వైఫల్యాలకు కేసీయార్ షుగర్ కోటింగ్
రెండు ఎన్నికల్లో వరుస ఓటములపై కేసీయార్ నిజాయితీగా కారణాలను విశ్లేషించుకున్నట్లు కనబడటంలేదు.
రెండు ఎన్నికల్లో వరుస ఓటములపై కేసీయార్ నిజాయితీగా కారణాలను విశ్లేషించుకున్నట్లు కనబడటంలేదు. ఎంతసేపు జనాలకు కాంగ్రెస్ మోసపూరితమైన హామీలు ఇవ్వటమే బీఆర్ఎస్ ఓటమికి కారణమని పదేపదే చెబుతున్నారు. ఎన్నికల్లో హామీలను కేసీయార్ ఇచ్చారు, కాంగ్రెస్ ఇచ్చింది అలాగే బీజేపీ కూడా చాలా హామీలనే ఇచ్చింది. అన్నీ పార్టీల హామీలను బేరీజు వేసుకున్న జనాల్లో మెజారిటి హస్తంపార్టీకి ఓట్లేసి గెలిపించారు. ఇందులో జనాలను కాంగ్రెస్ మోసంచేసిందేముందో అర్ధంకావటంలేదు.
పదేళ్ళు పాలించిన బీఆర్ఎస్ పై జనాల్లో వ్యతిరేకత పెరగటం చాలా సహజం. పార్టీ ఓటమికి కేసీయార్ నిజాయితీగా విశ్లేషించుకుంటే కారణాలు చాలానే బయటపడతాయి. కాని కేసీయార్ ఆపని చేయకుండా కాంగ్రెస్ ను నిందిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సమీక్షలు చేయాలని నియోజకవర్గాల్లోని నేతలు పట్టుబడితే కొన్ని నియోజకవర్గాల్లో సమీక్షలు చేసిన కేటీయార్ తర్వాత అర్ధాంతరంగా నిలిపేశారు. సమీక్షలను నిలిపేసిన తర్వాత కేసీయార్, కేటీయార్ తొందరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో దుమ్ములేపేస్తామంటు నానా హంగామా చేశారు. తీరాచూస్తే 17 సీట్లలో 17 చోట్లా పార్టీ ఓడిపోయింది. గమనించాల్సింది ఏమిటంటే 8 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్ధులకు డిపాజిట్లు కూడా రాలేదు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిందంటే ఏదోలే అనుకుని సరిపెట్టుకోవచ్చు. మరి పార్లమెంటు ఎన్నికల్లో 17 నియోజకవర్గాల్లో ఓడిపోవటం ఏమిటి ? 8 చోట్ల డిపాజిట్లు కూడా రాకపోవటం ఏమిటనే విషయంలో కేసీయార్ విశ్లేషణ చేసుకున్నారా ? నేతలతో సమీక్షించి ఘోరపరాజయానికి కారణాలను విశ్లేషించినట్లయితే కనబడలేదు. తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పార్టీని ఎలాగ గెలిపించాలనే విషయంలో కూడా సమావేశాలు పెట్టినట్లు లేరు. అలాంటిది రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మళ్ళీ షుగర్ కోటింగ్ మాటలు మాట్లాడారు. పార్టీకి చెందిన జిల్లా పరిషత్ ఛైర్మన్లతో పాటు వాళ్ళ కుటుంబాలతో కేసీయార్ ఆత్మీయ సమావేశం జరిపారు. ఈ సందర్భంగా కేసీయార్ చెప్పిన మాటల్లో నాలుగు పాయింట్లను గమనించాలి.
అవేమిటంటే తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్నారు. ఇందులో కేసీయార్ ను తప్పుపట్టాల్సిందేమీ లేదు. అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 15 ఏళ్ళు పాలిస్తుందట. పరిపాలించటంలో 15 ఏళ్ళు మాత్రమే కేసీయార్ ఎందుకని పరిమితి పెట్టుకున్నారో తెలీదు. ఇక రెండో పాయింట్ ఏమిటంటే రెండేళ్ళలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందట. పునర్విభజనలో భాగంగా నియోజకవర్గాల సంఖ్య 119 నుండి 160కి పెరుగుతాయన్నారు. ఇదెంత వరకు నిజమో కేంద్ర హోంశాఖ, కేంద్ర ఎన్నికల కమీషనే చెప్పాలి. మూడో పాయింట్ ఏమిటంటే పెరగబోయే సీట్ల సంఖ్య దామాషాలో మహిళలకు ఎక్కువ అవకాశాలు దక్కుతాయట. 119 సీట్ల దామాషాలో మహిళలకు ఎన్నిసీట్లు కేటాయించారో చెబితే బాగుంటుంది. నాలుగో పాయింట్ ఏమిటంటే అధికారంలోకి రాగానే పిచ్చి పిచ్చి పనులు చేసి జనాలతో చీ అనిపించుకుని అధికారం కోల్పోయే లక్షణం కాంగ్రెస్ కు ఉందని చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలో నుండి దిగిపోవటం సంగతి దేవుడెరుగు. ముందు స్ధానికసంస్ధల ఎన్నికల్లోపు పార్టీని బలోపేతంచేయటం, ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించటం ఎలాగనే విషయాన్ని కేసీయార్ ఆలోచిస్తే బాగుంటుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా పార్టీ ఘోరంగా ఓడిపోతే అప్పుడు కిందిస్ధాయి నేతల్లో చాలామంది పార్టీలో ఉండేది అనుమానమే. మొత్తంమీద జిల్లా పరిషత్ ఛైర్మన్లు పార్టీని వదిలేసి పోకుండా కేసీయార్ షుగర్ కోటింగ్ మాటలతో వాళ్ళల్లో ఆశలు నింపే ప్రయత్నం చేయటం బాగుంది. మరి కేసీయార్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాల్సిందే.