ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు కేసీయార్కు ఇప్పటికి గుర్తుకొచ్చారా ?

కేసీయార్ పార్టీ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో పాటు కొందరు సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. భేటీ అవటమే కాకుండా వాళ్ళతో సుదీర్ఘంగా మంతనాలు జరిపి తర్వాత భోజనం కూడా చేశారు.

Update: 2024-06-26 06:40 GMT

మంగళవారం ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరిగింది. అదేమిటంటే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి పార్టీ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో పాటు కొందరు సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. భేటీ అవటమే కాకుండా వాళ్ళతో సుదీర్ఘంగా మంతనాలు జరిపి తర్వాత భోజనం కూడా చేశారు. పార్టీ నేతలను, ప్రజాప్రతినిధులను కేసీయార్ కలవటం చాలా అరుదనే చెప్పాలి.

అధికారం పోయిన తర్వాత అందులోను కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ముమ్మరంగా అమలు చేస్తున్న నేపధ్యంలో కేసీయార్ కు జ్ఞానబోధ అయినట్లుంది. అందుకనే సడెన్ గా పార్టీ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, సీనియర్ నేతలు గుర్తుకొచ్చారు. వెంటనే తన ఫామ్ హౌస్ కు పిలిపించుకుని సుదీర్ఘంగా భేటీ జరిపారు. తర్వాత వాళ్ళతో లంచ్ కూడా చేశారు. ఈ విషయం పార్టీ యాంగిల్లో చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే అధికారంలో ఉన్న పదేళ్ళల్లో మంత్రులతో పాటు ఎవరినీ కేసీయార్ కలిసిందిలేదు. మంత్రులు, ఎంఎల్ఏలతో పాటు నేతలు చివరకు ఉన్నతాధికారులకు కూడా ఎంత అత్యవసరమైనా కేసీయార్ కలిసింది చాలా చాలా తక్కువ. ఫామ్ హౌస్ లోకి ఎవరికీ ఎంట్రీలేదు. ఎవరితో అయినా మాట్లాడాలని, భేటీ అవ్వాలని కేసీయార్ అనుకుంటే మాత్రమే వాళ్ళని ఫామ్ హౌస్ లోకి రానిచ్చేవారు.

అత్యవసరమై కేసీయార్ ను కలవటానికి వెళ్ళిన మంత్రులకు అవకాశంలేక తిరిగి వెనక్కు వెళ్ళిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. రోజుల తరబడి పార్టీ, ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడకుండా కేసీయార్ ఫామ్ హౌస్ లో ఉండిపోవటంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్ని ఆరోపణలు చేశారో అందరికీ తెలిసిందే. ఎవరెన్ని ఆరోపణలు చేసినా, ఎంత గోలచేసినా కేసీయార్ ఎవరినీ లెక్కచేయలేదు. పదేళ్ళు హ్యాపీగా ఫామ్ హౌస్ లోనే కేసీయార్ గడిపేశారు. అలాంటిది అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత అయినా ప్రజాప్రతినిధులను కలిశారా అంటే అదీలేదు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఫలితాలపై కేసీయార్ పెద్దగా సమీక్షించింది కూడా లేదు. సమీక్షలను వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీయారే నిర్వహించారు. కొన్ని నియోజకవర్గాల్లో సమీక్షల్లో గొడవలైతే సమీక్షలను అర్ధాంతరంగా ముగించేశారు.

పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత కేసీయార్ నేతలను పెద్దగా ఎవరినీ కలవలేదు. అవసరమైన వాళ్ళతో ఫోన్లో మాట్లాడినట్లు పార్టీవర్గాల సమాచారం. అలాంటిది ఇంత హఠాత్తుగా ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, సీనియర్ నేతలతో కేసీయార్ భేటీ అవటం, భోజనం చేయటం అంటే ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కాక మరేమవుతుంది. ఇంతకీ ఎందుకింత సడెన్ గా భేటీ అయినట్లు ? ఎందుకంటే అదేదో సినిమాలో ‘అంతా తావీదుమహిమ’ అన్న డైలాగులాగ ‘ఆపరేషన్ ఆకర్ష్’ అనే చెప్పాలి. బీఆర్ఎస్ ఎంఎల్ఏలను ఆకర్షించేందుకు రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపారు. ఇప్పటికి ఐదుగురు ఎంఎల్ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇంకా చాలామంది ఉన్నారని, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎంఎల్ఏలపైనే రేవంత్ టార్గెట్ పెట్టారనే ప్రచారం అందరికీ తెలిసిందే.

పార్టీ ఎంఎల్ఏలను పట్టిపెట్టుకోకపోతే అసెంబ్లీలో పార్టీ ఉనికే ప్రమాధంలో పడుతుందనే టెన్షన్ కేసీయార్లో పెరుగుతున్నట్లుంది. అందుకనే అర్జంటుగా గ్రేటర్ పరిధిలోని ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. సరే, కేసీయార్ భేటీ జరిగినంత మాత్రాన వెళ్ళదలచుకున్న ఎంఎల్ఏలు ఆగిపోతారా ? సమస్యేలేదు. ఇపుడు నడుస్తున్నదంతా పవర్ పాలటిక్స్. పవర్ పాలిటిక్స్ అంటేనే డబ్బుతో ముడిపడిన విషయాలు. వ్యాపారాలు, బిజినెస్సులను రక్షించుకోవటం, కేసులుంటే వాటిల్లో నుండి బయటపడటమే ముఖ్యం. ఇవి జరగాలంటే అధికారపార్టీలో ఉంటేనే సాధ్యం. అందుకనే ఎలాంటి మొహమాటంలేకుండా ప్రజాప్రతినిధులు ప్రతిపక్షంలో నుండి అధికారపార్టీలోకి జంప్ చేసేస్తున్నారు. కాబట్టి ఎంఎల్ఏలు వెళ్ళిపోదలచుకుంటే కేసీయార్ ఎన్ని మీటింగులు పెట్టినా ఆగరు. ఎందుకంటే తాజా మీటింగుకు గ్రేటర్ పరిధిలోని గూడెం మహిపాల్ రెడ్డితో పాటు ఉప్పల్, ఎల్బీనగర్, మేడ్చల్, మల్కాజ్ గిరి, సనత్ నగర్, సికింద్రాబాద్, మహేశ్వరం ఎంఎల్ఏలు గైర్హాజరయ్యారు.

కేసీయార్కు ఆపరేషన్ ఆకర్ష్ భయం లేకపోయుంటే ఇప్పటికి కూడా ఎంఎల్ఏలకు అందుబాటులో ఉండేవారు కాదేమో. ప్రజా ప్రతినిధులు, నేతలను కలవకపోతే పార్టీ ఉనికే ప్రమాదంలో పడుతుందన్న భయంవల్లే కేసీయార్ అందరితో భేటీ అయినట్లు అర్ధమవుతోంది. మొదటినుండి ప్రజాప్రతినిధులు, నేతలకు సమయాన్ని కేటాయించి అవసరమైన వాళ్ళందరితోను మాట్లాడుతు ఉండుంటే పార్టీకి ఇపుడీ పరిస్ధితి వచ్చి ఉండేదికాదేమో. పైగా ఇపుడు పార్టీ ఫిరాయిస్తున్న చాలామంది ఒకపుడు కాంగ్రెస్, టీడీపీలో నుండి బీఆర్ఎస్ లో చేరిన వాళ్ళే. దానం కాంగ్రెస్ నుండి వస్తే కడియం, పోచారం టీడీపీలో నుండి వచ్చారు. వచ్చిన వాళ్ళంతా అప్పట్లే కేసీయార్ ఆపరేషన్ ఆకర్ష్ కారణంగానే తమ పార్టీల్లో నుండి బీఆర్ఎస్ లోకి పిరాయించారు. అంటే ఇతర పార్టీల్లో నుండి బీఆర్ఎస్ లోకి ఎలాగ వచ్చారో ఇపుడు అలాగే పార్టీలో నుండి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతున్నారు. తాజా మీటింగుకు డుమ్మా కొట్టిన ఎనిమిది మంది ఎంఎల్ఏల్లో నలుగురు ఢిల్లీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి వీళ్ళు ఎందుకెళ్ళారు, ఏమి జరగబోతోందన్నది చాలా ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News