పుణ్యకాలం గడచిపోయిన తర్వాత కేసీయార్ మేలుకుంటున్నారా ?

ఆమధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఈమధ్యనే జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు దీన్నే స్పష్టంచేస్తున్నాయి.

Update: 2024-06-18 07:08 GMT

ఇపుడున్న పరిస్ధితుల్లో సమీపభవిష్యత్తులో బీఆర్ఎస్ కోలుకోవటం కష్టమే. కాంగ్రెస్ గట్టిగా ఉన్నంతకాలం బీఆర్ఎస్ కోలుకోదన్నది వాస్తవం. ఒకవేళ కాంగ్రెస్ బలహీనపడినా ప్రత్యామ్నాయంగా జనాలు బీజేపీ వైపు చూస్తారే కాని కారుపార్టీవైపు చూసేందుకు అవకాశాలు తక్కువే. ఆమధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఈమధ్యనే జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు దీన్నే స్పష్టంచేస్తున్నాయి.

కారుపార్టీ వైభోగం పదేళ్ళ అధికారంతో ముగిసిపోయిందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉన్నపుడు ఏ పార్టీ అయినా బాహుబలిలాగ కనబడుతుంది. అదే ప్రతిపక్షంలోకి వచ్చినపుడు ఎలా కనబడుతుంది అన్నదే కీలకమైన పాయింట్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బాహుబలిలాగ అంతకుముందు కనిపించిన కారుపార్టీకి ఇప్పుడు దిక్కుతోచటంలేదు. పార్లమెంటు ఎన్నికల్లో 17 నియోజకవర్గాటల్లో ఒక్కచోట కూడా గెలవకపోవటమే ఈ దుస్ధితికి కారణమైంది. ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు విపరీతంగా ప్రచారం అవుతోంది. ఇదే నిజమైతే కారుపార్టీ పని దాదాపు ముగిసిపోయిందనే అనుకోవాలి.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ను ఎంచుకున్న జనాలు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూశారు కాని బీఆర్ఎస్ వైపు చూడలేదు. తెలంగాణాలో తనకు ఎదురన్నదే ఉండకూడదని, అసలు ప్రతిపక్షమన్నదే ఉండకూడదని కేసీయార్ ఆలోచించారు. ముందు టీడీపీని భూస్ధాపితం చేసి తర్వాత కాంగ్రెస్ ను చీలికలు పీలికలు చేశారు. ఏదో అదృష్టంకొద్ది కాంగ్రెస్ నిలదొక్కుకున్నది. టీడీపీని దెబ్బతీసి, కాంగ్రెస్ ను బలహీనం చేసేసరికి జనాలు అనివార్యంగా బీజేపీకి ఓట్లేశారు. అంటే కేసీయార్ ఒకటికి తలిస్తే జనాలు మరొకటి తలచారు. కేసీయార్ కు వ్యతిరేకంగా టీడీపీ, కాంగ్రెస్ కు ఓట్లేయటానికి ఇష్టపడని జనాలు వేరేదారిలేక బీజేపీకి వేశారు. దాని ఫలితంగానే 2019 ఎన్నికల్లో బీజేపీ నాలుగు పార్లమెంటు సీట్లలో గెలవటం. అంటే బీజేపీ బలపడటం కేసీయార్ పుణ్యమనే చెప్పాలి.

ఈమధ్యనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లలో కాంగ్రెస్, బీజేపీ చెరి 8 సీట్లను పంచుకున్నాయి. ఒక్కసీటును ఎంఐఎం నిలుపుకోవటంతో బీఆర్ఎస్ ఒక్కచోట కూడా గెలవలేదు. 14 నియోజకవర్గాల్లో కారుపార్టీ మూడోప్లేసులో నిలబడింది. ఇంతకంటే అవమానం ఏమిటంటే 8 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు అసలు డిపాజిట్టే దక్కలేదు. పార్టీకి ఈ దుస్ధితి రావటానికి కేసీయారే కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పదేళ్ళ పాలనకు, పార్టీ నిర్వహణకు ఫలితమే ఘోరపరాజయం. పార్టీ తరపున గెలిచిన ఎంఎల్ఏలు, ఎంఎల్సీల్లో చాలామంది కాంగ్రెస్ లో చేరటానికి రంగం సిద్ధమైందనే ప్రచారం పెరిగిపోతోంది. ఈ సమయంలో పార్టీని ప్రక్షాళన చేయాలని కేసీయార్ అనుకున్నారు. గ్రామస్ధాయి నుండి రాష్ట్రస్ధాయివరకు కమిటీలను ప్రక్షాళన చేస్తారట. కొడుకు కేటీయార్ ను వర్కింగ్ ప్రెసిడెంటుగా పక్కనపెడతారని అంటున్నారు. అయితే ఇది జరిగేంతవరకు నమ్మకంలేదు.

ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును రెండుకు పెంచబోతున్నారని పార్టీవర్గాల సమాచారం. ఒకటి ఎస్సీ, మరోటి బీసీకి కేటాయిస్తారట. పార్టీ కమిటీల్లో బీసీలకు, యువతకు, ఉద్యమకారులకు పెద్ద పీట వేయాలని కేసీయార్ ఆలోచిస్తున్నట్లు లీడర్లు చెబుతున్నారు. అధికారంలో ఉన్నపుడు పై అంశాల్లో దేన్నీ పట్టించుకోని కేసీయార్ ప్రతిపక్షంలోకి వచ్చి పార్టీ కుదేలైపోతున్నపుడు మేల్కొన్నట్లున్నారు. పార్టీలో నుండి ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు వెళిపోతే అప్పుడు రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో నేతలు, క్యాడర్ లేక పార్టీ దెబ్బతినటంఖాయం. అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్షాలను కేసీయార్ ఏ విధంగా చీల్చిచెండాడారో అదే పరిస్ధితిని ఇపుడు తాను ఎదుర్కొంటున్నారు. మొత్తానికి తెలంగాణా రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. దీన్ని కేసీయార్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Tags:    

Similar News