేర్చి చేతులు దులుపుకుంటున్నారు తప్ప వారికి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేయడం లేదు. వెంటిలేటర్ మీదకు చేరిన ఆ విద్యార్థిని పరిస్థితికి ఎవరు బాధ్యులు. సకాలంలో వైద్యం అందించడంలో ఎందుకు విఫలం అయ్యారు. విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. రోజురోజుకి దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని నిలిపే ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటు’’ అని హరీష్ రావు పోస్ట్ పెట్టారు.

Tags:    

Similar News