పొత్తులపై కేసీఆర్ హింట్..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొత్తులపై తన వైఖరిని బయటపెట్టారు. భవిష్యత్తులో పొత్తు అవకాశాలు ఉంటాయా లేదా అనే విషయంపై మనసులో మాట బయటపెట్టారు.

By :  Vanaja
Update: 2024-05-08 17:09 GMT

అవినీతి ఆరోపణలపై తనను అరెస్టు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కుట్ర పన్నారని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అయితే అవినీతికి సంబంధించిన ఆధారాలు దొరకకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైందని, ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీపై దుష్ప్రచారం చేసి అణిచివేసేందుకు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

స్థానిక మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, కేసీఆర్ మాట్లాడుతూ.. అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌లను బీజేపీ టార్గెట్ చేసినట్లే, తనను అవినీతి కేసుల్లో ఇరికించేందుకు మోదీ శాయశక్తులా ప్రయత్నించారని అన్నారు. అయితే, బీజేపీ తనపై అవినీతికి సంబంధించిన ఆధారాలను చూయించలేకపోవడంతో, ప్రయత్నాలు ఫలించలేదన్నారు. తన కుమార్తె MLC కవిత అరెస్టుపై స్పందిస్తూ... ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీని తిప్పికొట్టినందుకే ప్రతీకార చర్యగా ఆమెను అరెస్ట్ చేశారన్నారు. కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నట్లుగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య ఎలాంటి పొత్తు లేదని కవిత అరెస్ట్‌ అందుకు నిదర్శనమని కేసీఆర్ అన్నారు.

మోదీ సమయం ముగిసిపోయిందని పేర్కొన్న కేసీఆర్... మోదీ తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, వర్గ విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయనను ప్రజలు సహించడానికి సిద్ధంగా లేరని అన్నారు. "బిజెపి అంత బలంగా ఉంటే, ప్రధానమంత్రి మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు" అని ఆయన అన్నారు.

బీఆర్‌ఎస్, ఇతర ప్రాంతీయ పార్టీలు కలిసి జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని అంచనా వేస్తూ, బీజేపీ ప్రభావం తగ్గుతుందని, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఆ పార్టీ 10 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం లేదని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలను ఖర్చుచేస్తోందన్న బీజేపీ వ్యాఖ్యల్లో నిజముంటే మోదీ బహిరంగ చర్చకు రావాలన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల కంటే తెలంగాణ దేశానికి చేసిందే ఎక్కువ అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలనపై కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఐదు నెలల్లోనే ప్రజలు నిరాశకు గురయ్యారని పేర్కొన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కనీసం 12 స్థానాల్లో గెలుస్తుందని సాధిస్తుందని, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నొక్కి చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా తన బస్సు యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చని వాగ్దానాల వల్ల ప్రజల్లో అసంతృప్తి నెలకొందని, ఇది బీఆర్‌ఎస్‌కు మద్దతు పెరగడానికి దారితీసిందని ఆయన పేర్కొన్నారు. తన ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి ప్రవర్తన, ఆయన భాష కాంగ్రెస్ పార్టీ అవకాశాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తోందని ఆయన విమర్శించారు.

పొత్తులపై కేసీఆర్ హింట్..

లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుందని అంచనా వేసిన కేసీఆర్ పొత్తుల మార్పుపై కూడా హింట్ ఇచ్చారు. సరైన సమయంలో బీఆర్ఎస్ తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఫిరాయింపులపై స్పందిస్తూ.. అది వ్యక్తుల అవకాశవాద నైజం, వీటి వలన పార్టీకి వచ్చే నష్టమేమి లేదన్నారు.

Tags:    

Similar News